విశాఖలో మ‌రో ఫ్యాక్ట‌రీ నుంచి దట్టమైన పొగలు.. ప‌రుగులు తీసిన జ‌నం

విశాఖలో మ‌రో ఫ్యాక్ట‌రీ నుంచి దట్టమైన పొగలు.. ప‌రుగులు తీసిన జ‌నం

విశాఖ ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి ప‌రిశ్ర‌మ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాయి. విశాఖ‌ప‌ట్నం స‌మీపంలోని మ‌ల్కాపురం ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) కంపెనీ రిఫైన‌రీ నుంచి ద‌ట్ట‌మైన పొగ‌లు రావ‌డంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోయారు. ఇటీవ‌ల ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ గ్యాస్ లీక్ విషాదాన్ని క‌ళ్లారా చూసిన ప్ర‌జ‌లు ఈ పొగ వ్యాపించ‌డం చూసి భ‌యంతో ఇళ్ల నుంచి ప‌రుగులు తీశారు. భారీ ఎత్తున ఒక్క‌సారిగా తెల్లని పొగ అలుముకోవడంతో ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం ప్రాంత వాసులు భ‌యాందోళ‌న చెందారు. అయితే కొద్ది నిమిషాల్లోనే పొగ తీవ్ర‌త త‌గ్గి మామూలు స్థితికి రావ‌డంతో ప్ర‌జ‌లంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఈ సంఘటనపై హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం స్పందించింది. రిఫైనరీలోని ఎన్‌హెచ్‌యూను తెరిచే క్రమంలో ఇలా జ‌రిగింద‌ని తెలిపింది. టెంప‌రేచ‌ర్ ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో రిఫైన‌రీ గొట్టాల‌ నుంచి భారీగా పొగ‌వ‌చ్చింద‌ని, వెంట‌నే గుర్తించి, ప‌రిస్థితిని కంట్రోల్ చేశామ‌ని కంపెనీ అధికారి ఒక‌రు తెలిపారు. కొద్దిసేప‌టికే పొగ ఏమీ లేకుండా ప‌రిస్థితి నార్మ‌ల్ అయింద‌ని చెప్పారు. ఎవ‌రికీ ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని వివ‌రించారు.