రాజకుటుంబంలో..  ఆస్తి పంపకాల లొల్లి

రాజకుటుంబంలో..  ఆస్తి పంపకాల లొల్లి

ఆస్తుల విషయంలో మోసం చేసి.. దస్కత్ పెట్టించుకున్రు
రాజు జడేజాపై కోర్టుకెక్కిన సోదరి అంబాలికా దేవి

రాజ్​కోట్:గుజరాత్​లోని రాజ్​కోట్ రాజ కుటుం బంలో పూర్వీకుల ఆస్తులపై లొల్లి మొదలైంది. రాజ్​కోట్17వ రాజు(ఠాకూర్ సాహెబ్), హెరిటేజ్ హోటల్స్ అధినేత మాంధాతా సిన్హ్ జడేజా మోసపూరితంగా తనతో డాక్యుమెంట్లపై సంతకం చేయించుకున్నారంటూ ఆయన సోదరి అంబాలికా దేవి బుధవారం కోర్టుకెక్కారు. తమ పూర్వీకులకు చెందిన రూ. వందల కోట్ల ఆస్తులపై తనను తప్పుదోవ పట్టించి, రిలీజ్ డీడ్​పై సంతకం చేయించుకున్నారంటూ సివిల్ కోర్టులో కేసు వేశారు. అంబాలికా దేవి తండ్రి, గుజరాత్ మాజీ మంత్రి మనోహర్ సిన్హ్ జడేజా రాసిన విల్లు రిజిస్టర్ కాలేదంటూ, దానిని కూడా సవాల్ చేసినట్లు ఆమె లాయర్ తెలిపారు.  
ఇదీ వివాదం..
నాలుగు వందల ఏండ్ల నాటి రాజ్​కోట్ సంస్థానానికి వారసత్వంగా మాంధాతా సిన్హ్ నిరుడు17వ రాజుగా నియమితులయ్యారు. అయితే యూపీలోని ఝాన్సి సిటీలో నివసిస్తున్న తాను రెండేండ్ల కిందట తమ తండ్రి చనిపోవడంతో రాజ్​కోట్​కు వెళ్లానని, ఈ సందర్భంగా ఓ పురాతన ఆలయానికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటూ తనతో సంతకం చేయించుకున్నారని అంబాలికా దేవి ఆరోపిస్తున్నారు. తన తండ్రి 2013లో రాసిన విల్లు రిజిస్టర్ కాలేదని, దానిని తన సోదరుడు మార్చేందుకు కూడా ప్రయత్నించారని తెలిపారు. ఆస్తులతో తనకు సంబంధం లేదంటూ రాయించుకున్న రిలీజ్ డీడ్​ను రద్దు చేయాలని కోరారు. అయితే రూ. 1.5 కోట్లు తీసుకున్న తర్వాతే అంబాలికా దేవి రిలీజ్ డీడ్​పై సంతకం చేశారని, ఆమెకు ఆస్తులపై ఎలాంటి హక్కు లేదని మాంధాతా సిన్హ్ లాయర్ వాదించారు. కేసులో తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది.