టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల వివాహ ముహూర్తపు ఘడియలు దగ్గరపడ్డాయి. మరో 48 గంటల్లో ఈ జంట ఒక్కటవుతున్నారు. ఇప్పటికే వీరి వివాహ వేడుకకు రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్ ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ మహా వేడుక కోసం నగరం అంతా సెలబ్రిటీల రాకతో సందడిగా మారింది.
అంబానీ ఫ్యామిలీ రాక..
ఈ వివాహ వేడుకకు అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్ చేరుకోవడం. కోకిలాబెన్, ముఖేష్, నీతా అంబానీలతో పాటు ఆకాష్, శ్లోకా అంబానీలు కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నారు. వారు విమానాశ్రయంలో చాలా సింపుల్‌గా కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
అంబానీ కుటుంబంతో పాటు సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, కృతి సనన్ వంటి స్టార్స్ కూడా హాజరవుతారని సమాచారం. ఇప్పటికే విజయ్ , రష్మికల సన్నిహితులు, బంధువులు ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. వారిలో టాలీవుడ్ యువదర్శకులు సందీప్ రెడ్డి వంగా, నటుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వంటి ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.
దక్షిణాది సంప్రదాయం
రాజస్థాన్ కోటల మధ్య పెళ్లి జరుగుతున్నా, మెనూ విషయంలో విజయ్-రష్మికలు తమ మూలాలను మర్చిపోలేదు. పక్కా సౌత్ ఇండియన్ టచ్ ఇవ్వబోతున్నారు. అతిథులకు స్వచ్ఛమైన సౌత్ ఇండియన్ రుచులను అరటి ఆకుల్లో వడ్డించనున్నారు. విలాసవంతమైన డ్రింక్స్‌కు బదులుగా సహజమైన కొబ్బరి నీళ్లతో అతిథులకు స్వాగతం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలంకరణ కోసం విదేశీ పూలను కాకుండా, మన దేశీ సంప్రదాయాన్ని చాటిచెప్పేలా స్థానిక పూలను మాత్రమే వాడుతున్నారు.
►ALSO READ | The Kerala Story 2: హైకోర్టులో 'ది కేరళ స్టోరీ 2' వివాదం.. స్క్రీనింగ్‌కు నో చెప్పిన మేకర్స్.. రిలీజ్ఆగిపోతుందా?
షెడ్యూల్ ఇలా..
మంగళవారం సాయంత్రం మెహందీ కార్యక్రమంతో అసలు వేడుక మొదలైంది. రేపు (ఫిబ్రవరి 25) హల్దీ , సాయంత్రం గ్రాండ్ సంగీత్ వేడుక. గురువారం (ఫిబ్రవరి 26) శుభ ముహూర్తాన విజయ్ - రష్మికల వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌కు దూరంగా ఉన్న ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’లో కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకలు సాగుతున్నాయి. చివరగా, మార్చి 4న హైదరాబాద్‌లోని చిత్ర పరిశ్రమ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
