సిటీలో పెరిగిన ఇండ్ల కిరాయి

సిటీలో పెరిగిన ఇండ్ల కిరాయి

మిడిల్​ క్లాస్​కి భారమైన అద్దె ఇల్లు..మెయిన్​ సెంటర్లు, శివారులోనూ అదే తీరు
అదనపు భారంగా మెయింటెనెన్స్ చార్జీలు, నల్లా బిల్లులు


మెయిన్​ సెంటర్లు.. సమీప కాలనీలతోపాటు ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా సిటీ నలుమూలలా ఇండ్ల రెంట్లు​ పెరిగాయి. ఒకప్పుడు మెయిన్​ సిటీతో పోల్చితే శివార్లలో కొంత తక్కువ ఉండేది. మెట్రో రైల్​ రావడం.. రవాణా మెరుగవడంతో శివారులోనూ కొన్ని కంపెనీలు తమ బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో డిమాండ్​ పెరిగి ఇండ్ల రెంట్​కు రెక్కలొచ్చాయి. తాజాగా ఓ రియల్టీ సంస్థ నివేదిక ఆధారంగా బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీల్లో 6శాతం ఇండ్ల రెంట్​ పెరిగితే, హైదరాబాద్​లో 6 నుంచి 9శాతం పెరిగినట్టు తెలుస్తోంది. కూకట్ పల్లి, గచ్చిబౌలి, బంజారా హిల్స్, హైటెక్  సిటీ, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో రెంట్లు భారీగా ఉన్నాయి. డబుల్​ బెడ్రూం ఇండ్లు రూ.22 వేలకుపైగానే దొరుకుతున్నాయి. శివారులో సింగిల్​ బెడ్రూం రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉంది. మెయింటెనెన్స్, నల్లాబిల్లులు అదనపు భారంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : సిటీలో ఇంటి కిరాయిలు విపరీతంగాపెరుగుతున్నాయి. విద్య, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ సిటీకి వలసలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు  అంతర్జాతీయ స్థాయి కంపెనీల రాకతో ఇక్కడకు వచ్చేందుకే ఆసక్తి చూపుతున్నారు. సరిపడా ఇళ్లు లేక అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ రియల్టీ సంస్థ నివేదిక ఆధారంగా బెంగుళూరు, చెన్నయ్ వంటి నగరాల్లో 6 శాతం పెరిగితే, అదే హైదరాబాద్  లో మాత్రం కనీసం 6–9శాతం పెరిగినట్లుగా స్పష్టమైంది. ఏరియా, కనెక్టవిటీ వంటి అంశాల ఆధారంగా ఇంటి అద్దెలు పెరుగుతుండగా.. చిరు, మిడిల్ క్లాస్ ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది.

నగరంలో కోటికి పైగా జనాభా

కోటిపైగా జనాభా ఉన్న  హైదరాబాద్ లో… వందలాది ఇళ్లు, అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు అద్దెలకు ఇచ్చే కమర్షియల్ భవనాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రెంటల్ కూడా ఆదాయ వనరుగా ఉన్న భవనాలు లెక్కకు మించే  ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో ఉండే పలు ప్రాంతాల్లో ఉన్న ఇంటి అద్దెలను గమనిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ప్రధానంగా నగరంలో బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, ఉప్పల్, విద్యానగర్, ఖైరతాబాద్, రామాంతాపూర్, దిల్ సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటి అద్దె రేట్లు భారీగా ఉన్నాయి.

శివారు ప్రాంతాల్లోనూ భారీగా రెంట్స్

శివారు ప్రాంతాలైన హయత్ నగర్, ఆల్వాల్, లింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్,  పటాన్ చెరు, సుచిత్ర, బీఎన్ రెడ్డి, సంతోష్ నగర్, రాజేంద్ర నగర్ వంటి ఏరియాల్లోనూ కనీసపు అద్దె రూ. 6వేలుగా ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన నిర్మాణాలు జరగకపోవడంతో కొన్ని ఏరియాల్లో కాళ్లరిగేలా తిరిగినా ఇళ్లు దొరకడం లేదు.  ఈ ఏరియాల నుంచి ఐటీ కారిడార్ ఏరియాల్లో ఉండే ప్రాంతాలతో పోల్చితే అద్దెల మధ్య కనీసం రూ. 3వేల నుంచి రూ. 5వేల తేడా ఉండటం సర్వసాధారణమైపోయింది.

