అమీన్ పూర్ చక్రపురి లేఔట్ లో రూ. వంద కోట్ల విలువైన రోడ్లు, పార్కు స్థలాలను కాపాడిన హైడ్రా

అమీన్ పూర్ చక్రపురి లేఔట్ లో రూ. వంద కోట్ల విలువైన రోడ్లు, పార్కు స్థలాలను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ అమీన్ పూర్ లోని చక్రపురి లేఔట్ లో రూ. వంద కోట్ల విలువైన రోడ్లు, పార్కు స్థలాన్ని కాపాడింది హైడ్రా. లేఔట్ లోని ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఆదివారం ( ఫిబ్రవరి 8 ) రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణల తొలగింపు చేపట్టింది. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. పొలిసు రెవెన్యూ అధికారులతో కలిసి 15 జేసీబీల సాయంతో ఆక్రమణలు తొలగించారు హైడ్రా సిబ్బంది.

40 సంవత్సరాల క్రితం హుడా అనుమతితో వేసిన లేఔట్ ను కబ్జా చేసిన ఓ ప్రైవేటు వ్యక్తి కబ్జా చేశారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. లేఔట్ లోని నాలుగు ఎకరాల స్థలాన్ని ఆక్రమించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణలు తొలగించింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్​న‌గ‌రంలో మూడు చోట్ల ఆక్రమ‌ణ‌ల‌కు గురైన రూ.500 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. 

మేడ్చల్- మ‌ల్కాజిగిరి జిల్లా దూల‌ప‌ల్లి విలేజ్‌లోని సుమారుకుంట‌లో అక్రమ క‌ట్టడాల‌ను తొల‌గించింది. 42 ఎక‌రాల ప‌రిధిలో ఈ చెరువు విస్తరించి ఉంది. శిఖం ప‌ట్టా ఉందంటూ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో మ‌ట్టి నింప‌డం, ప‌లు నిర్మాణాలు చేప‌ట్టడంతో హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. 

ఇలా11 ఎక‌రాల మేర ఆక్రమ‌ణ‌లు గుర్తించిన హైడ్రా  వాటిని తొల‌గించింది. యూసుఫ్​గూడలో స‌ర్వే నంబ‌ర్​128/1 లోని మూడున్నర ఎక‌రాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. 3.20 ఎక‌రాల భూమిలో ఇసుక వ్యాపారాలు, ఇటుక వ్యాపారాలతో పాటు వెల‌సిన తాత్కాలిక షెడ్లను తొల‌గించింది.   

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా  నాగారం రామకృష్ణ నగర్ కాలనీ (హెచ్ఎంటీ లేఔట్) లోని శివాల‌యానికి చెందిన 1,365 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. 2017లో 400 గజాల్లో శివాల‌యం నిర్మించగా మిగిలిన భూమి ఖాళీగా ఉంది. కొంత‌మంది స్థానికులు క‌బ్జా చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని రామ‌కృష్ణాన‌గ‌ర్ కాల‌నీ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 1,365 గ‌జాల స్థలం గుడికికి చెందిన‌దిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది.