ఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • కష్టపడే వారికి చేయూత నివ్వాలి
  • ఉచితంగా నాణ్యమైన విద్యా, వైద్యమే ఇవ్వాలి
  • నేను పదవి విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే
  • నాయకులకు తప్పుడు భాష మాట్లాడటం అలవాటైంది

హైదరాబాద్ : ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలతో ప్రజలను సోమరి పోతులను తయారు చేస్తున్నారని అన్నారు. కష్టపడే వారికి చేయుత నివ్వాలని అన్నారు. ఉచిత బస్సు ఇవ్వుమని మహిళలు అడిగారా? అని ప్రశ్నించారు. నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో సర్దార్ పటేల్ ఆడిటోరియంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్ పేయి జీవితం తెరిచిన పుస్తకం.. ప్రతి పేజీ స్పూర్తి దాయకమన్నారు. 

బీజేపీకి బలమైన పునాది వేసిన వ్యక్తుల్లో వాజ్ పేయి ముందు వరుసలో ఉంటారని చెప్పారు. వాజ్ పేయిని.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ శిష్యు డిగా ఎంచుకున్నారని తెలిపారు. వాజ్ పేయి పాలన అంటే సుపరిపాలన అని చెప్పారు. తాను పదవి విరమణ మాత్రమే చేశా. పెదవి విరమణ చేయలేదన్నారు. రాజ్యాంగం పుస్త కాన్ని పట్టుకుని తిరిగితే అంకిత భావంతో పనిచేసినట్లు కాదన్నారు. రాజకీయ నాయకులకు తప్పుడు భాషమాట్లాడటం అలవాటు అయిపో యిందని చెప్పారు. పీవీ సంస్కరణలు తీసుకు వస్తే.. సంస్కరణలను ఆచరణలోకి తెచ్చిన వ్యక్తి వాజ్ పేయి అన్నారు. వాజ్ పేయిని ప్రత్యర్థులు కూడా అజాత శత్రువు అని పిలిచే వారన్నారు.

ఉచితాలకు బీజేపీ వ్యతిరేకం కాదు

బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. రాజకీయాల్లో భాష ప్రయోగం అనేది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తుందన్నారు. రాజకీయ విమర్శలు ఉండాలి తప్పితే.. వ్యక్తులను విమర్శించకూడదని చెప్పారు. తెలంగాణలో బూతుల రాజకీయాన్ని అంతం చేయాలని అన్నారు.