టీ.. పొద్దున్న లేస్తే టీ, ఆఫీసుకు వెళ్తే టీ, బ్రేక్ టైంలో టీ, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు టీ, ఇంటికొచ్చాక మరో టీ..ఇలా రోజులో కనీసం నాలుగైదు సార్లయినా టీ షాపు దగ్గరికి వెళ్లేవారు చాలామంది. ఎవరైనా టీ షాపులో టీ కోసమే వెళ్తాము, మహా అయితే టీతో పాటు సమోసా, సిగరెట్ తీసుకుంటాం.. కానీ టీ షాపులో గంజాయి అమ్మడం ఎక్కడైనా చూశారా..? అవును హైదరాబాద్ లోని ఓ టీ షాపులో పబ్లిక్ గా గంజాయి అమ్ముతున్నారు. అది కూడా ఓనర్ కి తెలీకుండా వర్కర్ గంజాయి అమ్ముతున్నాడు.హైదరాబాద్ లోని ఉప్పల్ లో టీ కొట్టులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
హైదరాబాద్ లోని ఉప్పల్ లో హెడ్ పోస్టాఫీసు ఎదురుగా ఉన్న టీ కొట్టులో పని చేసే ఉద్యానాథ్ గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ( ఫిబ్రవరి 6 ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్ముతున్న ఉద్యానాథ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉద్యానాథ్ గంజాయి అమ్మకాల ద్వారా ఓనర్ ఇచ్చే జీతం కంటే రెట్టింపు ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
ఉద్యానాథ్ టీకొట్టుకు వచ్చిన కస్టమర్లకు టీతోపాటు రూ.500కు గంజాయి ప్యాకెట్‌ను అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. టీకొట్టు దగ్గరే స్కూటిలో గంజాయి పెట్టి అమ్ముతున్నట్లు తెలిపారు. ఓనర్ తెలీకుండా బీదర్ నుంచి గంజాయి తెప్పించి అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు.
పక్కా సమాచారంతో టీకొట్టుపై దాడి చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని.. అతని దగ్గరి నుంచి 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడని, గంజాయిని, స్కూటీని ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు పోలీసులు.
