బ్రహ్మోస్​ మిస్సైల్స్​ కోసం ఫిలిప్పీన్స్​ ఒప్పందం

బ్రహ్మోస్​ మిస్సైల్స్​ కోసం ఫిలిప్పీన్స్​ ఒప్పందం
  •     374 మిలియన్​ డాలర్లతో కుదిరిన ఒప్పందం
  •     రక్షణ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతుల  స్థాయికి ఇండియా

న్యూఢిల్లీ: మన బ్రహ్మోస్​ మిస్సైల్స్​ను కొనుగోలు చేసేందుకు మొదటి ఆర్డర్​ వచ్చింది. తమకు యాంటీ షిప్​ బ్రహ్మోస్​ మిస్సైల్​కావాలని ఇండియాతో ఫిలిప్పీన్స్​ ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ఫిలిప్పీన్స్​లో ఇండియా అంబాసిడర్ శంభుకుమారన్​ సమక్షంలో ఈ ఎంవోయూ కుదిరింది. దీనిపై అక్కడి డిఫెన్స్​ మినిస్ట్రీ ప్రతినిధులు, మన డీఆర్డీవో ప్రతినిధులు సంతకాలు చేశారు. ఒప్పందం విలువ 374 మిలియన్​ డాలర్లు (సుమారు రూ. 2,800 కోట్లు). రష్యా, ఇండియా కలిసి బ్రహ్మోస్​ ఎయిరోస్పేస్​ప్రైవేట్​ లిమిటెడ్​ (బీఏపీఎల్​)లో తయారు చేస్తున్న ఈ మిస్సైల్స్​ సూపర్​ సోనిక్​ స్పీడ్​తో  దూసుకుపోయి లక్ష్యాలను ఛేదించగలవు. సబ్​మెరైన్స్, షిప్స్​, విమానాలు, భూమి పైనుంచి వీటిని ప్రయోగించవచ్చు. రక్షణ రంగానికి అవసరమైన మిసైల్స్​ను, ఇతర సామాగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇండియా ఇప్పుడు  ఈ ఒప్పందం ద్వారా వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అయితే.. ఫిలిప్పీన్స్​ ఎన్ని మిస్సైల్స్​ కోసం ఆర్డర్​ ఇచ్చిందనేది బయటకు రాలేదు. బాధ్యతాయుతమైన ఎగుమతులను ప్రోత్సహించే ఇండియా పాలసీలో ఈ ఒప్పందం ఓ ముందడుగు అని, ఫిలిప్పీన్స్​తో సంబంధాలు మరింత బలపడుతాయని మన డిఫెన్స్​ మినిస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది.

చైనా ఆగడాలను అరికట్టేందుకే..!

చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే మన దేశం లడఖ్​, అరుణాచల్​ సరిహద్దు ప్రాంతాల్లో పలు బ్రహ్మోస్​ మిసైల్స్​ను మోహరించింది. శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా దీటుగా ఎదుర్కొనేందుకు వీటిని అక్కడ ఉంచింది. ఫిలిప్పీన్స్​కు కూడా చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో..  బ్రహ్మోస్​ బ్రహ్మాస్తంగా ఉపయోగపడుతుందని ఆ దేశం ఒప్పందం చేసుకుంది. మనం తయారు చేస్తున్న డిఫెన్స్​ ఆయుధాలు, మిస్సైల్స్​కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్​ పెరుగుతున్నదని డీఆర్డీవో చైర్మన్​ జి.సతీశ్​రెడ్డి అన్నారు. సర్​ఫేస్​ టు ఎయిర్​ మిసైల్​ ఆకాశ్​, అస్త్ర, యాంటి ట్యాంక్​ మిసైల్స్​, రాడార్స్​, టోర్పెడోస్​ వంటి వాటికి ఆర్డర్​ ఇచ్చేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని వివరించారు.