తెలంగాణలో శిల్పకళకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచి రాతి శిల్పాలకు పేరుగాంచిన ఈ నేలలో, కాలానుగుణంగా శిల్పకళ కూడా కొత్త రూపాలను సంతరించుకుంటోంది. నేటి రోజుల్లో రాయి, లోహాలతోపాటు సిమెంట్, కాంక్రీట్, ఫైబర్ వంటి ఆధునిక పదార్థాలతో శిల్పాలను రూపొందించే కళాకారులు పెరుగుతున్నారు.
ఆధునిక పార్క్‌లు, ఉద్యానవనాలు, ప్రభుత్వ భవనాలు, రిసార్టులు, దేవాలయాల పరిసరాల్లో సిమెంటు శిల్పాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఈ సిమెంట్ శిల్పకళలో కళాకారుడి సృజనాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ముందుగా ఇనుప రాడ్లు, వైర్ మెష్‌లతో ఆకృతికి పునాది నిర్మించి, దానిపై సిమెంట్ మిశ్రమాన్ని పొరలుగా అమర్చి కావాల్సిన రూపాన్ని తీసుకొస్తారు. తర్వాత మెరుగులు దిద్ది రంగులు వేయడం ద్వారా శిల్పానికి తుది రూపం ఇస్తారు.
ఏ ఏ జిల్లాల్లో ఈ కళ ఉందంటే...
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో పలువురు కళాకారులు సిమెంట్ శిల్పకళను వృత్తిగా కొనసాగిస్తున్నారు. సంప్రదాయ శిల్పకళా నైపుణ్యానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ వారు కొత్త తరహా శిల్పాలను సృష్టిస్తున్నారు. తక్కువ వ్యయంతో ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వల్ల సిమెంట్ శిల్పాలకు డిమాండ్ పెరుగుతోంది.శిల్పం అంటే కేవలం రాయిలో చెక్కిన ఆకృతి మాత్రమే కాదు. అందుబాటులో ఉన్న ప్రతి పదార్థంలో కళను ఆవిష్కరించడమే శిల్పకళ అని కళాకారులు చెప్తున్నారు.
సిమెంటు శిల్ప కళాకారులెందరో...
జూబ్లీహిల్స్‌లో ఉన్న చందూ సిమెంటు మ్యూరల్స్ అండ్ ఎలివేషన్ డిజైన్స్ సిమెంట్ మ్యూరల్స్, గార్డెన్ శిల్పాలు, భవనాల ఎలివేషన్ ఆర్ట్‌లను తయారు చేస్తుంది. లంగర్ హౌస్‌లో ఉన్న శిల్పకళా స్టూడియో కస్టమ్ శిల్పాలు తయారు చేస్తారు. యూసుఫ్‌గూడలోని జి. ప్రదీప్ దేవతా విగ్రహాలు, వ్యక్తుల విగ్రహాలు, కస్టమ్ శిల్పాల తయారు చేస్తున్నారు. బోదాసు వెంకటరమణ సిమెంట్, కాంక్రీట్, బ్రాంజ్, ఫైబర్ వంటి పదార్థాలతో వేలాది విగ్రహాలు రూపొందించిన ప్రముఖ శిల్పి. కూకట్‌పల్లిలోని ఆనంద్ శిల్పాలు, మ్యూరల్స్ తయారు చేస్తుంటారు. ధీరజ్ స్టూడియో కస్టమ్ శిల్పాల రూపకల్పన చేస్తుంది. అభినవ్ ఆర్ట్స్ శిల్పాలు, ఆర్ట్ వర్క్, కస్టమ్ డిజైన్ పనులు చేస్తుంది.
శ్రీ నందిని శిల్పి వర్క్స్ పెద్దపల్లిలో ఉంది. సిమెంట్, రాయి, విగ్రహాల పనులు చేపడుతుంది. లక్ష్మీ గణపతి శిల్పి వర్క్స్ శిల్పాల తయారీ, వరంగల్ వర సిద్ధి ఆర్ట్, శ్రీ విఘ్నేశ్వర శిల్పకళానిలయం, వినాయక సిమెంట్ వాల్ మ్యూరల్స్, హనుమాన్ సిమెంట్ ఆర్ట్స్ విగ్రహాల పనులు చేసే వర్క్‌షాప్‌లున్నాయి. గోపాల మణికేశ్వర శిల్పి వర్క్స్ శిల్పకళ పనులు చేసే కళాకారుల వర్క్‌షాప్. వరంగల్‌కు చెందిన అజయ్ కుమార్ మట్టెవాడ సూక్ష్మ శిల్పకళలో ప్రసిద్ధి పొందిన కళాకారుడు.
