Shivaji vs Chinmayi : టాలీవుడ్‌లో డ్రెస్సింగ్ వార్: శివాజీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన చిన్మయి, అనసూయ!

Shivaji vs Chinmayi : టాలీవుడ్‌లో డ్రెస్సింగ్ వార్: శివాజీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన చిన్మయి, అనసూయ!

నటుడు శివాజీ లెటెస్ట్ గా ‘దండోరా’ (Dhandoraa) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను తుఫానును రేపుతున్నాయి, ముఖ్యంగా హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘దండోరా’ సినిమా వేడుకలో శివాజీ మాట్లాడుతూ.. నేటితరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై విరుచుకుపడ్డారు. స్త్రీ అందం చీరకట్టులోనే ఉంటుందని చెబుతూనే, పొట్టి బట్టలు వేసుకునే వారిని ఉద్దేశించి అత్యంత అభ్యంతరకరమైన పదాలను వాడారు. సావిత్రి, సౌందర్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. శివాజీ వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి, నటి అనసూయ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 

చిన్మయి ఘాటు విమర్శలు

శివాజీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా సింగర్ చిన్మయి నిప్పులు చెరిగారు.  ఒక ప్రొఫెషనల్ వేదికపై మహిళలను ఉద్దేశించి ‘దరిద్రపు ము...’ వంటి బూతు పదాలను ఎలా వాడుతారని ఆమె ప్రశ్నించారు. కేవలం స్త్రీ ద్వేషులు (Incels) మాత్రమే వాడే ‘సామాన్లు’ అనే పదాన్ని వాడటంపై ఆమె మండిపడ్డారు. హీరోయిన్లకు సంప్రదాయం గురించి పాఠాలు చెప్పే శివాజీ గారు.. తాను మాత్రం జీన్స్, హూడీలు వేసుకుంటారు. సంప్రదాయంపై అంత ప్రేముంటే ఆయన కేవలం ధోతీలే కట్టుకోవాలి కదా? అని చిన్మయి నిలదీశారు.

పురుషులకూ నియమాలు ఉండవా? 

మహిళలకు నియమాలు చెప్పే ముందు, పురుషులు కూడా నుదుట బొట్టు పెట్టుకోవాలని, వివాహానికి గుర్తుగా కంకణాలు, మెట్టెలు ధరించాలని సింగర్ చిన్మయి ఎద్దేవా చేశారు. సినిమాలో విలన్‌గా నటించిన శివాజీ, బయట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ స్త్రీలను ద్వేషించే కుర్రాళ్లకు ‘హీరో’గా మారుతున్నారని ఆమె విమర్శించారు.

 

అటు శివాజీ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ కూడా రియాక్ట్ అయ్యారు.  నా శరీరం నా ఇష్టం... ఇది మీది కాదు.. అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే శివాజీ పేరును మాత్రం ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  కొందరు నెటిజన్లు అనసూయను సమర్థిస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. 

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

ఈ వివాదం సోషల్ మీడియాను రెండుగా చీల్చింది. ఒక వర్గం శివాజీ చెప్పిన దానిలో అర్థం ఉందని, హద్దులు దాటిన గ్లామర్‌ను ప్రశ్నించడంలో తప్పులేదని సమర్థిస్తున్నారు. అయితే, అత్యధిక శాతం మంది మాత్రం శివాజీ వాడిన పదజాలం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయం చెప్పడానికి సభ్యత అవసరం, బూతులు కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహిళల వస్త్రధారణపై వ్యక్తిగత దాడి చేయడం, అది కూడా బహిరంగ వేదికలపై అసభ్య పదజాలం వాడటం ఆధునిక సమాజంలో ఎంతవరకు సమంజసం అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది.