మధ్యప్రదేశ్‌లోని సీహోర్‌కు చెందిన ఒక కుటుంబం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం 109 ఏళ్ల కిందటి ఒక పాత అప్పు గురించి. బ్రిటిష్ ప్రభుత్వం తమకు కోట్లాది రూపాయల బాకీ పడిందని.. ఆ అప్పును వడ్డీతో సహా వసూలు చేస్తామని ఫ్యామిలీకి చెంది వివేక్ రుథియా ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఒక సామాన్య భారతీయ వ్యాపారవేత్త ఏకంగా ఒక సామ్రాజ్యాన్ని ఏలే ప్రభుత్వానికే అప్పు ఇవ్వడం.. అది శతాబ్దం దాటినా ఇంకా చెల్లించకపోవడం చూడటానికి ఒక సినిమా స్టోరీలా ఉంది.
అసలు ఇది1917లో మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయమది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధ ఖర్చుల కోసం వారికి అత్యవసరంగా నిధులు అవసరమయ్యాయి. ఆ సమయంలో సీహోర్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన సేథ్ జుమ్మా లాల్ రుథియాను స్థానిక బ్రిటిష్ అధికారులు సంప్రదించారు. దేశభక్తితోనో లేదా మానవతా దృక్పథంతోనో ఆయన అప్పట్లోనే రూ.35వేల భారీ మొత్తాన్ని అప్పుగా ఇచ్చారు. ఆ కాలంలో రూ.35 వేలు అంటే అది చాలా పెద్ద మెుత్తం. ఇందుకు ప్రతిఫలంగా బ్రిటిష్ అధికారులు రాతపూర్వకంగా అప్పుకు సంబంధించిన డాక్యుమెంట్లకు జుమ్మా లాల్‌కు అందజేశారు.
అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. 1937లో జుమ్మా లాల్ కన్నుమూశారు. ఆ తర్వాత దేశానికి స్వతంత్రం రావడం.. బ్రిటిష్ వారు భారత్‌ను విడిచి వెళ్లిపోవడంతో ఈ అప్పు విషయం మరుగున పడిపోయింది. జుమ్మా లాల్ కుమారుడు సేథ్ మాణక్ చంద్ ఈ పత్రాలను భద్రపరిచారు. 2013లో ఆయన మరణించాక.. ఆ ఆస్తి పత్రాలు మనవడైన వివేక్ రుథియా చేతికి వచ్చాయి. దాదాపు 22 ఏళ్ల పాటు ఇంట్లోనే పడి ఉన్న ఆ పాత ఫైళ్లను వెలికితీసినప్పుడు.. ఈ చారిత్రక అప్పుకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. కేవలం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. 1917 నాటి రూ.35 వేల విలువ నేడు సుమారు రూ.కోటి 85లక్షలకు పైమాటే. దీనికి వడ్డీని కూడా కలిపితే ఆ మొత్తం కొన్ని పదుల కోట్లకు చేరుతుందని ఆ ఫ్యామిలీ అంటోంది.
ఇప్పుడు వివేక్ రుథియా ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఒక దేశం తన చారిత్రక ఆర్థిక బాధ్యతల నుండి తప్పుకోలేదని ఆయన వాదిస్తున్నారు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని.. న్యాయం అలాగే తన తాతగారి కష్టానికి దక్కాల్సిన గుర్తింపు అని వివేక్ పేర్కొంటున్నారు. ఈ కేసు ఒకవేళ ముందుకు సాగితే అంతర్జాతీయ న్యాయస్థానం వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే వందేళ్ల నాటి పత్రాల అసలు స్థితిని నిరూపించడం అంత ఈజీ కాకపోవచ్చు. ఏదేమైనా బ్రిటీష్ వాళ్లనే అప్పు చెల్లించాలని అడిగే స్థాయికి చేరిన ఈ సీహోర్ ఫ్యామిలీ స్టోరీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
