మెటీరియల్ పంపిణీ సజావుగా జరగాలి : కలెక్టర్ కె.హైమావతి

మెటీరియల్ పంపిణీ సజావుగా జరగాలి : కలెక్టర్ కె.హైమావతి

చేర్యాల, వెలుగు: మున్సిపల్​ ఎలక్షన్లకు సంబంధించి ఈ నెల 10న పోలింగ్​ మెటీరియల్​ పంపిణీ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎలక్షన్​ ఆఫీసర్, కలెక్టర్​ కె.హైమావతి ఆదేశించారు. చేర్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో  ఏర్పాటు చేసిన పోలింగ్​ మెటీరియల్ డిస్ర్టిబ్యూషన్​ సెంటర్​ను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రిసెప్షన్​ సెంటర్, కౌంటింగ్​ హాల్, స్ర్టాంగ్​ రూమ్ ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. 

11న పోలింగ్​ కేంద్రాల్లో సిబ్బందికి టిఫిన్, భోజనం, స్నాక్స్ వంటివి అందజేయాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ర్టాంగ్​ రూమ్​లో భద్రపరచాలని స్పష్టం చేశారు. 13 జరిగే కౌంటింగ్​ ప్రక్రియలో ఏజంట్లకు పరిమిత పాస్​లు ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. 

పోలింగ్, కౌంటింగ్ రోజు డ్రై డేలు.

సిద్దిపేట రూరల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు జరగనున్న హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల పరిధిలో డ్రై డేలను ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కే. హైమావతి అన్నారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి 11న పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో డ్రై డే గా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మద్యం, రిటైల్ షాప్స్, బారులు, కల్లు దుకాణాలు అన్ని మూసి ఉంచాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్రిడిటేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..

2026_28 కి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌‌ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని, జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను (ఓరిజినల్) డీపీఆర్వో ఆఫీస్ లో సమర్పించాలన్నారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌‌  సైట్ <http://ipr.telangana.gov.in> ద్వారా ఈనెల 9 నుంచి ఆన్‌‌  లైన్‌‌  లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.