బాలీవుడ్ "ఖిలాడీ" కుమార్...

బాలీవుడ్ "ఖిలాడీ" కుమార్...

బాలీవుడ్ బాక్సాఫీస్‌ని ముగ్గురు ఖాన్‌లు ఏలుతున్న సమయంలో ఒక కొత్త హీరో దూసుకొచ్చాడు. అతని స్పీడుకి బాలీవుడ్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. తన టాలెంట్‌కి రికార్డులన్నీ బద్దలయ్యాయి.అప్పుడు మొదలైన అతని హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంత చెప్పిన తర్వాత అతని పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీ సినిమాలు చూసే ఎవరికైనా అర్థమైపోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు అక్షయ్ కుమార్ అని. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అక్షయ్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు.

అసలు పేరు అక్షయ్ కాదు..


1967లో పంజాబ్‌లోని అమృత్సర్‌‌లోఅక్షయ్ కుమార్ జన్మించాడు.  అతని అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. హరి ఓం అనేది అక్షయ్ తండ్రి పేరు. ఆయనో మిలిటరీ ఆఫీసర్. చిన్నప్పటి నుంచి అక్షయ్‌ని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. అందుకే తండ్రి అంటే అక్షయ్‌కి ఎంతో ప్రేమ, గౌరవం. తన ప్రొడక్షన్ కంపెనీకి కూడా తండ్రి పేరే పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి అక్షయ్‌కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రెజ్లింగ్ అంటే  మహా ఇష్టం. అక్షయ్ కూడా స్కూల్ డేస్ నుంచే కరాటే నేర్చుకున్నాడు. చదువుపై ఆసక్తి ఉండేది కాదు.  మనసంతా మార్షల్ ఆర్ట్స్ మీదే. అందుకే తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు.  తన ఆసక్తిని గమనించిన తండ్రి..కొంత డబ్బు కూడబెట్టి మరీ తనని థాయ్‌లాండ్ పంపించాడు. ఐదేళ్ల పాటు బ్యాంకాక్‌లో ఉండి థాయి బాక్సింగ్ నేర్చుకున్నాడు. 

వెయిటర్గా పనిచేసిన అక్షయ్ కుమార్... 


థాయ్‌లాండ్‌లో అక్షయ్ కుమార్ అనేక పనులు చేశాడు. చాలా కాలం పాటు చెఫ్‌గానూ, వెయిటర్‌‌గానూ పని చేశాడు. ఆ తర్వాత కోల్‌కతా వచ్చి ఓ హోటల్లో పని చేశాడు. తర్వాత ఢిల్లీ వెళ్లి ఓ జ్యూయెలరీ షాపులో వర్క్ చేశాడు. కొన్నాళ్ల తర్వాత ముంబైలో  మార్షల్ ఆర్ట్స్ క్లాసులు చెప్పాడు. అతని స్టూడెంట్స్లో ఒకబ్బాయి ఫాదర్ మోడల్ కో ఆర్డినేటర్. ఆయన ఓ మోడలింగ్ అసైన్‌మెంట్కు  అక్షయ్ను రిఫర్ చేశాడు. నెల రోజులు కష్టపడితే వచ్చేంత డబ్బు మొదటి రెండు రోజుల్లోనే రావడం చూసి అక్షయ్ షాకయ్యాడు. దాంతో అదే రంగంలో కొనసాగాలని డిసైడయ్యాడు.  మోడల్గా ట్రై చేయాలంటే పోర్ట్ఫోలియో కావాలి. దానికి ఫొటోగ్రాఫర్లకి బోలెడంత చెల్లించాలి. దాంతో రెండేళ్ల పాటు ఓ ఫొటోగ్రాఫర్ దగ్గర పైసా జీతం తీసుకోకుండా అసిస్టెంట్గా అక్షయ్ కుమార్ పనిచేశాడు.  ఆ తర్వాత పోర్ట్ఫోలియో తయారు చేయించుకుని అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొన్ని యాడ్స్ చేశాడు. కొన్ని సినిమాల్లో గ్రూప్ డ్యానర్గా వర్క్ చేశాడు.

‘ఖిలాడీ’ సినిమాతో బ్రేక్..


 అక్షయ్ కుమార్ మొదటి సినిమా ‘ఆజ్’. కరాటే ఇన్‌స్ట్రక్టర్‌‌గా చిన్న పాత్ర చేశాడు. తర్వాత ‘సౌగంధ్‌’లో లీడ్ రోల్ చేశాడు. ఆ తర్వాత అక్షయ్కు వరుస అవకాశాలు వచ్చాయి. ‘ఖిలాడీ’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఈ టైటిల్‌తో ఎన్నో సినిమాలు చేశాడు.  మై ఖిలాడీ తూ అనాడీ, సబ్‌సే బడా ఖిలాడీ, ఖిలాడియోంకా ఖిలాడీ, ఖిలాడీ 786, ఇంటర్నేషనల్ ఖిలాడీ, మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడీ, ఖిలాడీ 420.. ఇలా చాలా సినిమాలు చేసి ఖిలాడీ కుమార్‌‌గా పేరు తెచ్చుకున్నాడు.

