ఈ వారంలో కరోనా కేసులు భారీగా పెరుగుతయ్

ఈ వారంలో కరోనా కేసులు భారీగా పెరుగుతయ్

లండన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో మన దేశంలో ఈ వారంలోనే కరోనా కేసులు భారీగా పెరుగుతాయని బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్​ కేంబ్రిడ్జి ప్రొఫెసర్ పాల్ కటుమాన్ వెల్లడించారు. కేంబ్రిడ్జిలోని జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్, కొవిడ్ 19 ఇండియా ట్రాకర్ ను అభివృద్ధి చేసిన టీంలో ఒకరైన పాల్.. ఇటీవల మన దేశంలో కరోనా పరిస్థితిపై నోట్ ను విడుదల చేశారు. ‘‘సుమారు 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఒమిక్రాన్ కారణంగా ఈ వారం రోజుల్లోనే కేసులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, కొద్దిరోజుల్లోనే తిరిగి కేసులు తగ్గుముఖం పట్టొచ్చు” అని ఆయన పేర్కొన్నారు. డైలీ కేసులు ఎంత హైలెవల్ కు చేరుతాయన్నది మాత్రం అంచనా వేయలేమన్నారు. మొదట 6 రాష్ట్రాల్లోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని అంచనా వేసిన తాము.. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరగొచ్చని అంచనాలను సవరించామని ఆయన తెలిపారు. కాగా, మే నెలలో సెకండ్ వేవ్ సమయంలో మన దేశంలో కరోనా పీక్ స్టేజీని కొవిడ్ 19 ఇండియా ట్రాకర్ ద్వారా పాల్ కటుమాన్ టీమ్ వేసిన అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. టీకాలు తగినన్ని వేసేంత వరకూ దేశంలో వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంటుందని గత ఆగస్టులోనూ వీళ్లు అంచనా వేశారు. దేశంలో అక్టోబర్ నెలలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆ తర్వాతే డైలీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.