భారత సైనికులకు త్వరలో జెట్​ సూట్స్

భారత సైనికులకు త్వరలో జెట్​ సూట్స్
  • గంటకు 50 కి.మీ స్పీడ్​తో గాల్లో దూసుకుపోవచ్చు 
  • 15 మీటర్ల ఎత్తు ఎగిరి.. 8 నిమిషాలు గాల్లోనే ఉండొచ్చు
  • సూట్​లో 5 గ్యాస్​ టర్బైన్​ జెట్ ఇంజిన్లు
  • గ్యాస్​, డీజిల్​, కిరోసిన్​లలో దేనితోనైనా నడిచేలా తయారీ
  • 48  సూట్స్​కొనుగోలుకు రక్షణ శాఖ రెడీ

హీ మ్యాన్.. సూపర్​ మ్యాన్​లా భారత సైనికులు గాల్లో చక్కర్లు కొట్టే రోజులు ఎంతోదూరంలో లేవు. ఇందుకోసం రక్షణ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  ఫాస్ట్​ ట్రాక్​ ప్రాతిపదికన మన సైనికులకు జెట్​ ప్యాక్​ సూట్స్​ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తొలివిడతగా 48 జెట్​సూట్స్​కు ఆర్డర్స్​ ఇచ్చేందుకు సిద్ధమైంది. జెట్​ సూట్స్​ను తయారుచేసి, ఆర్మీకి సప్లై చేసేందుకు ఆసక్తి కలిగిన భారత కంపెనీలు ఈ నెల 14లోగా బిడ్స్​ను దాఖలు  చేయొచ్చంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.  ఈనేపథ్యంలో జెట్​ సూట్స్​కు సంబంధించిన ఇంట్రెస్టింగ్​ విశేషాలను తెలుసుకుందాం..

మన సైనికులకు ఇవ్వబోతున్న జెట్​ సూట్స్ ఎలా ఉంటాయి ? ఎలా పనిచేస్తాయి ?  వాటిని ధరించి ఎలా ఎగురుతారు ?  ధర ఎంత ?   అనే అంశాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ జెట్​ సూట్​లో 5 గ్యాస్​ టర్బైన్ జెట్​ ఇంజిన్లు​అమర్చి ఉంటాయి. వీటిని గ్యాస్​, డీజిల్​, కిరోసిన్​ లలో వేటితోనైనా నడపొచ్చు. ఈ 5 ఇంజిన్లు కలిసి 1000 హార్స్​ పవర్​ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తిని వినియోగించుకొని జెట్​ సూట్​నేల నుంచి నింగి వైపు దూసుకెళ్తుంది. దీనిలో 10 నుంచి 15 మీటర్ల ఎత్తుకు ఎగిరి..  గాల్లోనే  దాదాపు 8 నిమిషాల పాటు ఉండొచ్చు. ఆ తర్వాత ల్యాండింగ్​ కావాల్సి ఉంటుంది. గాల్లో ఎగిరే క్రమంలో సూట్​లో ఉన్న చేతులను కదపడం ద్వారా ఎటువైపు వెళ్లాలనే డైరెక్షన్​ను ఇవ్వొచ్చు. దాని ఆధారంగా సూట్​ ధరించిన వాళ్లు చూపించిన వైపే ప్రయాణం సాగుతుంది.   గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఇలా జర్నీ చేయొచ్చు. 3000 మీటర్ల  ఎత్తున్న ప్రదేశాల్లోనూ ఈ జెట్​ సూట్స్​ ధరించి ధైర్యంగా ఎగరొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని తొలుత సియాచిన్​ గ్లేసియర్​ వంటి అత్యంత ఎత్తైన సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న సైనికులకు అందించాలని రక్షణశాఖ భావిస్తోందట. 

ఎగురుతూ ఫైరింగ్ చేసేలా ఛేంజెస్​ ?

అయితే ఎగిరేటప్పుడు చేతులు ఈ సూట్​ లోపలే ఉండిపోతాయి.  అత్యవసర సందర్భాల్లో సూట్​ నుంచి చేతులను బయటకు తీసి..  గన్​ తో ఫైరింగ్​ జరిపే వెసులుబాటు కల్పించేలా అందులో మార్పులు చేయాలని తయారీ కంపెనీలను రక్షణశాఖ కోరే అవకాశం ఉంది.  ఒక్కో సూట్​ ధర రూ.4 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  జెట్​ సూట్​ బరువు 40 కేజీలకు మించి ఉండకపోవచ్చని..  80 కేజీల బరువున్న వ్యక్తి కూడా కంఫర్టబుల్​గా ఎగిరేలా ఉంటుందని అంటున్నారు. ఈ సూట్ నలుపు రంగులో ఉండొచ్చని.. దీంతోపాటు ఒక అట్రాక్టివ్​ అండ్​ సేఫ్​ హెల్మెట్ ను​ కూడా ధరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ జెట్​ ప్యాక్​ సూట్​ లను కొనగానే ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాలో ఉన్న రక్షణ శాఖకు చెందిన  సెంట్రల్​ ఆర్డినెన్స్​ డిపోకు అందించనున్నట్లు తెలుస్తోంది. దేశ సరిహద్దులు, నదులు, లోయలు, కొండలు, పర్వతాలు, ఎడారులు, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో  సహాయక చర్యలు, సెర్చ్​ ఆపరేషన్స్​, నిఘా, సైనిక అవసరాల కోసం జెట్​ సూట్స్​ను వాడాలని భావిస్తున్నారు. కనిష్టంగా మైనస్​ -150 డిగ్రీల సెల్సీయస్​ నుంచి మైనస్​ -100 డిగ్రీల సెల్సీయస్​ చల్లటి వాతావరణంలో .. గరిష్టంగా 400 డిగ్రీల సెల్సీయస్​ నుంచి 
450 డిగ్రీల సెల్సీయస్​ ఎండల్లోనూ ఈ సూట్స్​ బాగా పనిచేస్తాయి.  విమానాన్ని నడిపే శిక్షణ పూర్తి చేసుకోవడానికి కనీసం ఏడాది టైం పడుతుంది. అయితే జెట్​ సూట్​ ధరించి ఎలా ఎగరాలో నేర్చుకునేందుకు ఒక్క రోజు చాలట. ఫాస్ట్​గా ఉండేవాళ్లయితే కొన్ని గంటల్లోనే నేర్చుకోగలుగుతారని చెబుతున్నారు. 


బ్రిటన్​, అమెరికా నేవీ వద్ద జెట్ సూట్స్​.. 

ఇప్పటికే బ్రిటన్, అమెరికా నౌకాదళ సిబ్బంది జెట్ సూట్స్​ను అత్యవసర పరిస్థితుల్లో  వినియోగిస్తున్నారు. ​  ప్రస్తుతం ఈ సూట్స్​తయారీలో వరల్డ్​ ఫేమస్​ కంపెనీ ‘గ్రావిటీ ఇండస్ట్రీస్​’. బ్రిటన్​ కు చెందిన అథ్లెట్​ రిచర్డ్​ బ్రౌనింగ్​ ఈకంపెనీని నెలకొల్పారు. ఆయన 2016లో  ఒక జెట్​ సూట్​ను తయారు చేశారు. దాని పేరు ‘డెడాలస్​ ఫ్లైట్​ ప్యాక్​’.  గ్రీకు పురాణాల్లో ‘డెడాలస్’ అనే పాత్ర ఉంటుంది.  ఆ పాత్రను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే జెట్​సూట్​కు ఆ పేరు పెట్టారు. ఈ కంపెనీ చాలా దేశాల సైన్యాలకు 
జెట్​ సూట్స్​ను  సప్లై చేస్తోంది. 


సూట్స్​ తయారీ కంపెనీకి  షరతులివీ..   

  • జెట్​ సూట్స్​ తయారు చేసి, ఆర్మీకి సప్లై చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీల ఎంపిక కోసం రక్షణ శాఖ పలు 
  • నిబంధనలు పెట్టింది. వాటన్నింటి ఫాలో అయ్యే కంపెనీకే బిడ్స్​ కేటాయించనున్నారు. 
  • ఫస్ట్​ ప్రయారిటీ ఇండియా కంపెనీలకే ఇవ్వనున్నారు.  
  • ఒరిజినల్​ ఎక్విప్మెంట్​ తయారీదారులు, ఆథరైజ్డ్​ వెండర్లు, గవర్నమెంట్​ స్పాన్పర్​ చేస్తున్న ఎక్స్​ పోర్ట్​ ఏజెన్సీలు మాత్రమే ఇందుకు బిడ్స్​ సబ్మిట్​ చేయాలి. 
  • జెట్​ సూట్స్​ తయారీ కోసం వాడే పరికరాల్లో, మెటీరియల్​ లో 60 శాతం మేడ్​ ఇన్​ ఇండియావే వాడాలనే నిబంధన కూడా ఉంది. 
  • జెట్​ సూట్స్​ తయారు చేసే కంపెనీ.. వాటిని మూడేళ్ల వారంటీపై సప్లై చేయాల్సి ఉంటుంది. 
  • జెట్​ సూట్స్​కు కనీసం పదేండ్లు సర్వీసింగ్​ఇవ్వాలి.  
  • సూట్స్​ వినియోగంపై సైనికులకు ట్రైనింగ్​ కూడా ఇవ్వాలి.