ఆణిముత్యాలు : భక్తి నుంచి ప్రేమ వరకు..దాశరథి గీతయానం

ఆణిముత్యాలు : భక్తి నుంచి  ప్రేమ వరకు..దాశరథి గీతయానం

తెలుగు సినిమా రంగానికి దాశరథి ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలనందించి చిరస్మరణీయులుగా నిలిచారు. తెలుగు చలనచిత్ర రంగానికి స్వర్ణయుగమనుకునే కాలంలో (దాదాపు 1970 దశకం వరకు) దాశరథి ఎన్నో వైవిధ్యమైన గీతాలు రచించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గీత రచనల్లో వాళ్లు స్పృశించని అంశం లేదేమోననిపిస్తుంది. నాకున్న కొద్ది పరిజ్ఞానంలో నాకున్న పరిమితిలో దాశరథి పాటల్లోని వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతలను విశ్లేషించడం సాహసమే అవుతుంది. 

ముందుగా భక్తి గీతాల విషయానికొస్తే భక్త ప్రహ్లాదలోని ‘‘ఆది అనాదియు నీవే దేవా”అనే పాట ప్రథమ స్థానం ఆక్రమిస్తుంది. అలతి పదాలతో, సరళమైన భాషలో పరమాత్ముని వర్ణన అమోఘంగా ఉంది. దానికి తగ్గట్టుగా ఈ పాటలో బాలమురళీకృష్ణ గమకాలు సంగీత ప్రియుల్ని బాగా అలరిస్తాయి. 

అలాగే ‘‘నడిరేయి ఏ జాములో” (రంగులరాట్నం), ‘‘తిరుమల మందిర సుందర”(మేనకోడలు), ‘‘రారా కృష్ణయ్యా”(రాము), ‘‘నను పాలింపగ నడచివచ్చితివా”(బుద్ధిమంతుడు) లాంటి పాటలు మళ్లీమళ్లీ వినాలనిపిస్తాయి. రంగుల రాట్నంలోని మరో పాట ‘‘చేపరూపమున”పాట (బి. వసంత)లో దశావతారాల వర్ణన లలితమైన పదాలతో హృద్యంగా సాగిపోతుంది. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో, మరెన్నో భక్తిగీతాలు మన చెవుల్లో మార్మోగుతుంటాయి. 

ఇక ఘంటసాల గానం చేసిన ‘‘కిలకిల నగవుల నవమోహిని”(వసంతసేన), ‘‘ఇలకు దిగిన అందాల తారవో”(చంద్రహాస), ‘‘విరిసిన వెన్నలవో”(బందిపోటు దొంగలు), ‘‘గోరొంక గూటికే చేరావు చిలకా”(దాగుడు మూతలు) మొదలైన గీతాలు చెప్పుకోదగ్గవి. బాలసుబ్రహ్మణ్యం కెరీర్​ ప్రారంభదశలో ఆణిముత్యంలా చిరకాలం నిలిచిపోయే చక్కటి గీతం ‘‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’’(కన్నెవయసు) గురించి ఎంత చెప్పినా తక్కువే. 

గానకోకిల సుశీల ఖాతాలో ఆణిముత్యాలనదగిన ‘‘మదిలో వీణలు మ్రోగె”(ఆత్మీయులు), ‘‘నీవు రావు నిదురరావు’’(పూలరంగడు), ‘‘అందాల బొమ్మతో ఆటాడవా”(అమరశిల్పి జక్కన్న), ‘‘వేణుగాన లోలునిగన ‘‘మదిలో విరిసే”(రెండు కుటుంబాల కథ)లాంటి గీతాలన్నీ దాశరథి కలం నుంచి జాలువారినవే. 

సుశీల గళంలో నుంచి వెలువడిన మరో వైవిధ్యమైన చిలిపి గీతం ‘‘గోదారి గట్టుంది” (మూగమనసులు), ‘‘ముక్తపదగ్రస్తం’’తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘‘ముక్తపదగ్రస్తాలంకారం”అంటే పై పాఠంలో ముగించిన పదంతో, తర్వాత పదం ప్రారంభం కావటమే విషయం రసజ్ఞులైన పాఠకులకు తెలిసే ఉంటుంది. ఆ చిత్రంలో గౌరిపాత్రకు (జమున) తగిన బిగువు, పొగరు, చిలిపిదనం, ఆ పాటల్లోని పదాల్లో ప్రతిధ్వనించేటట్టుగా సాగుతుందీ గీతం. 

