వ్యవసాయ శాఖలో ‘వలంటీర్లు’.. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకరి నియామకం

వ్యవసాయ శాఖలో ‘వలంటీర్లు’.. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకరి నియామకం
  • ఏఈవోల ఆధ్వర్యంలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకరి నియామకం
  •      కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్​ క్రాప్ సర్వే​ బాధ్యతల అప్పగింత
  •      త్వరలో అందుబాటులోకి రానున్న యాప్​
  •      45 రోజుల పాటు కొనసాగనున్న సర్వే..

మహబూబ్​నగర్, వెలుగు : పంటల సాగు వివరాల లెక్క తీయడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్​ క్రాప్​ సర్వేకు సిద్ధమవుతోంది. ఇందు కోసం ప్రత్యేకంగా యాప్​ను డెవలప్ చేస్తోంది. అయితే ఈ సర్వే చేయడానికి వలంటీర్లను నియమించుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో వీరిని నియమించుకోగా, తెలంగాణలో ఏఈవోల ద్వారా ఈ సర్వే చేయించాలని నిర్ణయించారు. కానీ ఇందుకు వారు ఒప్పుకోకపోవడంతో తెలంగాణలోనూ వలంటీర్లను నియమిస్తున్నారు. 

స్థానికులకే అవకాశం

తెలంగాణలోని ఒక వ్యవసాయ క్లస్టర్​ పరిధిలో ఉన్న ఏఈవోకు సర్వే నంబర్లు, బై సర్వే నంబర్లతో కలుపుకొని 15 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాల పరిధి ఉంది. దీంతో  వారికి డిజిటల్​ క్రాప్​ సర్వే చేయడం కష్టతరం కావడంతో ప్రతీ రెవెన్యూ విలేజ్​కు ఒక వలంటీర్​ను వ్యవసాయ శాఖ నియమిస్తోంది. అయితే వీరి నియామక బాధ్యతలను వ్యవసాయ శాఖ ఏఈవోలకే అప్పగించింది. 

అయితే వలంటీర్లు స్థానికులై ఉండాలి. కచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్లు, ఏ రైతు భూమి ఎక్కడ ఉంది అనే వివరాలు తెలిసి ఉండాలి. వలంటీర్లుగా చేయాలనుకునే వారు బీఎస్సీ​, బైపీసీ చదివి ఉండాలనే రూల్​ ఉండగా, ఈ అర్హత ఉన్నవారు రెవెన్యూ విలేజ్​ పరిధిలో ఎవరూ లేకుంటే  ఆ గ్రామంలో టెన్త్​ పాస్​ అయిన వారిని నియమించుకోవాల్సి ఉంటుంది.  వారికి ఆన్​డ్రాయిడ్​ ఫొన్ ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. 

ఫొటో తీసి అప్​లోడ్​ చేస్తే రూ.7 చొప్పున చెల్లింపు

నియామకం అయిన వలంటీర్లు ఆయా రెవెన్యూ విలేజ్​ పరిధిలో క్షేత్ర స్థాయికి వెళ్లి భూముల వివరాలను సేకరించాలి. శాటిలైట్​ ఆధారంగా ఈ సర్వే చేయాల్సి ఉండడంతో భూమికి 20 మీటర్ల దూరం నుంచి ఫొటో తీయాలి. 

దానినే యాప్​లో అప్​లెడ్​ చేయాలి. ఇలా యాప్​లో అప్​లోడ్​ చేసిన ప్రతి ఫొటోకు రూ.7 చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకుగాను ఆధార్​ అనుసంధానం ఉన్న  వలంటీర్​ బ్యాంక్​ అకౌంట్​ నంబర్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్​లైన్​ విధానం ద్వారా పేమెంట్​ జరుగుతుంది. 45 రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుండగా, ఇప్పటికే తెలంగాణలో నియామకమైన వలంటీర్లకు సోమవారం కమిషనరేట్​ నుంచి ఆన్​లైన్​లో ట్రైనింగ్​ ఇచ్చారు. యాప్​ ఎలా పని చేస్తుందనే దానిపై అవగాహన కల్పించారు. త్వరలో యాప్​ అందుబాటులోకి రానుండడంతో దాన్ని ఫోన్​లలో డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచనలు చేశారు. 

ఏఈవోలకు తగ్గనున్న పనిభారం

ఆయా క్లస్టర్ల పరిధిలో ఏఈవోలు తీవ్ర పని భారంతో సతమతమవుతున్నారు. వారంలో రెండు, మూడు సార్లు రైతు వేదికల వద్ద  ఆయా పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు చేయడం, టీవీల ద్వారా పంటల గురించి అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పథకాల సంబంధించి రైతుల వివరాలను ఆన్​లైన్​ ఎంట్రీ చేయడం, పంటల కోతల సమయంలో ఫీల్డ్​ విజిట్​లతో  బిజీగా ఉంటున్నారు. 

ఈ క్రమంలో సర్వే చేయడానికి వలంటీర్లను నియమించాలని కోరడంతో వ్యవసాయ శాఖ అంగీకరించింది. అయితే వలంటీర్లను సర్వే కోసం నిర్వహించినా, ప్రతీ రెండు రోజులకోసారి ఏఈవోలను వారి పని తీరును పరిశీలించాల్సి ఉంటుంది. వారికి సహాయ సహకారాలూ అందించాలి. 

యాక్చువల్​ ఏరియాను  గుర్తించేందుకు సర్వే

ఆయా రాష్ర్టాల్లో పంటల సాగు విస్తీర్ణం ఎంత ఉందేనే విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్రం ఈ సర్వేను నిర్వహిస్తోంది. దాని ఆధారంగా దేశంలో ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతాయనే అంచనాకు రానుంది. ఆయా రాష్ర్టాల్లో ఎక్కువగా ఏ పంట పండుతోంది, అక్కడ మార్కెట్​ పరిస్థితులు ఏంటి, మినిమం సపోర్ట్​ ప్రైస్​ ఎంత నిర్ణయించాలి, పంటల సాగు సమయంలో ఎంత యూరియా అవసరం పడుతుంది, ఎంత క్వాంటిటిలో విత్తనాలు సరఫరా చేయాలి, మార్కెటింగ్​ సౌకర్యం ఎలా కల్పించాలి,తదితర అంశాలపై అవగాహనకు రానుంది. 


రెండు రోజుల్లో కంప్లీట్​ చేస్తాం

మహబూబ్​నగర్​ జిల్లాలో 320 మందికి పైగా వలంటీర్లను నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు 291 మందిని నియమించాం. వారికి ఇప్పటికే ఒకసారి ఆన్​లైన్​ ట్రైనింగ్​ పూర్తి అయ్యింది. ఈ రెండు రోజుల్లో  మిగతా వారిని కూడా నియమిస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి యాప్​ రాగానే, వలంటీర్లకు యాప్​ను డౌన్​లోడ్​ చేసుకొని సర్వే ప్రారంభించమని చెబుతాం.
-వెంకటేశ్, జిల్లా వ్యవసాయాధికారి, మహబూబ్​నగర్​