అజరుద్దీన్ సమర్పించు.. హైదరాబ్యాడ్ క్రికెట్!

అజరుద్దీన్ సమర్పించు.. హైదరాబ్యాడ్ క్రికెట్!

హైదరాబాద్‌‌, వెలుగుఅటు..

ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో టాప్‌‌ గేర్‌‌లో దూసుకెళ్తోంది..! ఆరు మ్యాచ్‌‌ల్లో ఓటమి ఎరుగని ఆ జట్టు ఎలైట్‌‌ ఎ,బి గ్రూప్‌‌లో నంబర్‌‌ వన్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది..!

ఇటు

హైదరాబాద్‌‌ టీమ్‌‌ ఆఖరు స్థానం కోసం పోటీ పడుతోంది..! ఏడింటిలో ఆరు మ్యాచ్‌‌ల్లో ఓడి 18 జట్ల ఎలైట్‌‌ గ్రూప్‌‌లో చిట్టచివరి ప్లేస్‌‌లో నిలిచింది..!

అటు వైపు

ఆంధ్ర నుంచి హనుమ విహారి ఇండియా టెస్టు జట్టులో రెగ్యులర్‌‌ ప్లేయర్‌‌గా ఉన్నాడు..!  బ్యాకప్‌‌ కీపర్‌‌గా ఇప్పటికే కోహ్లీసేనతో పయనిస్తున్న శ్రీకర్‌‌ భరత్‌‌ తొందర్లోనే నేషనల్‌‌ టీమ్‌‌లోకి రాబోతున్నాడు..! రిక్కీ భుయ్‌‌, డీబీ ప్రశాంత్‌‌, పృథ్వీరాజ్‌‌, నితీష్‌‌ కుమార్‌‌ రెడ్డి వంటి ప్లేయర్లు వివిధ లెవెల్స్‌‌లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు..!

ఇటువైపు

హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ పాలిటిక్స్‌‌తో విసుగెత్తిన అంబటి రాయుడు ఈ సీజన్‌‌ రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు! పేసర్‌‌ సిరాజ్‌‌ నేషనల్‌‌ టీమ్‌‌లో చోటు కోల్పోయాడు!

ఓన్‌‌ టాలెంట్‌‌తో అండర్‌‌-19 వరల్డ్‌‌కప్‌‌కు సెలెక్ట్​అయిన తిలక్‌‌ వర్మను మినహాయిస్తే దుర్బిణీ వేసి చూసినా సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌‌ నుంచి నేషనల్‌‌ టీమ్‌‌ దరిదాపుల్లోకి వచ్చే ఆటగాడు కనిపించడం లేదు!

అన్ని లెవెల్స్‌‌లో ఆంధ్ర జట్టు విజయపథాన నడిచేలా కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్‌‌ అసోసియేషన్ దేశంలో ఆదర్శ క్రికెట్‌‌ సంఘంగా పేరు తెచ్చుకుంటే..  హైదరాబాద్‌‌  క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్​సీఏ) మాత్రం అవినీతిలో పోటీ పడుతోంది..! మాజీ క్రికెటర్‌‌ మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ ప్రెసిడెంట్‌‌ అయిన తర్వాత టాలెంటెడ్‌‌ క్రికెటర్లను పక్కనబెడుతూ.. పైసలున్నోళ్లు.. పైరవీ చేసేటోళ్లనే జట్లకు ఎంపిక చేస్తోందని ఏకంగా సెలెక్టర్లే ఆరోపిస్తున్నారు! దాంతో ఎంతో ఘన చరిత్ర ఉన్న  హెచ్​సీఏ  ఇప్పుడు  హైదరా‘బ్యాడ్‌‌’ అసోసియేషన్​ అనిపించుకుంటోంది..!

