న్యూఢిల్లీ: పాకిస్తాన్ బాయ్ కాట్ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఐసీసీ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో ఇండియా మ్యాచ్ బహిష్కరించడాన్ని పీసీబీ పునఃపరిశీలిస్తోందని.. మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.
ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్ అంశాన్ని పీసీబీ పునఃపరిశీలిస్తోందనే వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలో నిర్ణయం పూర్తిగా ఐసీసీకే వదిలేశామని స్పష్టం చేశారు. ‘‘ఈ అంశాలపై నేను వ్యాఖ్యానించను. బీసీసీఐ వైపు నుంచి కూడా ఎలాంటి కామెంట్ చేయను. ఈ విషయంలో ఐసీసీ తీసుకునే ఏ నిర్ణయం లేదా తీర్పుకైనా కట్టుబడి ఉంటాము. ఈ విషయాన్ని పూర్తిగా ఐసీసీకి అప్పగించాం’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మెగా పోరుకు సంబంధించి ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ ఆదివారం ఉదయం లాహోర్ చేరుకుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.
ఇండో–పాక్ మ్యాచ్ విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ బోర్డు ఖవాజాను మధ్యవర్తిగా నియమించినట్టు పీసీబీ వర్గాలు తెలిపాయి. పీసీబీ చీఫ్ నఖ్వీతో పాటు బంగ్లా క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అనిముల్ ఇస్లాంతో అతను మాట్లాడినట్టు తెలిపాయి. దాయాది జట్టుతో మ్యాచ్ ఆడేందుకు పాక్ ప్రభుత్వం నుంచి పీసీబీ అనుమతి తీసుకునేందుకు ఐసీసీ ప్రతినిధులు శక్తిమేరకు కృషి చేస్తున్నారని సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో ఆడలేమని బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ ఆ టీమ్‌ను తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది.
అయితే బంగ్లాపై వేటుకు నిరసనగా.. ఈ నెల 15న ఇండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పీసీబీని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లకు భారీ నష్టం వాటిల్లుతుంది. టోర్నీకి సహ -ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో పీసీబీకి లేఖ రాసింది. ఈ మ్యాచ్ జరగకపోతే తమకు వచ్చే ఆదాయం దెబ్బతింటుందని, టోర్నీ ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పీసీబీ నిర్ణయంపై క్రీడా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
