రాహుల్ పాదయాత్ర..తుఫాన్ వచ్చినా నో ప్రాబ్లం

రాహుల్ పాదయాత్ర..తుఫాన్ వచ్చినా నో ప్రాబ్లం

దేశంలో ప్రస్తుతం పొలిటికల్ లీడర్ల పాదయాత్రలు కామన్ అయ్యాయి. చిన్న చిన్న లీడర్లు కూడా పాదయాత్రలు ప్లాన్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఏమో కాని.. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు వెరీ స్పెషల్. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర మొదలు పెట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 5 నెలల పాటు.. 12 రాష్ట్రాల మీదుగా.. 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్రకు రాహుల్ బయలుదేరారు. 

మొత్తం 230 మంది దాకా..

యాత్ర ముగిసే వరకు రాహుల్ తో పాటు నడిచే భారత్ యాత్రీలు 119 మంది, అతిథి యాత్రీలు కలిపి మొత్తం 230 మంది దాకా ఉన్నారు. రాహుల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్షన్ వాళ్లు, వీళ్లతో పాటు యాత్ర ఏర్పాట్లు చూసేవాళ్లు.. కొన్ని వందల మంది యాత్రలో ఉంటారు. వీళ్లందరి బస కోసం ప్రత్యేకంగా 60 కంటైనర్లు ఏర్పాటు చేశారు. ట్రక్కులపై కంటైనర్లు ఈ యాత్రలో స్పెషల్.

ముందే ఓ టీం వెళ్లి..

పాదయాత్రకు ఏర్పాట్లు చేయాలంటే పెద్ద టాస్క్. పాదయాత్ర రూట్‌లో ముందే ఓ టీం వెళ్లి, అనువైన స్థలం వెతుకుతుంది. ఖాళీ ప్లేసులో అప్పటికప్పుడు పెద్ద పెద్ద టెంట్లు, డేరాలు వేసి అప్పటికప్పుడు నిర్మాణాలు చేస్తుంది. మళ్లీ తెల్లారగానే అవన్నీ సర్దేసి , మరో ప్లేసుకు షిప్ట్ చేస్తుంది. భారీ వర్షాలు, గాలిదుమారాలకు టెంట్లు ఉండవు. వాటర్ ప్రూఫ్ డేరాలు వేసినా వానతో తిప్పలు తప్పవు. కానీ రాహుల్ యాత్రలో ట్రక్కులపై కంటైనర్లు వెరీ ఇంట్రెస్టింగ్. తుఫాన్ వచ్చినా వాటికి నో ప్రాబ్లం.

60 కంటైనర్లంటే అరవై ఇళ్లు ఉన్నట్టే..

రాహుల్ యాత్రలో ట్రక్కులన్నీ..అనువైన చోట నిలపొచ్చు. 60 కంటైనర్లంటే అరవై ఇళ్లు ఉన్నట్టే. అంటే చిన్న పాటి ఊరే. పాదయాత్ర ముగిసే ప్రాంతానికి రోజూ కంటైనర్లు చేరుకుంటాయి. వీటిలో బెడ్స్, వాష్‌రూమ్స్, టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. కొన్నింటిలో ఏసీలు, మరికొన్నింటిలో ఫ్యాన్లు పెట్టారు. సింగిల్ బెడ్‌, డబుల్ బెడ్స్‌, 4, 6, 8, 12 బెడ్స్ ఉన్న కంటైనర్లు ఉన్నాయి. కంటైనర్లను పార్కింగ్ చేసిన దగ్గర్లోనే డైనింగ్ హాల్ కోసం టెంట్ వేస్తారు. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లు ఉంటాయి. 

రెడ్, ఆరెంజ్ కలర్ కంటైనర్లల్లో.. 

ఎల్లో కలర్‌ కంటైనర్ లో సింగిల్ బెడ్ ఉంటుంది. బ్లూ కలర్‌ కంటైనర్లల్లో వాష్‌రూమ్‌తో పాటు రెండు బెడ్స్ ఉంటాయి. రెడ్, ఆరెంజ్ కలర్ కంటైనర్లల్లో 4,6,8, 12 బెడ్స్ ఉంటాయి. మహిళా యాత్రికుల కోసం అటాచ్డ్ బాత్‌రూమ్స్ తో పింక్ కంటైనర్లు ఏర్పాటు చేశారు.  కొన్ని కంటైనర్లల్లో బాత్రూమ్స్ అటాచ్ చేశారు. మరికొన్ని కంటైనర్లలో మొబైల్ టాయిలెట్లు, షవర్లు కూడా పెట్టారు. 10 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్ కంటైనర్ కూడా ఏర్పాటు చేశారు. వంట, ఇతర పనులు చేసే హౌజ్ కీపింగ్ సిబ్బంది కోసం రెడ్, ఆరెంజ్ జోన్ కంటైనర్లు ఉన్నయ్. వీళ్ల కోసం  కొన్ని కంటైనర్లను కామన్ వాష్‌రూమ్స్‌గా మార్చారు. ఏ కంటైనర్లలోనూ టీవీ ఏర్పాటు లేదు. 

స్థాయిని బట్టి ఏ కంటైనర్ లో.. ఎవరు ఉండాలనేది డిసైడ్

ప్రతి కంటైనర్‌‌కూ కోడ్ ఉంటుంది. కంటైనర్లకు నంబర్లు కూడా ఇచ్చారు. కంటైనర్లల్లో సదుపాయాల్ని బట్టి జోన్లు ఏర్పాటు చేశారు. స్థాయిని బట్టి ఏ కంటైనర్ లో ఎవరుండాలనేది డిసైడ్ చేశారు.  నంబర్ వన్  కంటైనర్ రాహుల్ ప్రత్యేకం. దీన్ని ఎల్లో జోన్‌లో పార్కింగ్ చేస్తారు. దీంట్లో  చిన్న చిన్న సోఫాలు, ఎయిర్ కండీషనర్, చిన్న ఫ్రిజ్, ఒక అటాచ్డ్ టాయిలెట్ ఉన్నాయి. రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది నంబర్ 2 కంటైనర్‌ లో ఉంటారు. యాత్ర వ్యవహారాలన్నీ పర్యవేక్షించే పార్టీ ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్,  కార్యదర్శి వంశీచంద్ కంటైనర్ నంబర్ 3లో ఉంటారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది అలంకార్ సవాయ్, కేబీ బైజుకు కంటైనర్ నంబర్ 4 అలాట్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ బ్లూ జోన్‌లోని కంటైనర్ నెం 5లో ఉంటారు.

కంటైనర్లలో తినొద్దు..

ఎవరైనా సరే కంటైనర్లలో తినొద్దు, బయట ఫుడ్ తీసుకురావద్దు. కామన్ ఏరియాలో, అక్కడ వండిపెట్టింది తినాలి. మద్యసేవనం నిషిద్ధం. ఇక వ్యక్తిగత వస్తువులు,బంగారం,నగదు వంటి విలువైన వస్తువులు పోతే పాదయాత్ర ఆర్గనైజర్స్‌ కానీ కాంగ్రెస్‌ పార్టీ కానీ బాధ్యత వహించదని రాహుల్‌ పాదయాత్ర రూల్స్‌ బుక్‌ చెబుతోంది.  ప్రతి రోజూ ఉదయమే రాహుల్ పాదయాత్రకు బయల్దేరిన తర్వాత ఈ కంటైనర్లను క్లీన్ చేస్తారు. తర్వాత డెస్టినేషన్ కు కంటైనర్లు బయల్దేరతాయి.