గతమెంతో ఘనం. వర్తమానం అగమ్యగోచరం. భవిష్యత్‌‌ ప్రశ్నార్థకం. హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ పరిస్థితి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూడు మాటలు చాలు. ఒకప్పుడు ఎంతో మంది మేటి క్రికెటర్లను దేశానికి అందించి.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్​సీఏ) ఇప్పుడు చెడ్డ పేరు తెచ్చుకోవడంలో పోటీ పడుతోంది. ప్రతిభను పైసలకు తాకట్టు పెడుతున్న హెచ్‌‌సీఏ దేశంలో అత్యంత అవినీతి క్రికెట్‌‌ సంఘంగా ఆరోపణలు ఎదుర్కొటోంది. ఎన్నో అంచనాలతో.. మరెన్నో వాగ్దానాలతో ఇండియా మాజీ కెప్టెన్‌‌ మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఎన్నికైన తర్వాత హెచ్‌‌సీఏ పాలన గాడితప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. అధ్యక్ష పీఠం చేజిక్కించుకునే క్రమంలో ఎలక్షన్స్‌‌ ముందు తన మద్దతుదారులకు అనేక హామీలు ఇచ్చిన అజర్‌‌.. వాటిని నెరవేర్చేందుకు రంజీ సహా ఇతర జట్లను పణంగా పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌‌ టీమ్స్​ సెలెక్షన్స్‌‌లో పైసలు, పైరవీకారుల పిల్లలకే చోటిస్తున్నారని సాక్షాత్తు స్టార్‌‌ క్రికెటర్‌‌ అంబటి రాయుడు ఆరోపించగా.. స్టేట్‌‌ జూనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ సభ్యుడు వివేక్‌‌ జైసింహా ఏకంగా బీసీసీఐ ఎథిక్స్‌‌ అఫీసర్‌‌కు ఫిర్యాదు చేశాడు. అయినా హెచ్‌‌సీఏ వైఖరి మారడం లేదు.

అజర్‌‌ వచ్చాక.. అగాథంలోకి

ఇండియా మాజీ కెప్టెన్‌‌ అజరుద్దీన్‌‌ హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌ అయితే అసోసియేషన్‌‌కు, ఆటగాళ్లకు మంచి జరుగుతుందేమోనని ఫ్యాన్స్‌‌ ఆశించారు. కానీ, పరిస్థితి తలకిందులైంది. గతేడాది సెప్టెంబర్‌‌లో అజర్‌‌ హెచ్‌‌సీఏ పగ్గాలు అందుకున్న తర్వాత అన్ని జట్లూ చెత్తగా ఆడుతున్నాయి. ఈ సీజన్‌‌లో సౌత్‌‌ జోన్‌‌ అండర్-–14 రెండ్రోజుల లీగ్‌‌ టోర్నమెంట్‌‌ దగ్గర నుంచి రంజీ ట్రోఫీ వరకూ మన జట్ల ఆట తీసికట్టుగా మారింది. డొమెస్టిక్‌‌లో అతి పెద్ద టోర్నీ.. టీమిండియాకు అతి దగ్గరి దారిగా భావించే రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌‌ పరిస్థితి ‘చెప్పుకుంటే పరువు పోతది.. చెప్పకుంటే పాణం పోతది’అన్నట్టుగా మారింది. గ్రూప్​లో మన జట్టు చివరి ప్లేస్‌‌ కోసం పోటీ పడుతోంది. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌‌లో మాత్రమే నెగ్గి ఆరింటిలో దారుణంగా ఓడిపోయింది. ఇందులో మూడు ఇన్నింగ్స్‌‌ ఓటములున్నాయి. ఓ రంజీ సీజన్‌‌లో మన జట్టు ఇన్నిసార్లు ఇన్నింగ్స్‌‌ తేడాతో ఓడింది లేదు. బలహీన రాజస్థాన్‌‌తో గత మ్యాచ్‌‌లోనూ విజయం సాధించలేకపోయింది. హైదరాబాద్​కు భిన్నంగా.. ఆంధ్ర టీమ్‌‌ అద్భుతంగా ఆడుతోంది. ఈ సీజన్‌‌లో ఆరు మ్యాచ్‌‌ల్లో నాలుగింటిలో గెలిచి రెండు డ్రా చేసుకుంది. 27 పాయింట్లతో ఎలైట్‌‌ ఎ,బి గ్రూప్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌తో నాకౌట్‌‌ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. కానీ, తన్మయ్‌‌ అగర్వాల్‌‌ కెప్టెన్సీలోని హైదరాబాద్‌‌ ఆరే ఆరు పాయింట్లతో చివరి, 18వ ప్లేస్‌‌లో నిలిచి వచ్చే సీజన్‌‌లో గ్రూప్‌‌-–సీ కి పడిపోయేందుకు రెడీగా ఉంది. చివరి మ్యాచ్‌‌లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ విదర్భతో ఆడనున్న హైదరాబాద్‌‌ అద్భుతం చేస్తే తప్ప ఇందులో గెలిచి గ్రూప్‌‌–-సీకి డిమోషన్‌‌ను తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

అన్నింటా వెనుకే..

