తెలంగాణలో ఇక ఔట్‌‌సోర్సింగ్ కు చెల్లు! 30 వేల మంది ఉద్యోగులపై ఎఫెక్ట్..

 తెలంగాణలో ఇక ఔట్‌‌సోర్సింగ్ కు చెల్లు! 30 వేల మంది ఉద్యోగులపై ఎఫెక్ట్..
  • సిబ్బంది తొలగింపు దిశగా ఆర్థిక శాఖ కసరత్తు
  • పంచాయతీరాజ్​, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్​, హెల్త్​ విభాగాల్లోనే ఎక్కువ
  • ఇప్పటికే కంటిన్యూ ఆర్డర్లు లేక ఐదారు నెలలుగా నిలిచిపోయిన వేతనాలు
  • 30 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో  పొరుగు సేవల(ఔట్​సోర్సింగ్​) కు ముగింపు పలికే దిశగా ఆర్థిక శాఖ  ఫైళ్లను కదుపుతోంది. పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, హెల్త్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే కంటిన్యూ ఆర్డర్లు లేక ఐదారు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. గ్రూప్-3, 4తోపాటు వివిధ  రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా కొత్తగా ఎంపికైన సుమారు 10 వేల మంది ఉద్యోగులను ఈ పోస్టుల్లో నియమించినందున ఆ మేరకు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ నియమించిన ఉద్యోగులకు,  కొనసాగింపు ఉత్తర్వులు రాని ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు మధ్య  తేడా 20  వేల దాకా ఉండడం కలవరపెడ్తోంది.  కాగా, ఈ వ్యవహారంపై ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నఫళంగా తమను ఉద్యోగాల్లోంచి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడ్తాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

బోగస్ ఉద్యోగుల​ఏరివేత పేరుతో మొదలైన ప్రక్రియ..

ఆర్థిక శాఖ దగ్గర ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో మొత్తం 4.93 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.  వీరిలో చాలా వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నారనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. దీంతో వారందరి వివరాలను ఆధార్ తో అప్ డేట్ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయితేనే జీతాలు జమచేస్తామని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. ఆమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులందరూ తమ వివరాలను ఆధార్ తో అనుసంధానం చేశారు. ఈ అప్ డేట్ ప్రక్రియ పూర్తయ్యాక పెద్దగా బోగస్ పేర్లు బయటపడలేదు. దీంతో సీఎం వద్ద సమాధానం చెప్పుకునేందుకు తమ పరిధిలోని సిబ్బందిని ఉన్నతాధికారులు తొలగిస్తున్నారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఔట్​సోర్సింగ్​ఉద్యోగులను కుదించడం ద్వారా భారాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు చెప్తున్నారు. అందుకే వివిధ శాఖల నుంచి వస్తున్న కంటిన్యూయేషన్ ఆర్డర్ల ఫైళ్లకు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ క్లియరెన్స్​ఇవ్వడం లేదని అంటున్నారు. బోగస్ ఏరివేత పేరుతో మొదలైన ప్రక్రియ, చివరకు  ఉద్యోగుల తొలగింపునకు దారితీస్తోందన్న ఆందోళన తాత్కాలిక సిబ్బందిలో వ్యక్తమవుతోంది.

వివిధ శాఖలపై ప్రభావం

ఔట్ సోర్సింగ్ సిబ్బంది తగ్గింపు ప్రభావం కేవలం రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలతోపాటు పలు కీలక విభాగాలపైన పడుతోంది. ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కమ్ లతో పాటు రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్టీసీ, పురపాలక శాఖల్లోనూ ఈ తరహా కుదింపులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మంది మండల, క్లస్టర్ కంప్యూటర్ ఆపరేటర్లకు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకపోవడంతో  వారి కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. వీరి పనులను ఇకపై పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు చూసుకోవాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. అటు రెవెన్యూ శాఖలో ఆపరేటర్లు, ఇతర డేటా ఎంట్రీ సిబ్బంది మొత్తం 1200 మంది తొలగింపునకు రంగం సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగానికి మూలస్తంభాలుగా ఉండే టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల తొలగింపుతో పనులకు ఆటంకం కలిగే అవకాశముంది.  రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు సాధారణ ఎన్నికల విధులు, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారం 7, 8, 9 తదితర ఆన్ లైన్ పనుల్లో పాల్గొంటున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన (ఎల్ఆర్ యూపీ), వెబ్ ల్యాండ్ నమోదు, ఐఎల్ఆర్ ఎంఎంఎస్ లాంటి కీలకమైన రెవెన్యూ పనులన్నీ వీరే నిర్వహిస్తున్నారు. అకాల వర్షాలు వచ్చినప్పుడు నష్టాల నమోదు, విద్యార్థులకు రెగ్యులర్ సర్టిఫికెట్ల జారీ వంటి డేటా ఎంట్రీ పనులు ఆపరేటర్ల బాధ్యతే.  పంచాయతీరాజ్​లోనూ మండల ఆఫీసుల్లో బర్త్​, డెత్​,  ప్రభుత్వ స్కీముల డేటా ఎంట్రీ, చెక్స్​ పేమేంట్​, శానిటేషన్​ వర్క్స్​ ఎంట్రీ, ఇంటిపన్ను వంటివి క్లస్టర్​ ఆపరేటర్లు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సాంకేతిక పనుల్లో అనుభవం పనిచేస్తున్న వారిని తీసేసి, ఆ భారాన్ని నేరుగా పంచాయతీ కార్యదర్శులపై వేయనున్నట్లు తెలుస్తోంది.  ఒకేసారి వేలాది మందిని పక్కనపెడితే రోజూవారీ పాలనా వ్యవహారాల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందని అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వ హేతుబద్ధీకరణ లక్ష్యం, ఇటు తాత్కాలిక ఉద్యోగుల కొనసాగింపు మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు పరిపాలనా యంత్రాంగానికి ప్రధాన సవాలుగా మారింది. సర్దుబాటు పేరిట ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించడం సరికాదని సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, తొలగింపులకు బదులుగా ఖాళీగా ఉన్న ఇతర విభాగాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని  కోరుతున్నారు.

కాగితాల దగ్గరే ఆగిపోయిన కార్పొరేషన్​ 

 ఔట్ సోర్సింగ్​ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా, ఆ ప్రపోజల్స్​కు ఇంకా ఆమోదం లభించలేదు. ఒకవేళ కార్పొరేషన్​ ఏర్పాటైతే జీతాల చెల్లింపుల విషయంలోనూ కీలక మార్పులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.  ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్​), ఎంప్లాయీస్​ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్​ఐ) వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు అందుతాయని  ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.