ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజుల పెంపు

ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజుల పెంపు
  • వచ్చే అకడమిక్​ ఇయర్​కు ఫీజులు ఎంత పెరుగుతయో!
  • ఫీజులు పెంపుపై వారంలో టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్
  • ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సులపై ప్రభావం

హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు అన్ని ప్రొఫెషనల్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి ఫీజులు మారనున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. టీఏఎఫ్ఆర్సీ గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు ఈ అకడమిక్​ఇయర్​తో  ముగుస్తుంది. దీంతో రానున్న మూడేండ్లకు కొత్త ఫీజులను నిర్ణయించనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

గతంలో 20 శాతం పెంపు
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీఎడ్, మేనేజ్​మెంట్, మెడికల్ తదితర కోర్సుల ఫీజులను ప్రతి మూడేండ్లకోసారి టీఏఎఫ్ఆర్సీ నిర్ణయిస్తోంది. ఈ అకడమిక్ ఇయర్​తో2019–22 బ్లాక్ పీరియడ్​పూర్తికానుంది. దీంతో 2022–25 వరకు మూడేండ్ల కాలానికి కొత్తగా ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ప్రధానంగా ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొంది.  గత బ్లాక్ పీరియడ్​లో టీఏఎఫ్ఆర్సీ కనీస ఫీజును రూ.35 వేలు, అత్యధికంగా రూ.1.34 లక్షలుగా ప్రకటించింది. ఈ టర్మ్​లో సగటున ఫీజులు 20 శాతం పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లతో పాటు ఎంసెట్ లో 10 వేల లోపు ర్యాంకు తెచ్చుకున్న స్టూడెంట్లకు మాత్రమే టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన మొత్తం ఫీజును సర్కారు చెల్లిస్తోంది. అంతకంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన స్టూడెంట్లకు కేవలం మినిమమ్ ఫీజునే ఇస్తోంది. పై ఫీజు విద్యార్థులే చెల్లిస్తున్నారు.

కనీస​ఫీజు మారకపోవచ్చు..
కాలేజీల ఆదాయ, వ్యయ నివేదికలు, అక్కడున్న సౌలత్​ల ఆధారంగానే ఫీజులను ఖరారు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. వారం రోజుల్లో టీఏఎఫ్​ఆర్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని మంగళవారం జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. కాలేజీలు అందించిన వివరాలను పరిశీలించి, ఆయా కోర్సుల్లో ఫీజులను సర్కారుకు సిఫారసు చేయనున్నారు. దీనిపై సర్కారు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనుంది. అయితే రెండేండ్లుగా కరోనా ఎఫెక్ట్​ఉండటంతో, మినిమమ్ ఫీజును మార్చకూడదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా కోర్సుల ఫీజుల్లోనూ ఇదే విధానం అమలు చేసే అవకాశముంది.