- పర్యావరణ అనుమతుల కోసం కసరత్తు
- సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిన ప్రధాన అడ్డంకులు
- మిగులు పనులపై ఇరిగేషన్ అధికారుల ఫోకస్
- 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సన్నాహాలు
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు : మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ పనుల్లో సుప్రీం కోర్టు తీర్పుతో మళ్లీ కదలిక మొదలైంది. దాదాపు తొంభై శాతం పనులతో పాటు ట్రయల్ రన్ పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్నా పర్యావరణ అనుమతుల పై నేష్నల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కేసులు ఆటంకంగా మారాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల పరంగా ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపొయింది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తీర్పు ఉత్తర్వుల ప్రకారం గౌరవెల్లి రిజర్వాయర్ పనుల పునర్ ప్రారంభానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ)కి కొత్తగా పర్యావరణ అనుమతుల అప్పీల్ కోసం కసరత్తు ప్రారంభించారు. వీటికి సంబంధించి కొత్తగా అనుమతులు లభిస్తే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది. గౌరవెల్లి ప్రాజక్టు ప్రారంభమైతే మూడు జిల్లాల పరిధిలోని 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం వుంటుంది. ట్రయల్ నిర్వహణ నాటి నుంచి రిజర్వాయర్ లో దాదాపు ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది.
మెదటి నుంచి న్యాయపరమైన చిక్కులు
గౌరవెల్లి ప్రాజెక్టుకు మొదటి నుంచి న్యాయపరమైన చిక్కులు వెంటాడుతూనే ఉన్నాయి. భూనిర్వాసితులు వేసిన కేసులతో పాటు నేష్నల్ గ్రీన్ ట్రిబ్యునల్, వనశక్తి కేసుల కారణంగా పనులతో పాటు ప్రారంభానికి ఆటంకంగా మారాయి. పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల నేష్నల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పనులను నిలిపివేయాలని ఆదేశించగా, 2007 నుంచి భూనిర్వాసితులు తమ న్యాయమైన పరిహారం కోసం పోరాడుతూ ఉన్నారు. 937 కుటుంబాలకు ఇండ్ల స్థలాల కేటాయింపు, 104 మంది వివాహిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున ప్యాకేజీ తో పాటు మరో 42 ఎకరాలకు పైగా భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికి తోడు 124 ఇండ్లు కొత్త ముంపు ప్రాంతంలో ఉండటంతో నిర్వాసితులు అదనపు చెల్లింపులు కోరుతుండటం గమనార్హం. 2007లో ఈ ప్రాజెక్టును 1.22 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీని సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. మొత్తం 1,095 కోట్ల అంచనాతో 10.56 కిలోమీటర్ల మేర రిజర్వాయర్ కట్ట, 125 మీటర్ల టన్నెల్, సర్జ్ పూల్, పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు భారీ మోటర్లను బిగించి, అక్టోబర్ 2023 నాటికే 90 శాతం పనులు పూర్తి చేసి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది జరిగి దాదాపు మూడేండ్లు కావస్తున్నా పలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోలేదు. గౌరవెల్లి ప్రాజెక్ట్ తో హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు నీరందనుంది.
కాల్వ ల నిర్మాణమే పెండింగ్...
గౌరవెల్లి ప్రాజక్టుకు సంబంధించి కాల్వ నిర్మాణమే ప్రధానంగా మిగిలింది. కుడి, ఎడమ కాల్వల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించి భూసేకరణకు కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇటీవలే రూ.431 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గౌరవెల్లి రిజర్వాయ్ నుంచి 46 కిలో మీటర్లు సాగే కుడి కాల్వ ద్వారా 90 వేల ఎకరాలకు నీరందించాల్సి వుండగా, ఇది కొంత మేర పూర్తి స్థాయిలో నిర్మించి ఏండ్లు గడుస్తున్నా దాన్ని పర్యవేక్షించకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి.హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని గ్రామాలకు నీళ్లను అందివ్వడం కోసం ఉద్దేశించిన ఎడమ కాల్వ ద్వారా 16 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉన్నా ప్రస్తుతం ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా ప్రధాన కాల్వల తరువాత డిస్ట్రీబ్యూటరీ కెనాల్స్ ను నిర్మించాల్సి
ఉంటుంది.
కొత్త గా పర్యావరణ అనుమతుల కోసం అప్పీల్
గౌరవెల్లి రిజర్వాయర్‌కు సంబంధించి స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి కొత్తగా పర్యావరణ అనుమతుల కోసం అప్పీల్ చేస్తాం. వీటికి సంబంధించి కొత్తగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ రాగానే దాన్ని ఎన్జీటీకి సమర్పిస్తాం. ప్రస్తుతం ఎన్జీటీలో కేసు విచారణలో ఉండటంతో సుప్రీం కోర్టు తీర్పుతో పాటు అనుమతులకు అనుగుణంగానే గౌరవెల్లి ప్రాజెక్టు తదుపరి కార్యాచరణ ఉంటుంది.
– రాములు నాయక్, ఈఈ ఇరిగేషన్, హుస్నాబాద్
