సిటీ అమ్మాయిలకు గుండె జబ్బుల ముప్పు

సిటీ అమ్మాయిలకు గుండె జబ్బుల ముప్పు
  •                 హైదరాబాదీ యువతుల్లో 29% మందికి సిండ్రోమ్‌‌
  •                 ఇంకా పెరిగితే మునుపెన్నడూ లేనట్టు గుండె జబ్బులు
  •                 ‘అసెస్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ కార్డియోవాస్కులర్‌‌ రిస్క్‌‌’ సర్వేలో వెల్లడి

గుండె సమస్యలు ఎక్కువగా ఎవరికొస్తాయి? అంటే టక్కున పెద్దోళ్లకని చెబుతాం. మగవాళ్లు ఈ రోగాల బారిన ఎక్కువ పడుతుంటారంటాం. కానీ ఆడవాళ్లల్లోనూ ఈ సమస్యలు పెరుగుతున్నాయి. అది కూడా చిన్న వయసులో ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదీ యువతులు, మహిళలూ ఈ రోగాల అంచున ఉన్నారు. హైబీపీ, ఉబకాయం, మధుమేహానికి కారణమయ్యే మెటబాలిక్‌‌ సిండ్రోమ్‌‌.. 20 నుంచి 30 ఏళ్లున్న సిటీ యువతుల్లో ఎక్కువవుతోంది. ఈ సిండ్రోమే గుండె సమస్యలు, గుండెపోటులకు దారితీస్తుంది. ‘అసెస్మెంట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎమాంగ్ ఉమెన్ వూ ఆర్ ది ఇండస్ట్రియల్ ఏరియా ఆఫ్ హైదరాబాద్’ పేరుతో డాక్టర్లు చేసిన అధ్యయనంలో ఈ విషయం  వెల్లడైంది.

హైరిస్క్‌‌లో 2.5% మంది

సిటీ యువతుల్లో చాలా మందికి ఇప్పుడిప్పుడే గుండె రోగాలకు సంబంధించిన లక్షణాలు పెరుగుతున్నాయని, త్వరలో ప్రమాదకర స్థాయిలో సమస్యలు వస్తాయని సర్వేలో తేలింది. 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళలు మునుపెన్నడూ లేనట్టు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడతారని వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 2.5 శాతం మంది హైరిస్క్‌‌, 3.7 శాతం మంది మధ్యరకం జోన్‌‌లో ఉన్నట్టు తెలిసింది. సిటీ యువతుల్లో 29.7 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని, ఇది పెరిగితే మధ్యరకం జోన్‌‌లో ఉన్న వాళ్లు 12 రెట్లు, హైరిస్క్‌‌ జోన్‌‌లో ఉన్న వాళ్లు 22 రెట్లు పెరుగుతారంది. ఇదే జరిగితే గుండె జబ్బులు సిటీ యువతులను చుట్టుముడతాయని సర్వే హెచ్చరించింది.

సిండ్రోమ్‌‌ను ఎట్ల గుర్తిస్తరు?

హై బీపీ, ఒబెసిటీ, ఎక్కువ కొవ్వు, పెరిగిన గ్లూకోజ్, నడుము చుట్టుకొలత 80 సెం.మీ కంటే ఎక్కువ లేదా రక్తంలో ఇన్సులిన్‌‌లో పెరుగుదల ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ సిండ్రోమ్‌‌ ఉందటే గుండె జబ్బులు, గుండె పోటులు ఈజీగా వస్తాయి. స్థూలకాయం సమస్య కూడా మెటబాలిక్‌‌ సిండ్రోమ్‌‌కు దారి తీస్తుంది. స్థూలకాయంతో కండరాల నొప్పులు, గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు, షుగర్‌‌, ఉబ్బసం వచ్చే అవకాశాలెక్కువ. సాధారణ వ్యక్తుల్లా వీళ్లు ఎక్కువగా నడవలేరు. ఎత్తులు ఎక్కలేరు.