ఎంత నిర్లక్ష్యం.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా?.. బస్సు నిండా ప్రయాణికులు.. అదేం పట్టనట్లు.. తాను డ్రైవర్ నే కాదు అన్నట్లు.. నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రయాణికులను రిస్క్ లో పెట్టేలా డ్రైవింగ్..ప్రయాణికులను మందలించిన సోయి లేకుండా అదే తీరు..విసిగిపోయి ప్రయాణికులు ఇచ్చిన కంప్లైంట్ తో తన ఉద్యోగాన్ని రిస్క్ లో పడేసుకున్నారు ఓ ఆర్టీసీ డ్రైవర్.. కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో KSRTC బస్సు డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బస్సులో ప్రయాణికులను, రోడ్డుకు రెండు వైపులా ట్రాఫిక్ ఉన్నా పట్టించుకోకుండా సెల్ ఫోన్ చూస్తున్నాడు డ్రైవర్. బస్సు నిండా ప్రయాణికులు ఉన్నారు. జరగరానిది ఏదైనా జరిగితే ప్రయాణికుల ప్రాణాలకు పెద్ద రిస్కే. అయినా అవేం పట్టవన్నట్లు డ్రైవర్ రీల్స్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు.
మాండ్య నుంచి మైసూరు వైపు బస్సు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సునడపడం చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోయారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి బాగోతం వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు.
మాండ్య నుంచి మైసూర్ రోడ్డు ప్రయాణం అంటే కత్తిమీద సామే.. గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. అదే భయంతో ప్రయాణికులు ప్రాణాలు చేతిలో పట్టుకొని ప్రయాణించారు. నిర్లక్ష్యంగా బస్సు డ్రైవింగ్ చేసిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో ప్రయాణికుల పోస్టు ను చూసి స్పందించారు కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి.ఈ చర్య ప్రజాభద్రతకు తీరని ముప్పు అని, తక్షణమే డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైవర్ మహేష్ ను సస్పెండ్ చేసినట్లు కర్ణాటక ఆర్టీసీ కార్పొరేషన్ తెలిపింది. ఈ ఘటనపై విచారణ పెండింగ్ లో ఉంది.
