జర్మనీలోని బెర్లిన్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటిపై భాజపా దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
2024లో జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు న్యాయంగా జరగలేదని రాహుల్ అన్నారు. ఓటింగ్ లిస్టులో అవకతవకలు జరిగాయని, వీటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు. దీనిని ఆయన 'ఓటు చోరీ'గా పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం, నిఘా సంస్థలైన ఈడీ (ED), సీబీఐ (CBI)లను ప్రభుత్వం ఆయుధాలుగా వాడుకుంటోందని మండిపడ్డారు. కేవలం ప్రతిపక్ష నేతలపైనే కేసులు పెడుతూ, భాజపా నేతలను వదిలేస్తున్నారని ఆరోపించారు.
ALSO READ : ప్రజలను దోచుకోవడంలో ఏ ఒక్క చాన్స్ వదులుకోదు..
కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే వ్యాపారవేత్తలను ప్రభుత్వం బెదిరిస్తోందని, దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛ దెబ్బతింటోందని అన్నారు. మేము కేవలం ఒక పార్టీతోనే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తంతో పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ భారత్ ప్రతిష్టను విదేశాల్లో దిగజార్చుతున్నారని మండిపడింది. భాజపా ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కేవలం ఒక 'ప్రచార నేత' అని అన్నారు. దేశ ప్రజల తీర్పును గౌరవించకుండా, విదేశాలకు వెళ్లి దేశంపై విషం కక్కుతున్నారని విమర్శించారు.
భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ చేతులు కలుపుతున్నారని, తన ఓటమిని తట్టుకోలేక వ్యవస్థలపై నిందలు వేస్తున్నారని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్మని పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
