దోచుకున్న సొమ్ముతో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ : మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు

దోచుకున్న సొమ్ముతో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ :  మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు
  • బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు 

సూర్యాపేట, వెలుగు: గతంలో దోచుకుని దాచుకున్న డబ్బులతో మళ్లీ గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఓటు వేసి మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీలోని 14, 18, 22 అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట అభివృద్ధి  కోసం గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం సూర్యాపేటకు రూ.500 కోట్లకు పైగా నిధులతో అభివృద్దికి బాటలు వేశామన్నారు.

 సూర్యాపేటలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ ట్యాంక్ బండ్, అమృత్ పార్కులు, ఓపెన్ జిమ్ లు, స్మశానవాటికలు. ఇవన్నీ కేంద్ర నిధులతోనే సాకారమయ్యాయని తెలుపారు. నిరుద్యోగ యువత కొరకు సూర్యాపేటలో ఇండ్రస్టీయల్ పార్క్ ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. 15ఎకరాలలో స్టేడియం కోసం బీజేపీ మంజూరు చేస్తే వాటి నిర్మాణం నేటి వరకు పూర్తి చేయలేదని విమర్శించారు. ఇప్పటికే సూర్యాపేటకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే లైన్ మంజూరు చేశారని గుర్తు చేశారు. 

 కేంద్ర నిధులను దోచుకున్న బీఆర్ఎస్  

సూర్యాపేటకు కేంద్రం నిధులు ఇస్తే వాటిని దోచుకున్నారని ఆరోపించారు. గతంలో పార్కుల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తే వాటిని బీఆర్ఎస్ నాయకులు పక్కదారి పట్టించారన్నారు. చిన్న కాంట్రాక్టర్లను పక్కనపెట్టి, ఒకే వ్యక్తికి అన్ని పనులు ఇచ్చి కమిషన్లు దండుకున్నారని మండిపడ్డారు. కబడ్డీ  పోటీల పేరుతో కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసి, నాసిరకమైన స్టేడియం నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు.

ఏళ్ల తరబడి నివసిస్తున్న సొంత ఇళ్లను కూల్చివేసి, వారినే ఆక్రమణదారులుగా చిత్రీకరించారన్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా వ్యాపారస్తులను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిరుద్యోగుల నుంచి ఎమ్మెల్యే అనుచరులు లక్షలు వసూలు చేసి ఉద్యోగాలను అమ్ముకొని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. దళితులకు చైర్మన్ పదవి ఇచ్చి ఏసీబీలో పట్టుబడిన కమిషనర్ ను తీసుకొచ్చి నిధులన్నీ దోచుకున్నారని విమర్శలు చేశారు.

ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ 

2023లో బూటకపు హామీలను నమ్మి గెలిపించిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందన్నారు. దివంగత నేత అనుచరులు అక్రమ నిర్మాణాలని చెప్పి రూ.20 కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపించారు.  అవినీతి లేని, అభివృద్ధి ధోరణి గల పాలన కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.