కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ డేటా వెల్లడించింది. ఈ ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీలు సమర్పించిన వివరాల ప్రకారం.. రాజకీయ నిధుల సమీకరణలో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉన్నట్లు తేలింది.
భారత రాజకీయాల్లో ఎన్నికల వ్యూహాల కంటే ఇప్పుడు పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్‌లు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు సమర్పించిన తాజా ఆర్థిక నివేదికల ప్రకారం.. అధికార బీజేపీ అక్షరాలా రూ.6వేల 900 కోట్ల పైచిలుకు బ్యాంక్ బ్యాలెన్స్‌తో దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా అవతరించింది. దీనికి పూర్తి భిన్నంగా దేశంలోని పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ కేవలం రూ.53 కోట్ల బ్యాలెన్స్ కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
కేంద్రంలోనూ.. తాజాగా ఢిల్లీ రాష్ట్రంలోనూ అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ, కార్పొరేట్ విరాళాలు, ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా భారీగా నిధులను సమీకరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన విరాళాలు మునుపటి ఏడాది కంటే 53% పెరిగి రూ. 6వేల 088 కోట్లకు చేరాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని రాష్ట్ర, జిల్లా యూనిట్ల నిధులను కలిపినా రూ.53 కోట్లు మాత్రమే ఉండటం ఆ పార్టీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను సూచిస్తోంది.
►ALSO READ | బెర్లిన్ వేదికగా.. దేశంలో ఓట్ చోరీపై రాహుల్ సంచలన కామెంట్స్
ఎన్నికల బరిలో నామమాత్రపు ఉనికిని కలిగి ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (BSP) దగ్గర కూడా కాంగ్రెస్ కంటే ఎక్కవ నిధులు ఉండటం గమనార్హం. బీఎస్పీ ఖాతాలో ప్రస్తుతం రూ.580 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే:
* ఆమ్ ఆద్మీ పార్టీ: రూ.9.9 కోట్లు.
* సీపీఎం: రూ.4 కోట్లు.
* సీపీఐ: రూ.41 లక్షలు.
ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ.. బీజేపీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు. 'ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్' వంటి సంస్థల ద్వారా బీజేపీకి అత్యధికంగా విరాళాలు అందుతున్నాయి. ఒక్క బీజేపీకే ఈ ట్రస్టుల ద్వారా దాదాపు 85% నిధులు దక్కుతుండగా, ప్రతిపక్షాలకు నామమాత్రపు నిధులే అందుతున్నాయి. కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. 2004లో బీజేపీ, కాంగ్రెస్ నిధుల నిష్పత్తి 60:40 ఉండేదని.. ఇప్పుడు అది 99:1 కి చేరిందని వెల్లడించారు. ఈ ఆర్థిక అసమానతలు రాబోయే ఎన్నికల ప్రచారాలపై, ప్రజాస్వామ్య పోటీతత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
