మేడిపల్లి, వెలుగు: ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ మైనర్ ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ లోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో ఓ ప్రైవేట్ ఉద్యోగి నివసిస్తున్నాడు. అతడి కొడుకు(17) గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
మేడిపల్లిలోని మహీంద్రా కార్ షోరూమ్‌లో అప్రెంటిస్‌షిప్ చేస్తున్నాడు. శనివారం తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఇంట్లో బాలుడు ఒంటరిగా ఉన్న సమయంలో తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు.
ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. వెంటనే యువతి అతడి స్నేహితులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే ఇంటికి వెళ్లి డోర్ బలవంతంగా ఓపెన్ చేశారు. అనంతరం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
