Health : బ్లాక్ కాఫీ బెటరా.. గ్రీన్ టీ మంచిదా.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

Health : బ్లాక్ కాఫీ బెటరా.. గ్రీన్ టీ మంచిదా.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

మనలో చాలా మందికి ఉదయం లేవగానే లేదా  సాయంత్రం సమయంలో  టి, కాఫీ లాంటివి  ఇలా ఏదో ఒకటి తాగే అలవాటు ఉంటుంది. కొందరు స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ ఇష్టపడితే, మరికొందరు గ్రీన్ టీ లేదా ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన మాచా టీని కోరుకుంటున్నారు. అయితే, ఇవన్నీ మన పొట్ట  ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రముఖ  డాక్టర్లు వివరిస్తున్నారు. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి, మెదడు పనితీరు,  చర్మ కాంతి కూడా మన జీర్ణక్రియపైనే ఆధారపడి ఉంటాయి. పొట్టలో ఉండే లక్షలాది మంచి బ్యాక్టీరియా మనం తినే ఆహారాన్ని అరిగించడమే కాకుండా, మన మూడ్‌ని కూడా ప్రభావితం చేస్తాయి.

1. బ్లాక్ కాఫీ:
బ్లాక్ కాఫీ అంటే కేవలం నిద్ర రాకుండా చేసే పానీయం మాత్రమే కాదు, దీనివల్ల పొట్టకు కొన్ని లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి.

లాభాలు: బ్లాక్ కాఫీ తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థలో కదలికలు పెరుగుతాయి. ఇది కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను విడుదల చేయడం ద్వారా తిన్న ఆహారం త్వరగా కిందికి వెళ్లేలా చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి రోజుకు ఒక కప్పు  బ్లాక్ కాఫీ తాగడం వల్ల విసర్జన సాఫీగా జరుగుతుంది.

నష్టాలు: ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ  పడదు. గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండెల్లో మంట లేదా అల్సర్లు ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగితే సమస్య ఇంకా ఎక్కువవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి, సెన్సిటివ్ కడుపు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.

2. గ్రీన్ టీ:
ఆరోగ్యం గురించి ఆలోచించే వారికి గ్రీన్ టీ ఫస్ట్  అప్షన్. పొట్ట ఆరోగ్యానికి  గ్రీన్ టీ ఒక అద్భుతమైన పానీయం కూడా.

లాభాలు: గ్రీన్ టీలో 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన పొట్టలో వాపులను (Inflammation) తగ్గించి, మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. కాఫీతో పోలిస్తే ఇందులో కెఫిన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి  కడుపులో మంటను కలిగించదు.

జాగ్రత్తలు: దీనికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎసిడిటీ ఉన్నవారు కూడా  తాగొచ్చు. రోజుకు రెండు మూడు సార్లు తాగినా పెద్దగా ఇబ్బంది ఉండదు.

3. మాచా (Matcha)టీ:
మాచా అనేది జపనీస్ సంప్రదాయ గ్రీన్ టీ పొడి. ఈ మధ్య కాలంలో  చాలా ట్రెండీగా మారింది. సాధారణ గ్రీన్ టీ కంటే మాచా టి  కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

లాభాలు: మాచాలో 'L-థియనిన్' అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. మన మెదడు, పొట్ట ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి, మానసిక ఒత్తిడి తగ్గితే ఆటోమేటిక్ గా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

నష్టాలు: మాచాలో కెఫిన్ కంటెంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కాబట్టి అతిగా తాగితే గుండె దడ రావడం లేదా అసిడిటీ పెరగడం వంటివి జరగవచ్చు.
 
డాక్టర్ల  ప్రకారం, అందరికీ ఒకే రకమైన పానీయం సెట్ ఎవ్వదు అని గుర్తుంచుకోవాలి. మీకు కడుపులో మంట వంటి సమస్యలు లేకపోతే, కొంచెం బ్లాక్ కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు కడుపులో మంట, గ్యాస్ ఎక్కువగా ఉంటే గ్రీన్ టీ బెస్ట్. మీరు మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కోరుకుంటే మాచా టి ఎంచుకోవచ్చు, కానీ మోతాదుకి  మించకూడదు.

ఏ పానీయం తాగినా అది మీ ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి. పానీయాలు కేవలం మీ జీర్ణక్రియకు అదనపు బలాన్ని మాత్రమే ఇస్తాయి. మీ శరీర తత్వాన్ని బట్టి ఏది పడుతుందో చూసుకుని తాగండి. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే మానేసి డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.