విక్టరీపై కన్నేసిన కోహ్లీసేన..కివీస్ తో నాలుగో టీ20కి సర్వం సిద్ధం

విక్టరీపై కన్నేసిన కోహ్లీసేన..కివీస్ తో నాలుగో టీ20కి సర్వం సిద్ధం

వెల్లింగ్టన్‌‌ : మహ్మద్‌‌ షమీ, రోహిత్‌‌శర్మ ఇచ్చిన షాక్‌‌ నుంచి తేరుకోకముందే టీమిండియాతో మరో పోరుకు న్యూజిలాండ్‌‌ రెడీ అయ్యింది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇండియా, కివీస్‌‌ మధ్య నాలుగో టీ20 ఇక్కడి వెస్ట్‌‌పాక్‌‌ స్టేడియంలో శుక్రవారం జరగనుంది. హ్యాట్రిక్‌‌ విజయాలతో సిరీస్‌‌ను ఇప్పటికే ఖాతాలో వేసుకున్న కోహ్లీసేన మరో విక్టరీపై కన్నేసింది. అయితే ఆస్ట్రేలియాలో జరగబోయే వరల్డ్‌‌ టీ20 నేపథ్యంలో రిజర్వ్‌‌ బెంచ్‌‌ను టెస్ట్‌‌ చేసుకోవాలని చూస్తోంది. అలాగని జట్టు బ్యాలెన్స్‌‌ను దెబ్బతీసే ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వచ్చే చాన్సుంది. సిరీస్‌‌ గెలిచేశాం కాబట్టి ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో మార్పులుంటాయని కెప్టెన్‌‌ కోహ్లీ బుధవారమే  హింట్‌‌ ఇచ్చేశాడు. దీంతో సంజు శాంసన్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ ఫైనల్‌‌ ఎలెవెన్‌‌ రేస్‌‌లోకి వచ్చారు. శాంసన్‌‌కు చాన్సులివ్వాలని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మరో పక్క రాహుల్‌‌ కీపింగ్‌‌లో రాణిస్తుండడంతో.. పంత్​ను ఆడించాలంటే ఎవరికి విశ్రాంతినిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.మనీశ్‌‌ పాండే, శివమ్‌‌ దూబేకు ఇప్పటిదాకా పూర్తిస్థాయి అవకాశం దొరకలేదు. దీంతో వాళ్లిద్దరినీ కొనసాగించవచ్చు. అయితే రోహిత్, రాహుల్‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌ అయ్యర్‌‌లో ఎవరో ఒకరు తమ ప్లేస్‌‌ త్యాగం చేస్తేనే బ్యాట్స్‌‌మెన్‌‌ కోటాలో వేరే వాళ్లకు చాన్స్‌‌ దొరుకుతుంది. ఓ మ్యాచ్‌‌కు రోహిత్‌‌, మరో టీ20కి కోహ్లీ దూరంగా ఉంటే రిజర్వ్‌‌ బెంచ్‌‌ను పరీక్షించుకోవచ్చు. బౌలింగ్‌‌లో  సుందర్‌‌, కుల్దీప్‌‌, సైనీ చాన్స్‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. మహ్మద్‌‌ షమీ ప్లేస్‌‌లో  నవ్‌‌దీప్‌‌ సైనీ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. చహల్‌‌, జడేజాలో ఒకరు సుందర్‌‌ లేదా కుల్దీప్‌‌ కోసం తమ ప్లేస్‌‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. గత మ్యాచ్​లో ఎక్కువ రన్స్​ ఇచ్చిన బుమ్రా ఎలా పెర్ఫామ్‌‌ చేస్తాడో చూడాలి.కివీస్​ ఒక్క మార్పుతో !

ఇప్పటికే సిరీస్​ కోల్పోయిన కివీస్​ ఈ మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని భావిస్తోంది. ఆ జట్టు ఒకే ఒక్క మార్పుతో ఈ మ్యాచ్‌‌ బరిలోకి దిగనుంది. ఫామ్‌‌ కోసం తంటాలు పడుతున్న గ్రాండ్‌‌హోమ్‌‌ స్థానంలో డారెల్‌‌ మిచెల్‌‌ జట్టులోకి రానున్నాడు. అయితే బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో ప్రయోగాలు చేసే చాన్స్‌‌ కనిపిస్తుంది. గప్టిల్‌‌తో కలిసి కెప్టెన్‌‌ కేన్‌‌  ఓపెనర్‌‌గా వచ్చే చాన్స్‌‌ ఉంది. ఇక, వెల్లింగ్టన్‌‌లో అదిరిపోయే రికార్డు ఉన్న శాంట్నర్‌‌ రాణించాలని  ఆ జట్టు కోరుకుంటుంది.