మరో దిగ్గజ ఐటీ కంపెనీకి సీఈవోగా మన తెలుగోడు

మరో దిగ్గజ ఐటీ కంపెనీకి సీఈవోగా మన తెలుగోడు

మరో ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీని మనోడు ముందుండి నడిపించబోతున్నాడు. ఇంటర్నేషనల్ కంపెనీ ఐబీఎంకి సీఈవోగా భారత సంతతికి చెందిన అర్వింద్ కృష్ణ (57) సారథ్యం వహించబోతున్నారు. ఆయన తెలుగువారు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆయన స్వస్థలం.

ఇప్పటికే భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ కంపెనీకి, సుందర్ పిఛాయ్ గూగుల్ కంపెనీకి సీఈవోలుగా లీడ్ చేస్తున్నారు. అలాగే మాస్టర్‌ కార్డ్‌ సీఈవోగా అజయ్‌ బంగా, అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ సేవలందిస్తున్నారు. ఇంద్రనూయీ పెప్సీ కంపెనీ సీఈవోగా పని చేసి రిటైర్ అయ్యారు.  ఇప్పుడు తాజాగా ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అర్వింద్ కృష్ణను ఎన్నుకున్నట్లు ఆ కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న గిన్నీ రొమెట్టీ (62) త్వరలో ఆ పదవి నుంచి వైదొలుగుతారు. ఐబీఎంతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉన్న ఆమె రిటైర్మెంట్ తర్వాత.. ఏప్రిల్ 6న ఆమె స్థానంలో అర్వింద్ కృష్ణ బాధ్యతలు చేపడతారు.

కరెక్ట్ లీడర్ అన్న ప్రస్తుత సీఈవో

ఐబీఎం కొత్త సీఈవోగా తనకు అవకాశం రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందన్నారు అర్వింద్ కృష్ణ. తనను ఎన్నుకున్న గిన్నీ రొమెట్టీ, కంపెనీ బోర్డు డైరెక్టర్ల నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. బోర్డు సమావేశం తర్వాత రొమెట్టీ మాట్లాడుతూ అర్వింద్ కృష్ణ బ్రిలియంట్ టెక్నాలజిస్ట్ అన్నారు. ఐబీఎం రాబోయే తరానికి ఆయన సరైన సీఈవో అని ప్రశంసించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహా క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ లాంటి టెక్నాలజీల డెవలప్‌మెంట్‌లో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారామె. ఐబీఎం భవిష్యత్తును బిల్డ్ చేయడంలో ఆయన నాయకత్వం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

1985లో ఇంజనీరింగ్ పూర్తి.. 1990లో ఐబీఎంలోకి

30 ఏళ్ల క్రితం 1990లో ఐబీఎంలో చేరారు అర్వింద్ కృష్ణ. ఆయన ప్రస్తుతం ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఐబీఎం రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌ను ఆయనే లీడ్ చేస్తున్నారు. 1985లో ఐఐటీ కాన్పూర్‌లో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆయన పేరుతో 15 పేటెంట్ రైట్స్ ఉన్నాయి. IEEE ఎడిటర్‌గానూ వ్యవహరించారు.