గంగుల వ్యాఖ్యలు నిజమైతే ఓటు చెల్లదు: నాగిరెడ్డి

గంగుల వ్యాఖ్యలు నిజమైతే ఓటు చెల్లదు: నాగిరెడ్డి

ఓటు వేసిన తర్వాత మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కారు గుర్తుకు ఓటు వేశానని చెప్పారు మంత్రి. కారు గుర్తుకు ఓటేయడం సంతోషంగా ఉందన్నారు. 70 శాతం ప్రజలు కారు గుర్తుకు ఓటు వేస్తున్నారని చెప్పారు.

మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై స్పందించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. మంత్రి వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు. మంత్రి అలా చెబితే అది నేరమే అవుతుందన్నారు. గంగుల కామెంట్స్ నిజమని తేలితే ఆయన ఓటు చెల్లదని చెప్పారు నాగిరెడ్డి. మంత్రిపై క్రిమినల్ చర్యలు ఉంటాయన్నారు నాగిరెడ్డి.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు  రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. రేపు(శనివారం) ఉదయం 8 గంటలకు తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాలీటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు విడుదల చేసేంతవరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. మేయర్ కు పోటీ చేసేవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విప్ ల వివరాలు అధికారులకు తెలియజేయాలని సూచించారు.