హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి
  • ఆల్ పార్టీ మీటింగ్​లో వక్తల డిమాండ్
  • కేసీఆర్ సర్కార్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: కోదండరాం
  • కమీషన్ల కోసం కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకే కట్టబెడుతున్నరు: మధుయాష్కి

ఖైరతాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, నాసిరకంగా పనులు చేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రజోపయోగమా? లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగమా? అనే అంశంపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు, ఇంజనీర్లు, సీనియర్ జర్నలిస్ట్లు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయణ కాళేశ్వరంపై పవర్ పాయింట్​ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరాన్ని ఖజానాను కొల్లగొట్టడానికి ఉపయోగించిన తీరును కళ్లకు కట్టినట్టు వివరించారు. 

ఆస్తులు పెంచుకోవడానికే పనిచేస్తున్నరు: కోదండరాం

అధికారం ఆస్తులను పెంచుకుంటే కాళేశ్వరం అవుతుందని టీజేఎస్ చీఫ్​ కోదండరాం అన్నారు. చాలా గ్రామాలు ముంపునకు గురవడానికి కాళేశ్వరం తప్పుడు నిర్మాణమే కారణమని, తప్పు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఆస్తులు పెంచుకోవడానికే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్​ కమిషన్ల కోసం కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకిచ్చి రాష్ట్రాన్ని దోచి పెడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకుల ఆస్తులు ఉన్నపళంగా పెరిగాయని, ప్రజల బతుకులు మాత్రం ఆగం అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతిపై పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతికి కారణమైన కేసీఆర్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆప్​ లీడర్​ ఇందిరా శోభన్​ డిమాండ్ చేశారు. అవినీతి ఎవరు చేసినా బీజేపీ ప్రభుత్వం వదిలి పెట్టదని, కాళేశ్వరంలో అవినీతిపై కేంద్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు స్పష్టం చేశారు. కాళేశ్వరం ముంపుపై ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, వైఎస్సార్​టీపీ నేత ఏపూరి సోమన్న, ఉద్యమకారులు డాక్టర్ పృథ్విరాజ్, కత్తి వెంకటస్వామి, జయసారథిరెడ్డి, భగవాన్ రెడ్డి, తెలంగాణ విఠల్, ఇంజనీర్ విఠల్ రావు, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకులు మేకల కృష్ణ, పాలకూరి రాజు, పోగుల ప్రకాశ్, నాగార్జున్ రెడ్డి, స్వామి ముద్దం తదితరులు పాల్గొన్నారు.