మరో రెండు రోజుల్లో కేరళకు నైరుతి

మరో రెండు రోజుల్లో  కేరళకు నైరుతి


హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కేరళలోకి నైరుతి ఎంటరయ్యేందుకు ఇప్పుడిప్పుడే అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. అయితే, మన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు మరింత లేటుగా ఎంటరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల15 నుంచి 20వ తేదీల మధ్య రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంటరయ్యే చాన్స్ ఉందన్నారు. నిరుడు జూన్14న రుతుపవనాలు మన రాష్ట్రంలోకి వచ్చాయి. ఈ సారి10వ తేదీనాటికే రుతుపవనాలు ఎంటరవుతాయని తొలుత అంచనా వేసినా.. పరిస్థితులు అనుకూలించక ఆలస్యం అవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.రుతుపవనాలు వచ్చేదాకా హీట్​వేవ్స్ కొనసాగుతాయని అంటున్నారు. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల తీవ్రత రెండు రోజుల పాటు ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఓవైపు ఎండ.. మరోవైపు వాన

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో బుధవారం 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తంగులలో అత్యధికంగా 45.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ములుగు జిల్లా మేడారంలో 45.5, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యనంబైలు, సూర్యాపేట జిల్లా మునగాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్, కుమ్రంభీం జిల్లా కెరిమెరి, ఖమ్మం జిల్లా బాణాపురం, ములుగు జిల్లా తాడ్వాయి హట్స్, భద్రాద్రి జిల్లా మణుగూరులలో 45.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి, పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్, కుమ్రంభీం జిల్లా జంబుగలో 45 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా మొగలిగిద్దలో 6.9 సెంటీమీటర్ల వర్షం పడింది. వికారాబాద్ జిల్లా బంట్వారంలో 5.1, నల్గొండ జిల్లా నాంపల్లిలో 4.8, వికారాబాద్ జిల్లా ధారూరులో 3.8 సెంటీమీటర్ల వర్షం పడింది. నారాయణపేట, వనపర్తి, సంగారెడ్డి, నాగర్​కర్నూల్, 
మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది.