ఆ పాపాయిని ఐపీఎస్ చేస్త

ఆ పాపాయిని ఐపీఎస్ చేస్త

పేరెంట్స్​ను కోల్పోయిన ఆ చిన్నారి బాధ్యత నాదే: కాన్పూర్ ఐజీ అగర్వాల్

లక్నో: 23 మంది పిల్లలను బందీగా చేసుకుని, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన సుభాష్ బాథమ్ కూతురి బాధ్యత తాను తీసుకుంటానని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెప్పారు. ఉత్తరప్రదేశ్​లోని ఫరూఖాబాద్ జిల్లా కసారియా గ్రామానికి చెందిన ఆ పాపకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటానని తెలిపారు. సోమవారం పీటీఐతో ఆయన ఫోన్​లో మాట్లాడారు. ‘‘ఆ చిన్నారిని నాలాగా ఐపీఎస్ చేయాలని అనుకుంటున్నా. తన పేరుతో ఒక అకౌంట్​ను ఓపెన్ చేస్తున్నా. అందులో డబ్బులు డిపాజిట్ చేస్తా. ఇక తన చదువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని వివరించారు. ‘‘ప్రస్తుతం ఆ పాప ఫరూఖాబాద్​లో ఓ మహిళా ఉద్యోగి దగ్గర ఉంది. చిన్నారిని ఆమె చాలా బాగా చూసుకుంటోంది” అని చెప్పారు. ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటామని, సాయం చేస్తామని చాలా మంది చెబుతున్నారని పేర్కొన్నారు. ‘‘పాపను ఎవరైనా దత్తత తీసుకుంటే.. పెంపకాన్ని నేను పర్సనల్​గా మానిటర్ చేస్తాను. ఆమెకు భవిష్యత్​లో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటా” అని చెప్పారు. పోలీస్ డిపార్ట్​మెంట్​లోనే ఎవరైనా కపుల్స్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని, అలా అయితే పాప గురించి తెలుసుకునేందుకు ఈజీగా ఉంటుందని అన్నారు.

పాప తల్లిదండ్రులు ఎలా చనిపోయారంటే?

గత గురువారం మధ్యాహ్నం తన కూతురి పుట్టినరోజు అని చెప్పి కసారియా గ్రామంలోని పిల్లలను సుభాష్ బాథమ్ తన ఇంటికి పార్టీకి పిలిచాడు. 23 మంది చిన్నారులు ఇంటికి రాగానే వాళ్లందరినీ బందీలుగా చేసుకున్నాడు. మాట్లాడేందుకు వచ్చిన పోలీసులు, గ్రామస్తులపై కాల్పులు జరిపాడు. బాంబులతో ఇంటిని పేల్చేస్తానని బెదిరించాడు. తనపై ఉన్న కేసులను విత్ డ్రా చేసుకోవాలని, పిల్లల్ని వదిలిపెట్టాలంటే ఒక్కొక్కరికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. కోపంలో గ్రామస్తులు చేసిన దాడిలో అతడి భార్య రుబీ కతారియా కూడా చనిపోయింది. దీంతో ఏడాది వయసున్న అమ్మాయి అనాథగా
మారింది.

ఐజీ అగర్వాలే ఎందుకు?

బందీలుగా ఉన్న 23 మంది పిల్లలను విడిపించడంలో ఐజీ మోహిత్ అగర్వాల్​దే కీలకపాత్ర. పిల్లలకు ఎలాంటి హానీ జరగకుండా ఆయన రెస్క్యూ ఆపరేషన్​ను నిర్వహించారు. ఓ వైపు నిందితుడు సుభాష్​తో మాట్లాడుతూ, మరోవైపు ప్లాన్ రూపొందించి చిన్నారులను కాపాడారు.

మరన్ని వార్తల కోసం..