అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు

తమిళనాడులో అన్నాడీఎంకేలో ఆధిపత్య వివాదం కీలక మలుపుతిరిగింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిసామి పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసేసుకున్నారు .  సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీని తన నియంత్రణలోకి తీసుకున్న కొద్దిసేపటికే ప్రత్యర్థి నేత పన్నీర్‌సెల్వంపై చర్యలు తీసుకున్నారు. పన్నీర్ను కోశాధికారి పదవి నుంచి తొలగించారు. అంతేకాదు పార్టీ  ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు.  పన్నీర్ సెల్వం మద్దతు దారులను కూడా అన్నాడీఎంకే నుంచి తొలగించారు. ఓపీఎస్‌తోపాటు  వైతిలింగం, జేసీడీ ప్రభాకర్, పీహెచ్ మనోజ్ పాండియన్ను బహిష్కరించారు. 

పళని వర్సెస్ పన్నీర్..


అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు కోసం ఈపీఎస్, ఓపీఎస్‌  తలపడ్డారు.  పన్నీర్‌సెల్వంను పక్కనపెట్టి ప్రధాన కార్యదర్శిగా అవతరించాలని ఎడపాడి ఎత్తులు వేశాడు. పన్నీర్‌సెల్వం కూడా తానేమీ తక్కువకాదన్నట్లు ఎత్తులకు పైఎత్తులతో న్యాయపోరాటానికి దిగారు.  జూన్ 23న జరిగిన సర్వసభ్య సమావేశం వేదికగా ఈపీఎస్, ఓపీఎస్‌ మద్దతుదారులు భౌతికదాడులకు పాల్పడ్డారు.  పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా తప్పించమే శ్రేయస్కరమని పళని వర్గం భావించింది. ఈ క్రమంలో సోమవారం మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో  పన్నీర్ సెల్వం..అతని మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన తీర్మానాన్ని  ఆమోదించారు. అధికార డీఎంకేకు పన్నీర్ సెల్వం మద్దతిస్తున్నారని పళని వర్గం ఆరోపించింది. అలాగే.. అధికార పార్టీతో సంబంధాలు పెంచుకుని అన్నాడీఎంకేను బలహీన పరిచే కుట్ర జరుగుతోందని తీర్మానంలో ప్రస్తావించింది. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానించినట్టు పళనిసామి వర్గం తెలిపింది. మరోవైపు సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దుచేసి మళ్లీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకొస్తూ తీర్మానం చేశారు. దీంతో పళనిని తాత్కాలికంగా ఆ పదవిలో నియమించారు. పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శి పదవి కోసం త్వరలోనే ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ చట్టాల ప్రకారం.. ప్రధాన కార్యదర్శి పదవిని కార్యకర్తలు ఎన్నికలు జరిపి ఎన్నుకోవాలి. ఎన్నికలు ప్రకటిస్తే పన్నీర్‌ సెల్వం కూడా ఈ పదవికి పోటీ చేసే అవకాశముంది. దీంతో పన్నీర్‌ను పార్టీ నుంచి తొలగించడమే బెటరని భావించిన పళనివర్గం.. కార్యవర్గ సమావేశంతో తమ పట్టు నిలుపుకుంది. 

జయలలితం మరణంతో పార్టీలో లొల్లి


జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో లొల్లి మొదలైయ్యింది. తమిళనాడులో అధికారంలో ఉన్నంత వరకు బాగానే ఉన్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం.. అధికారానికి దూరం అయ్యాక పార్టీపై పట్టుసాధించాలని ఒకరి మీద ఒకరు పోటీకి దిగారు. గతంలో విభేదాల తర్వాత పన్నీర్ సెల్వం, పళనిసామి రాజీకి వచ్చినా.. కొంత కాలంగా మళ్లీ వార్ నడుస్తోంది. దీంతో పార్టీని టేకోవర్ చేసేందుకు  పళనివర్గం  సర్వసభ్య సమావేశం పెట్టింది.   దీన్ని ఆపాలంటూ పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసింది. దీంతోసర్వసభ్యసమావేశం నిర్వహించిన పళని స్వామి ..  పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు.  

పన్నీర్ ఆగ్రహం..
పార్టీ నిర్ణయంపై పన్నీర్ సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.  కోటిన్నర మంది కార్యకర్తలు తనను అన్నాడీఎంకే కో ఆర్డినేటర్ గా ఎన్నుకున్నారని చెప్పారు. తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు పళనిస్వామికి లేదన్నారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందుకు.. పళనిస్వామినే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు  పన్నీర్ సెల్వం చెప్పారు.  పళనివర్గం నిర్ణయాలపై కోర్టుకెళతానన్నారు. పార్టీ శ్రేణులు ఏక నాయకత్వాన్నే కోరుకుంటే అందుకు తానే అర్హుడినని గతంలోనే  పన్నీర్‌సెల్వం చెప్పారు.  వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏక నాయకత్వం అవసరం లేదన్నారు. పార్టీ చీలిపోకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తన అంగీకారం లేనిదే పార్టీ సమావేశాల్లో చేసే ఎలాంటి తీర్మానం చెల్లదని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. అదే జరిగితే చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని హెచ్చరించారు. 

శశికళ ఎంట్రీ..


 అన్నాడీఎంకేపై పట్టు కోసం పళనిసామి, పన్నీర్ సెల్వం మధ్య ఓ వైపు వార్ నడుస్తోంటే.. తాను కూడా ఉన్నానని శశికళ  అంటున్నారు.  ఎంజీఆర్, జ‌య‌ల‌లిత మాదిరిగానే తాను పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు. చెప్పిందే చేసేవారు త‌మిళ‌నాడుకు కావాలి శశికళ అన్నారు.  గ‌తంలో ఒక‌లా ఇప్పుడు మ‌రోలా మాట్లాడేవారు కాకుండా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారు త‌మిళ‌నాడుకు కావాల‌టున్నారు. తాను ఇప్పటికీ పార్టీ ప్రధాన‌ కార్యద‌ర్శినేన‌ని, స‌రైన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పార్టీ ప్రధాన కార్యాల‌యానికి వెళ్తాన‌ని ఆమె చెబుతున్నారు. 

అన్నాడీఎంకే స్థాపించిన ఎంజీ రామచంద్రన్‌ ఆ పార్టీ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మరణం తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన జయలలిత.. ఎంజీఆర్‌ గౌరవార్థం అధ్యక్ష పదవిని అలాగే ఉంచి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జయ మరణం తరువాత పళనిసామి, పన్నీర్ సెల్వం మధ్య పోటీ పెరిగింది. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌గా పళనిస్వామి పార్టీ బాధ్యతలను సమానంగా పంచుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిన తరువాత పార్టీలో ఏక నాయకత్వం నినాదం తెరపైకి వచ్చింది. 

కార్యవర్గ భేటీతో పార్టీ చీఫ్గా తాను బాధ్యతలు తీసుకున్నారు పళనిసామి. మరోవైపు తానే అర్హుడినని పన్నీర్ సెల్వం చెప్పుకుంటున్నారు. కోర్టుకు కూడా వెళ్తానని అంటున్నారు. మరోవైపు.. జయలలితకు సన్నిహితురాలైన శశికళ కూడా.. తానే పార్టీకి ప్రధానకార్యదర్శినని చెప్పుకుంటున్నారు. దీంతో తమిళనాట అన్నాడీఎంకే పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.