ఆదాయ వనరుగా  రెంటల్స్

ప్రస్తుతం సిటీలో రెంటల్స్ భారీగా పెరుగుతుండటంతో కొత్తగా ఇళ్లను నిర్మించుకునేవారు ఇంటి అద్దెలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ విస్తీర్ణంలో ఇంటిని కట్టుకున్నా… యజమానుల ఇంటి ఖర్చులు పోను, అదనంగా బ్యాంక్ లోను ఇతర ఖర్చులు అద్దెల రూపంలో వచ్చేలా ముందు జాగ్రత్త పడుతున్నారు. దీంతో కట్టే డబుల్ ఫ్లోర్ ఇళ్లు అయినా ఖచ్చితంగా మూడు నాలుగు సింగిల్ బెడ్రూం పోర్షన్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. యజమానులు ఉండేందుకు పోను, మిగిలిన పోర్షన్లను అద్దెకు ఇవ్వడానికి అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. దీంతో ఒకవేళ హోం లోన్ తీసుకున్నా..  లోన్ ఈఎంఐలో కనీసం 75శాతం అద్దెల రూపంలో వసూలయ్యే విధంగా చూస్తున్నారు.

పెరిగిన మెయింటనెన్స్ ఖర్చులు

రెండేళ్ల క్రితం మెయింటనెన్స్ అనేది చాలా అరుదుగా కనిపించేది. కానీ ఇటీవల కాలంలో సాధారణ అపార్టు మెంట్ అయినా ఖచ్చితంగా మెయింటెనెన్స్ అడుగుతున్నారు. నల్లా బిల్లు, మెయింటెనెన్స్ అంటూ అన్ని ఖర్చులు పోనూ ఇంటి అద్దెను లెక్కించేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఏ చిన్నపాటి ఇళ్లల్లో నల్లా బిల్లు,  మెయింటెన్స్ తోపాటు అదనంగా కరెంట్ బిల్లు కట్టుకోవాల్సిందే. ఇదీ సాధారణ ఏరియాల నుంచి కమర్షియల్ ఏరియా వరకు ఏ ప్రాంతాల్లో గమనించిన కనీసం రూ. 700 నుంచి రూ. 3వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సిందే.

ఐటీ కారిడార్ హాట్ కేక్

ఐటీ కేంద్రమైన హైదరాబాద్ లో.. ఎక్కువగా ఆఫీసు కార్యాలయాలన్నీ హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండా పూర్ , శేరిలింగంపల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల ఏరియాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతాల్లో ఉండేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తే అద్దెలకు భయపడాల్సిందే. ఎక్కువగా డబుల్ బెడ్రూం ఇళ్లను రెంటు తీసుకునేందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మొగ్గు చూపుతుంటారు. 900 నుంచి 1200 చదరపు అడుగుల ఇంటి అద్దెలు గతేడాదిలో రూ. 15 వేల నుంచి 25వేల మధ్య ఉండగా, ఆరు నెలల కాలంలోనే ఏకంగా రూ. వెయ్యి పెరిగి మినిమం రూ. 16వేల నుంచి రూ. 28వేలకు చేరుకున్నాయి.  ఇలా వసతులు, సౌకర్యాలను బట్టి అదనంగా మరో రూ. వేలు ఖర్చు పెడితే గానీ డబుల్ బెడ్రూం ఇంటిని అద్దెకు తీసుకునే పరిస్థితి లేదు. ఆ ఏరియాల్లో సింగిల్ బెడ్రూం ఇళ్లు రెంటల్ కూడా అంచనాలకు మించి పెరిగిపోవడంతో పది కిలోమీటర్ల పరిధిలో రెసిడెన్షియల్ ఏరియాలకు అనువుగా ఉండే బస్తీలు, కాలనీలకు మరింత డిమాండ్ పెరుగుతోంది.

రూ.1500 పెరిగింది

కొన్నేళ్లుగా కుషాయిగూడ ఏరియాలో ఉంటున్నా.. గతేడాదిలో సింగిల్ బెడ్రూం సాధారణ బడ్జెట్ లో దొరికేది. మినిమయ్ రూ.5 వేల నుంచి రూ. 6వేల లో అన్ని ఖర్చులతో కలిపి ఉండేవి. తాము ఉండే ఏరియాలో ఇప్పుడు రూ. 6500 అద్దెకు అదనంగా మరో రూ1000 ఖర్చు చేసిన సింగిల్ బెడ్రూం దొరకడం లేదు.

– ఆకారపు నటరాజ్, ఉద్యోగి

బ్యాచిలర్స్ కు మరింత ఎక్కువ

సిటీలో బ్యాచిలర్స్​కు ఇళ్లు దొరకడమే కష్టంగా ఉంది. సికింద్రాబాద్ లోని సింధి కాలనీలో ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం రూ. 4500కు సింగిల్ బెడ్రూం దొరికింది. కానీ ఆ ఏరియాలో రెంటు పెంచడంతో, కాస్తా దూరమైనా సుచిత్ర వరకు వెళ్లాను. అయినా రూ. 6500 వరకు అది కూడా సింగిల్ బెడ్రూం అని చెబుతున్నారే కానీ, ఒక్క బెడ్ ఉంటే ఇక కదలడమే ఇబ్బంది మారేంత ఇరుగ్గా ఉంటుంది. అయితే బ్యాచిలర్ అని చెప్పామంటే ఐదొందలు ఎక్కువే చెబుతున్నారు.

– రాజశేఖర్, సేల్స్ మెన్