భాగ్యనగరంలో...
హైదరాబాద్‌లో పెద్ద అంబర్ పేటలోని ఈశ్వర్ మౌల్డింగ్ కళాకారులు ఇత్తడి, పంచలోహాలు, వాక్స్ సిలికాన్‌తో సరస్వతీ, గార్డెన్ బుద్ధ,లార్డ్ వెంకటేశ్వరస్వామి, మనుషుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ విగ్రహం ధర లోహాన్ని బట్టి రూ.2.75 లక్షల నుంచి రూ.5.5 లక్షల దాకా ఉంటుంది. లంగర్ హౌస్, సన్ సిటీలో వీజేఎస్ ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ పేరిట అర్థనారీశ్వర మ్యూరల్ పెయింటింగ్, కార్వింగ్ చేసిన మార్బుల్ బుద్ధ వాల్ ఆర్ట్, కాళీమాత విగ్రహం, బ్రాస్ గణేష్ విగ్రహం తయారు చేస్తున్నారు.
నగరంలోని శ్రీ వెంకటేశ్వర శిల్పకళా కళాకారులు మార్బుల్ తో సరస్వతి విగ్రహం, రాందర్బార్, క్రిస్టల్ గణేష్ స్టాట్యూ, మార్బుల్ ఈగల్ విగ్రహాలను రూపొందిస్తున్నారు. సైజును బట్టి రూ.3 వేల నుంచి 90వేల దాకా దీనికి చార్జ్ చేస్తున్నారు. బాలానగర్‌లోని ఆదిత్య ఆర్ట్స్‌లో బ్రాస్, సిమెంటుతో శివుడి విగ్రహం, హనుమాన్, రాజకీయనేతల విగ్రహాలను తయారుచేస్తున్నారు.
ఇంటి డెకరేటివ్ కళాఖండాలు
ఆర్కిటెక్చరల్ సిమెంట్ ఆర్ట్‌లు తయారు చేస్తున్నారు. డెకరేటివ్ ఇన్ స్టలేషన్స్, హ్యాండి క్రాఫ్ట్, టెక్చర్‌తో చేసిన డెకరేటివ్ ఆర్టికల్స్‌తో ఇళ్లను అలంకరిస్తున్నారు. చదరపు అడుగు 65 రూపాయల నుంచి 650 రూపాయల దాకా సిమెంటు ఆర్ట్ వర్క్‌కు చార్జ్ చేస్తున్నారు. ఆర్కిటెక్చరల్ సిమెంట్ ఆర్ట్, కస్టమ్ సిమెంటు డెకార్, సిమెంట్ ఆర్ట్ వర్క్, కాంక్రీట్ గార్డెన్ ఆర్ట్‌లతో ఇళ్లను ముస్తాబు చేస్తున్నారు. ఆర్కిటెక్చరల్ సిమెంట్ ఆర్ట్ అనేది కళాత్మకంగా ఉంటుంది. సాధారణ కాంక్రీటును అద్భుతమైన దృశ్య కళాఖండాలుగా మారుస్తుంది.
ఈశ్వర్ మోల్డింగ్ కృతికా ఆర్ట్ స్టూడియో...
జేఎన్ టీయూలో ఫైన్ ఆర్ట్ లో డిగ్రీ చేసిన హరి కృష్ణ జిల్లెలగూడలో కృతికా ఆర్ట్ స్టూడియోను నెలకొల్పి పలు రకాల మెటల్స్‌తో కళాఖండాలను తయారు చేస్తున్నారు. ప్రముఖుల స్మృత్యర్థం వారి విగ్రహాలను ఫైబర్‌తో తయారుచేస్తున్నారు. మట్టితో డిజైన్ తయారు చేసి దానిపై ఫైబర్ విగ్రహాన్ని రూపొందిస్తారు. మార్బుల్ స్టాచ్యూతో పాటు మీనాక్షిదేవి, అంబేద్కర్, దేవుళ్లు, అమ్మవారి విగ్రహాలను రూపొందిస్తున్నారు. అధునాతన సాంకేతికత అయిన త్రీడీ, ఏఐ సాయంతో విగ్రహాలను రూపకల్పన చేస్తున్నామని కృతికా ఆర్ట్ స్టూడియో కళాకారుడు హరికృష్ణ చెప్పారు.
