సినీ ప్రపంచంలో కొన్ని చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా.. తీవ్రమైన సామాజిక చర్చలకు, వివాదాలను కూడా రేపుతుంటాయి. 2023 లో సంచలన సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. ఫిబ్రవరి 27న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కేరళ హైకోర్టు జోక్యంతో ఈ సినిమా భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
కోర్టులో స్క్రీనింగ్‌కు నో చెప్పిన మేకర్స్!
ఈ సినిమా కేరళ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను కించపరిచేలా ఉందంటూ శ్రీదేవ్ నంబూద్రి అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బెచ్చు కురియన్ ధర్మాసనం.. సినిమా విడుదలకు ముందు తమకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. అయితే, కోర్టుకు సినిమా చూపించడానికి మేకర్స్ నిరాకరించారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. "కేరళ ప్రజల ఆందోళనలను పక్కన పెట్టలేం" అని వ్యాఖ్యానించింది. తుది నిర్ణయాన్ని ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసింది. మరొవైపు వివాదాస్పదంగా మారిన సినిమా టీజర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చిత్ర బృందం కోర్టుకు తెలియజేసింది.
ఎందుకీ వివాదం?
హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, మతం మార్చడమే (లవ్ జిహాద్) ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. తొలి భాగం కేవలం కేరళకే పరిమితం కాగా, ఈ సీక్వెల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,కేరళ రాష్ట్రాల్లో జరిగినట్లు చూపించారు. రాబోయే 25 ఏళ్లలో భారత్ ఇస్లామిక్ దేశంగా మారుతుందనే హెచ్చరికతో సినిమా ట్రైలర్ ప్రారంభం కావడం తీవ్ర దుమారం రేపింది. ఈ సినిమాలో 'యూఎల్కా గుప్తా', 'అదితి భాటియా', 'ఐశ్వర్య ఓజా' ప్రధాన పాత్రల్లో నటించారు.
►ALSO READ | OTT Movie Review: ‘లక్కీ ది సూపర్ స్టార్’ ఓటీటీ రివ్యూ: ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో హత్తుకునే కథ
రాజకీయ ప్రకంపనలు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడీ ఈ చిత్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇది రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నమని ఆయన విమర్శించారు. దీనికి కౌంటర్‌గా దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. "మేము నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కళ్ళు మూసుకుంటే అవి మరింత పెద్దవవుతాయి అని స్పష్టం చేశారు. మరోవైపు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పరోక్షంగా ఈ సినిమాపై సెటైర్లు వేశారు. ఆహారపు అలవాట్ల బీఫ్ గురించి ఒక పోస్ట్ పెడుతూ..సమాజంలో కలిసి మెలిసి ఉండటం ఎంత సులభమో.. అనవసరంగా సంక్లిష్టం చేయకండి అని పేర్కొన్నారు.
సినిమానా? ప్రచారమా?
తొలి భాగం జాతీయ అవార్డులను గెలుచుకున్నప్పటికీ.. ఈ సీక్వెల్ చుట్టూ ఉన్న ఉద్రిక్తతలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలనే డిమాండ్ల మధ్య, ఈ శుక్రవారం థియేటర్లలోకి ఈ సినిమా వస్తుందా లేదా అనేది కోర్టు ఇచ్చే తుది తీర్పుపై ఆధారపడి ఉంది...
