నొప్పులు పడుతుంటే వదిలేసి పోయిండు

నొప్పులు పడుతుంటే వదిలేసి పోయిండు
  • యువతిని నమ్మించి గర్భవతిని చేసిన హోంగార్డు
  • మగబిడ్డకు జన్మనిచ్చి  బాలింత మృతి
  • కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘటన

ఆసిఫాబాద్, వెలుగు: అతనో హోంగార్డు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు. ప్రసవ వేదనలో అల్లాడుతున్నా రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. స్థానిక డాక్టర్ల సాయంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినా మెరుగైన వైద్యం అందక ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

 అడిగినప్పుడల్లా మాయమాటలు చెప్పి..

కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా నార్నూర్ మండలానికి చెందిన సజ్జన్‌‌‌‌లాల్ ఏఆర్ హెడ్‌‌‌‌క్వార్టర్‌‌‌‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. దాంపూర్‌‌‌‌కు చెందిన అరుణ (25)తో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. పెళ్లి గురించి అరుణ అడిగినప్పుడల్లా మాయమాటలు చెబుతూ నెట్టుకొచ్చాడు. ఈ క్రమంలో గత ఆదివారం (4వ తేదీ) అరుణకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు, సజ్జన్‌‌‌‌లాల్‌‌‌‌ ఆసిఫాబాద్‌‌‌‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. తన పరిస్థితి బాగా లేదని డాక్టర్లు చెప్పడంతో మంచిర్యాలకు తరలించారు. అక్కడి డాక్టర్లు హైదరాబాద్‌‌‌‌ తీసుకెళ్లాలని చెబితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరుణను సజ్జన్‌‌‌‌లాల్‌‌‌‌ మళ్లీ ఆసిఫాబాద్‌‌‌‌కు తీసుకొచ్చాడు. దాంపూర్‌‌‌‌ వెళ్లి బైక్‌‌‌‌ తీసుకొస్తానని చెప్పి పారిపోయాడు. ఓ డాక్టర్‌‌‌‌ సాయంతో ఆదిలాబాద్‌‌‌‌ రిమ్స్‌‌‌‌కు తరలించారు.

పిల్లాడు ఐసీడీఎస్‌‌‌‌కు

గత మంగళవారం పండంటి మగబిడ్డకు అరుణ జన్మనిచ్చింది. తర్వాత ఆరోగ్యం క్షీణించి శనివారం కన్నుమూసింది. మే 18నే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆదివారం ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు శవాన్ని తీసుకెళ్లమని చెప్పారు. దవాఖానకు చేరుకున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎస్పీ మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని డీఎస్పీ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఐసీడీఎస్ అధికారులు పిల్లాడిని ఆదిలాబాద్‌‌‌‌ శిశు విహర్‌‌‌‌కు తరలించారు.

మీకు కామనేగా అన్నరు

గత ఆదివారం డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాజును కలిశాం. సజ్జన్‌లాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరాం. డెలివరీ తర్వాత చూద్దామని డీఎస్పీ అన్నారు. ఇలాంటివి మీకు మామూలే అంటూ సీఐ హేళనగా మాట్లాడారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయింది.- మృతురాలి తండ్రి నామ్‌దేవ్