రీమేక్స్పై ఆసక్తి..


అక్షయ్ కెరీర్‌‌లో వందకోట్ల క్లబ్బులో చేరిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఏడేళ్ల పాటు ఫెయిల్యూర్‌‌ అన్నదే ఎరుగని ట్రాక్ రికార్డ్ అతనిది. కమర్షియల్ హీరోగానే పాపులర్ అయినా.. రియల్ ఇన్సిడెంట్స్పై తీసే సినిమాలకు చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు.  ప్యాడ్ మేన్, ఎయిర్‌‌ లిఫ్ట్, టాయిలెట్ ఎక్ ప్రేమ్‌కథ, బెల్ బాటమ్, రుస్తుం, జాలీ ఎల్‌ఎల్‌బీ, గోల్డ్, కేసరి, మిషన్ మంగళ్.. ఇలా చాలా సినిమాల్లో రియల్ లైఫ్ క్యారెక్టర్లు పోషించాడు. అతడు ప్రస్తుతం చేస్తున్న రామసేతు, క్యాప్సూల్ గిల్, ఆకాశమే నీ హద్దురా రీమేక్ కూడా ఈ కోవకు చెందిన సినిమాలే. ఇక సౌత్‌లో హిట్టయిన సినిమాల రీమేక్స్ చేయడానికి అక్షయ్ ఎప్పుడూ ముందుంటాడు. స్ట్రెయిట్‌ సౌత్‌ ఫిల్మ్లో మాత్రం ఒకే ఒక్కసారి నటించాడు. రజినీకాంత్‌తో శంకర్ తీసిన ‘2.ఒ’లో స్ట్రెయిట్గా యాక్ట్ చేశాడు. 

టైం అంటే అక్షయ్..అక్షయ్ అంటే టైం..


అక్షయ్ కుమార్  ఫిట్‌నెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. రోజూ ఉదయం నాలుగింటికే లేచి వ్యాయామం చేస్తాడు. ఆ తర్వాత రెడీ అయి షూటింగులైనా ఇంటర్వ్యూలైనా ఆరింటికే మొదలుపెట్టేస్తాడు. సాయంత్రం సన్‌సెట్ అవ్వకముందే డిన్నర్ ముగించేస్తాడు. ప్రతిదీ టైమ్ ప్రకారమే చేస్తాడు. అతనిలా ఉండటం చాలా కష్టమని తోటి హీరోలంతా చెబుతుంటారు.

సేవా కార్యక్రమాల్లోనూ ముందే.. 
అక్షయ్‌కి సేవాగుణం చాలా ఎక్కువ. తరచూ చారిటీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. భారీగా విరాళాలు ఇస్తుంటాడు. బాంబు దాడుల బాధిత కుటుంబాలకి.. సైనికులు, పోలీసుల కుటుంబాలకి అండగా నిలబడుతుంటాడు. తాను కోట్లలో ఇచ్చేదే కాకుండా ఫండ్స్ రెయిజ్ చేయడం కోసం తరచూ లైవ్‌ షోలు ఇస్తుంటాడు. ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా షోస్ చేశాడు.
 
అక్షయ్కు ఎవరంటే అభిమానం..


అక్షయ్ కుమార్‌‌కి ముగ్గురు వ్యక్తులంటే చాలా ఇష్టం. సిల్వెస్టర్ స్టలోన్, జాకీ చాన్, శ్రీదేవి. థాయ్‌లాండ్‌లో చెఫ్‌గా పని చేస్తున్నప్పుడు అతని రూమ్‌లో ఈ ముగ్గురి పోస్టర్లే ఉండేవట. వాళ్లని చూసి ఎంత పెద్ద స్టా్ర్స్ అనుకునేవాడట. దేవుడి దయవల్ల ఆ ముగ్గురితో పని చేసే చాన్స్ తనకి దొరికిందని ఓ ఇంటర్వ్యూలో సంతోషంగా చెప్పాడు.  అక్షయ్‌ కుమార్‌‌కి ఓ పెద్ద సెంటిమెంట్ ఉంది. తాను మొదటగా కొనుక్కున్న దేన్నీ వదులుకోడానికి ఇష్టపడడు. మొదటి ఇల్లు, మొదటి బైక్, మొదటి కార్.. ఇలా అన్నింటినీ చాలా ఇష్టపడతాడు. అవి పాడయినా వాటిని వదులుకోవడానికి ఇష్టపడడు.

ఇలా చెప్పుకుంటూ పోతే అక్షయ్‌ గురించి చాలా విశేషాలున్నాయి. మంచి నటుడు.. క్రమశిక్షణ గల వ్యక్తి.. మనసున్నమనిషి అంటూ అతని గురించి తరచూ ఎవరో ఒకరు కితాబిస్తూనే ఉంటారు. ఆయన హవా మరిన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అక్షయ్‌ కుమార్‌‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.