తిరుమలలో వసతి గదుల బుకింగ్ స్కాం... టీటీడీ కీలక సూచన

తిరుమలలో వసతి గదుల బుకింగ్ స్కాం... టీటీడీ కీలక సూచన

తిరుమలలో మరోసారి వసతి గదుల బుకింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. భక్తులకు వసతి గదులు ఇప్పిస్తామంటూ నకిలీ వెబ్ సైట్ల ద్వారా మోసం చేస్తున్నారు దళారులు. ఈ క్రమంలో అప్రమత్తమైన టీటీడీ భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది. తిరుమలలో “కర్ణాటక ప్రవాసి సౌధ” పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పి కేరళకు చెందిన ఓ భక్తుడిని మోసం చేశారని.. ఈ ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిపింది టీటీడీ. ఈ ఘటనపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టిందని తెలిపింది.

విచారణలో తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలు, టీటీడీ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించామని.. గూగుల్ సెర్చ్‌లలో ఈ ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తూ, భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపింది టీటీడీ.

►ALSO READ | శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమల సహా ఈ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేత..

ఈ క్రమంలో నకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు టీటీడీ ఐటీ విభాగం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశామని... అలాగే, టీటీడీ లోగోలు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.దర్శనం, వసతి గదులు, సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.

నకిలీ వెబ్ సైట్లు, దళారుల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని..అనుమానాస్పద వెబ్‌సైట్లు, ఫోన్ కాల్స్ పై వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తోంది టీటీడీ.