రంజీనే కాదు మిగతా టీమ్స్‌‌ పరిస్థితీ అంతే. సీకే నాయుడు ట్రోఫీలో ఆరు మ్యాచ్‌‌లాడిన హైదరాబాద్‌‌ ఒకే విజయంతో 7 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌లో ఉంది. కూచ్‌‌ బెహార్‌‌లో ఎనిమిది మ్యాచ్‌‌లాడితే ఒక్కదానిలో నెగ్గిన హైదరాబాద్‌‌ది గ్రూప్‌‌–-బిలో ఏడో ప్లేస్‌‌. జూనియర్స్‌‌, మహిళా టీమ్స్‌‌ కూడా ఓటముల్లో పోటీ పడుతున్నాయి. అండర్‌‌–23 మహిళల వన్డే టోర్నమెంట్‌‌లో హైదరాబాద్‌‌ వరుసగా మూడు మ్యాచ్‌‌ల్లోనూ ఓడింది. సౌత్‌‌ జోన్‌‌ అండర్‌‌–16 గర్ల్స్‌‌ టోర్నీలో స్టేట్‌‌ టీమ్‌‌ మూడు మ్యాచ్‌‌ల్లో ఓడి ఒక్కటే గెలిచింది.ఈ నెలలోనే మొదలైన సౌత్‌‌జోన్‌‌ అండర్‌‌–14 బాయ్స్‌‌ 2డే టోర్నమెంట్‌‌లో మూడు డ్రాల తర్వాత ఒక్క మ్యాచ్‌‌లోనే గెలిచింది మన జట్టు.  ఓ టోర్నీలోనో.. ఒక్క టీమ్‌‌తోనో ప్రతికూల ఫలితాలు వస్తే అది ఆటగాళ్లు.. జట్టు తప్పు అనుకోవచ్చు. కానీ, ఇలా సీజన్‌‌లో అన్ని జట్లూ మూకుమ్మడిగా విఫలమవుతున్నాయంటే కచ్చితంగా అది పాలకుల వైఫల్యమే అనొచ్చు. దానికి కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ప్రతి జట్టునూ ప్రతిభావంతులను కాదని పైసలిచ్చేవాళ్లు.. పైరవీ చేసేవాళ్లతో నింపేయడంతో ఇలాంటి రిజల్ట్స్‌‌ వస్తున్నాయని హెచ్‌‌సీఏ సభ్యులే చెబుతున్నారు. టీమ్‌‌ సెలెక్షన్స్‌‌లో సెలెక్టర్లను, ఫైనల్‌‌ ఎలెవన్‌‌ ఎంపికలో కెప్టెన్‌‌, కోచ్‌‌లను పట్టించుకోకుండా పలువురు ఆఫీస్‌‌ బేరర్లే అన్ని పాత్రలూ పోషిస్తున్నారని ఆరోపణలున్నాయి.కూచ్‌‌ బెహార్‌‌ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌‌ ప్రదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఒరిజినల్‌‌–15 టీమ్‌‌లో ఉన్న ప్లేయర్‌‌ను కాకుండా స్టాండ్‌‌బైలను ఆడించడం ప్రస్తుత దుస్థితికి నిదర్శనం. ఆటగాళ్లే కాదు కోచింగ్‌‌ సిబ్బంది ఎంపికలోనూ ఇదే వైఖరి. రంజీ టీమ్‌‌ కోచ్‌‌గా అర్జున్‌‌ యాదవ్‌‌ పనికిరాడని అంబటి రాయుడు చెప్పినా ఎవ్వరూ వినలేదు. సెలెక్షన్స్‌‌ను ప్రభావితం చేస్తే అంతిమంగా జట్టు నష్టపోతుందన్న అంబటి ఆవేదన పాలకుల చెవికి ఎక్కలేదు. కానీ, దీని ప్రభావం ఆటపై తీవ్రంగా పడుతోంది. అంబటి రాయుడి లాంటి స్టార్​ క్రికెటర్​ మాటకే విలువలేనప్పుడు తమ పరిస్థితి ఏమిటని  మిగతా ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్​ దెబ్బతిన్నది. రాయుడు మళ్లీ జట్టులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విహారి, డీబీ రవితేజ మాదిరిగా మరికొందరు క్రికెటర్లు కూడా  ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.