సిమెంట్ విగ్రహాల తయారీ
కరీంనగర్ కేంద్రంగా శిల్పి రేవెళ్ల శంకర్ పలు సిమెంటు విగ్రహాలను సైతం తయారు చేశారు. పలువురు ప్రముఖుల విగ్రహాలకు శంకర్ ప్రాణం పోశారు.తనకున్న కళా చాతుర్యంతో సిమెంటు విగ్రహాలను రూపొందించి పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇసుకతో గద్దర్ విగ్రహాన్ని తయారు చేశారు. జొన్న పిండితో కాళోజీ బొమ్మను తయారు చేసి శెభాష్ అనిపించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించాక ఆయనకు నివాళిగా సైకత శిల్పాన్ని రూపొందించారు.
తెలంగాణ సైకత శిల్పి..శంకర్
కరీంనగర్ నగరానికి చెందిన రేవెళ్ల శంకర్ తెలంగాణలోనే ప్రసిద్ధ సైకత శిల్పిగా పేరొందారు. ఆయన వడ్రంగి పని చేస్తూ స్వయంకృషితో ఈ కళను నేర్చుకున్నారు. వడ్రంగి అయిన శంకర్ కాలక్రమేణా కలప పని తగ్గడంతో శిల్పాల వైపు అడుగులు వేశారు. ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే ఇసుకతో అద్భుతమైన శిల్పాలు చెక్కడంలో నిపుణత సాధించారు.
బతుకమ్మ, తెలంగాణ తల్లి, శ్రీరాముడు, అంబేద్కర్, ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారుల చిత్రాలను ఇసుక శిల్పాలుగా మలిచారు. ఒడిశాలోని కోణార్క్ బీచ్‌లో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప సంబరాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఛత్రపతి శివాజీ మహారాజ్ శిల్పాలతో గుర్తింపు పొందారు.అంతర్జాతీయ సైకత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.
సంప్రదాయానికి ఆధునిక రూపం
‘‘శిల్పం అంటే కేవలం రాయిలో చెక్కిన ఆకృతి మాత్రమే కాదు.. అందుబాటులో ఉన్న ప్రతి పదార్థంలో కళను ఆవిష్కరించడమే శిల్పకళ’’ అని కళాకారులు చెప్తున్నారు. తెలంగాణలో సిమెంట్ శిల్పాలు పట్టణాల సౌందర్యాన్ని పెంచడమే కాకుండా స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలను కూడా విస్తృతంగా కల్పిస్తున్నాయి. సంప్రదాయ శిల్పకళకు ఆధునిక సాంకేతికత జోడించడంతో ఈ రంగం మరింత విస్తరిస్తూ కొత్త తరానికి స్ఫూర్తినిస్తోంది.
శిల్పాలెన్నో...
తెలంగాణలో ట్యాంక్ బండ్ పై ప్రముఖుల విగ్రహాలతో పాటు అలంకార శిల్పాలు ఉన్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల ఆకారంలో సిమెంట్ శిల్పాలు ఉన్నాయి. కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కొన్ని అలంకార కాంక్రీట్ శిల్పాలు కనిపిస్తాయి.
తెలంగాణలోని పలు మున్సిపల్ పార్క్‌లు, పిల్లల ఉద్యానవనాల్లో జంతువులు, పక్షులు, కార్టూన్ పాత్రల సిమెంట్ శిల్పాలను ఏర్పాటు చేస్తుంటారు. గార్డెన్ సిమెంట్ శిల్పాలు, దేవాలయ విగ్రహాలు, పార్క్ శిల్పాలు, ఇంటి/భవనం సిమెంట్ మ్యూరల్స్, భారీ కాంక్రీట్ శిల్పాలు తయారు చేస్తున్నారు.
లైఫ్ & లిటరేచర్ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