యుగళగీతాల విషయానికొస్తే, దాశరథి రచనల్లో లాలిత్యం తొంగిచూస్తుంటుంది. అసలు ఆయన తొలి రచనే ఒక యుగళగీతం. ‘‘నాకంటిపాపలో” (వాగ్దానం) పాట పరిశీలిస్తే అందులోని సరళమైన పదాలు మన హృదయాన్ని సున్నితంగా స్పృశిస్తాయి. అలా, తన మొట్టమొదటి పాటతోనే తనదైన ముద్ర వేసుకుని ఆ తర్వాత ఆ శైలిని అలాగే కొనసాగిస్తూ, విశేషమైన ప్రజాదరణ పొందిన ఎన్నో గీతాల్ని రచించారు దాశరథి. 

‘‘దివి నుండి భువికి దిగివచ్చె” (తేనెమనసులు), ‘‘నన్ను వదలి నీవు పోలేవులే”(మంచి మనసులు) లాంటి మధురమైన యుగళగీతాలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటాయి. ఏ.ఎమ్. రాజాకు చెప్పుకోదగ్గ పాటల్లో ఒకటైన ‘‘సిరిమల్లె సొగసు – జాబిల్లి వెలుగు”(పుట్టినిల్లు–మెట్టినిల్లు) ఎంతో సున్నితంగా సాగిపోతుంది. అలాగే ‘‘ప్రేమ–పగ”చిత్రంలోని ‘‘కలసిన హృదయాలలోన”అనే యుగళగీతం బాలసుబ్రహ్మణ్యానికి పేరు తెచ్చిన గీతాల్లో ఒకటిగా చెప్పొచ్చు. 

‘‘ఇంతేనయా తెలుసుకోవయా”(కథానాయకుడు), ‘‘మంచిని మరచి వంచననేర్చి” (ఒకే కుటుంబం)లాంటి గీతాల్లో ఈ లోకం తీరుని నిర్మొహమాటంగా ఎండగట్టారు రచయిత. అలాగే ‘‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట”(బుల్లెమ్మ– బుల్లోడు)అనే గీతంలో మాతృప్రేమ నిర్మలత్వాన్ని, అమ్మ గొప్పతనాన్ని, చక్కటి వాడుక భాషలో తెలియజెప్పారు. కన్నెమనసులు చిత్రానికిగాను ‘‘అమ్మలగన్నయన్న గాజులమ్మ”అనే ప్రత్యేకమైన గీతాన్ని రచించారు దాశరథి. జానపదశైలిలో సాగిన ఈ గీతం కూడా ప్రజాదరణ  పొందింది. 

చిలిపి గీతాలు కూడా తాను రాయగలనని నిరూపించుకున్నారు దాశరథి.  శ్రీమంతుడు చిత్రంలోని ‘‘ఎంతో చిన్నది జీవితం’’, ‘‘బులిబులిఎర్రనిబుగ్గలదానా’’, ‘‘ఆహా! ఏమి అందం” లాంటి పాటలు చిలిపి పాటలకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఇదిగాక ఎస్పీబాలు గానం చేసిన ‘‘దోరవయసు చిన్నది”(దేవుడు చేసిన మనుషులు) కూడా ఇదే కోవలోకి వస్తుంది.  ఉర్దూ భాషలో కూడా నిష్ణాతుడైన దాశరథి, ఖుషీ, నిషా, హుషారు, మజా లాంటి పదాలను సందర్భోచితంగా తెలుగు పాటలతో జొప్పించి, పాట సొగసు చెడకుండా, ఆయా పాటలకు అనుగుణంగా వాడుకున్నారు. 

ఇక చివరిగా మంచి మనిషి చిత్రంలోని ‘‘ఓహో.. గులాబి బాలా!” పాట గురించి ప్రస్తావించకపోతే ఈ వ్యాసం అసంపూర్తిగా మిగిలిపోతుందేమో! ఈ గీతంలోని మొదటి చరణంలో యువతులకు నీతి బోధ చేస్తూనే, రెండో చరణంలో పురుష నైజాన్ని చక్కగా ఆవిష్కరించారు దాశరథి. వివిధ గాయకులు, గాయనీమణుల గళం నుంచి వెలువడిన దాశరథి కలం నుంచి జాలువారిన వైవిధ్యభరితమైన రచనలన్నింటినీ కాకపోయినా, ముఖ్యమైన వాటిని స్పృశించే నా ప్రయత్నం సఫలీకృతమైందో లేదో పాఠకులే నిర్ణయించాలి. 

- కె. ప్రభాకర్-

లైఫ్​ & లిటరేచర్​ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ  featureseditor@v6velugu.com