ముంబై: బంగ్లాదేశ్‌లో ఉన్న 1.25 కోట్ల మంది హిందువులు ఒక్కటై పోరాటం మొదలు పెడితే.. వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా సాయం చేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆర్ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకలను పురుస్కరించుకుని ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనార్టీల పరిస్థితిని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేశారు.
‘‘బంగ్లాదేశ్‌లో దాదాపు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వారంతా అక్కడే ఉండి పోరాడాలని తల్చుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు వారికి సాయం చేస్తాడు” అని అన్నారు. మన దేశంలో జనాభా పెరుగుదల, మార్పులపై గత ప్రభుత్వాలు తగిన చర్యలు తీస్కోలేదని భాగవత్ అన్నారు. ప్రధాన కారణాలుగా ఉన్న జననాల రేట్లు తగ్గడం, అక్రమ వలసలు ప్రస్తుత ప్రభుత్వంలో చక్కదిద్దుకుంటున్నాయని చెప్పారు.
భారత్‌ను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని అన్నారు. అలాంటి ఆలోచన ఉన్నవాళ్లే విచ్ఛిన్నం అవుతారని చెప్పారు. ఆర్ఎస్‌ఎస్‌కు వచ్చే నిధులపైనా ఆయన స్పందించారు. ఆర్ఎస్‌ఎస్ ఏ సంఘం లేదా కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు తీసుకోదని, కార్యకర్తల నుంచే సేకరిస్తుందని క్లారిటీ ఇచ్చారు.
ప్రయాణ సమయాల్లోనూ సంఘ్ సభ్యుల ఇండ్లలోనే బస చేస్తామని తెలిపారు. హిందువులలోని ఏ జాతికి చెందిన వ్యక్తి అయినా సంఘ్ చీఫ్ కావొచ్చని అన్నారు. ‘‘ఎస్సీ.. ఎస్టీలకు అర్హత లేదని కాదు.. బ్రాహ్మణులకు ప్రత్యేక అర్హత ఏమీ లేదు” అని భాగవత్ స్పష్టం చేశారు. సమాజాన్ని ఐక్యం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
