గుట్టుగా కలుపు మందు దందా..భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ప్యారాకుట్, గ్లైపోసెట్ అమ్మకాలు

గుట్టుగా కలుపు మందు దందా..భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ప్యారాకుట్, గ్లైపోసెట్ అమ్మకాలు
  •     నిషేధం ఉండడంతో మహారాష్ట్ర నుంచి రహస్యంగా సరఈఫరా 
  •     కట్టడి చేయడంలో అధికారులు ఫెయిల్‌‌‌‌
  •     నిషేధం మాటున దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిషేధిత కలుపు మందు దందా గుట్టుగా సాగుతోంది. ప్రభుత్వం, అధికారులు ప్యారాకుట్‌‌‌‌, గ్లైపోసెట్‌‌‌‌ వినియోగించవద్దని సూచిస్తున్నా.. రైతులు వినడం లేదు. దేశవ్యాప్తంగా ఈ కలుపు మందులపై నిషేధం ఉంది.. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లోని మందు డబ్బాలు దర్శనమిస్తునే ఉన్నాయి. ప్రమాదకరమైన ఈ మందులను కట్టడి చేయడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో వ్యాపారులు నిషేధం మాటున దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

విచ్చలవిడిగా అమ్మకాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సీజన్‌‌‌‌లో పత్తి, కంది, మొక్కజొన్న, కూరగాయల సాగు చేపట్టారు. వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధం చేస్తున్నారు. పొలాల్లో కలుపు నివారణ, గట్ల వెంబడి గడ్డిని తొలగించేందుకు స్పీడ్, గరుడ, ఆల్ క్లియర్, రౌండప్, గరుడ, గ్లైసిల్ కంపెనీల పేర్లతో ఉన్న ప్యారాకుట్, గ్లైపోసెట్ రసాయనాలను వాడుతున్నారు. గడ్డి మందులకు డిమాండ్ ఉండటంతో   ఏజెన్సీ ఏరియాల్లో సైతం ప్రత్యేక గోదాంలు ఏర్పాటు చేసి బిల్లులు లేకుండా వ్యాపారులు అమ్ముతున్నారు. కాగా నిషేధం మాటున వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్యారాకుట్ లీటర్ రూ. 400 వరకు ఉంటే రూ. 600 వరకు అమ్ముతున్నారని, అలాగే గ్లైపోసెట్ రూ. 900 ఉంటే రూ.1200కు విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఈ మందులపై నిషేధం ఉందని, ఇష్టముంటే కొనండి లేకపోతే లేదని కరాఖండిగా చెబుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులైతే తెలిసిన రైతులకు మాత్రమే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

మహారాష్ట్ర నుంచి గుట్టుగా సప్లై

ఏజెన్సీ ఏరియాల్లోని అటవీ భూముల్లో సాగు చేపట్టే రైతులకు గ్లైపోసెట్ రసాయనాలను తట్టుకునే బీటీ 3 రకం, మహారాష్ట్ర నుంచి లూజు విత్తనాలు అంటగడుతున్న దళారులు... బీటీ 3 సాగుదారులతో పాటు ఇతర రైతులకు గడ్డి మందును అంటగట్టేందుకు భూపాలపల్లి సరిహద్దున్న ఉన్న గడ్చిరోలి జిల్లా కేంద్రంగా గడ్డి మందు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి గడ్డి మందును భారీగా తీసుకొచ్చి రైతులు బహిరంగంగానే అమ్ముతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్, పలిమెల, కాటారం, మహాముత్తారం, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, భూపాలపల్లి మండలాల్లోని వ్యాపారులు రహస్య ప్రాంతాల్లో  నిల్వలు ఉంచి  విక్రయాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది పెద్ద మొత్తంలో జిల్లాలో గ్లైపోసెట్ నిల్వలు పట్టుబడి కేసుల పాలైనా దందా మాత్రం ఆగడం లేదు. 

తనిఖీలు నామమాత్రమే

మారుమూల గ్రామాల్లో వ్యాపారులు రహస్య ప్రాంతాలు ఏర్పాటు చేసుకుని గడ్డు మందుల దందా చేస్తనునారు. టాస్క్ ఫోర్స్ టీంలు సీజన్ ఆరంభంలో నామమాత్రపు తనిఖీలు చేపట్టి మమ అనిపించారనే టాక్ వినిస్తోంది. క్యాన్సర్ కారకంతో పాటు పర్యవరణానికి ఈ మందులతో ముప్పు పొంచి ఉందని తెలిసినా.. కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

షాపులు సీజ్ చేస్తాం

నిషేధిత ప్యారాకుట్, గ్లైపోసెట్ మందులు అమ్మితే షాపులు సీజ్ చేస్తాం. ఈ కలుపు మందుల వాడకంపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. షాపుల్లో తనిఖీలు పెంచాం. ప్రభుత్వం అనుమతించిన మందులనే వ్యాపారులు అమ్మాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
-జె. బాబురావు, డీఏవో, జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి