IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ

IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ

కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణాపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంది. సోమవారం(ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత వేసింది. అలాగే, ఒక మ్యాచ్ నిషేధం విధించింది. 

హర్షిత్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు క్రమశిక్షణా కమిటీ తెలిపింది. నేరాన్ని అతను అంగీకరించినట్లు వెల్లడించింది.  అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా, ఒక మ్యాచ్ సస్పెండ్ చేయబడినట్లు తెలిపింది. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘనలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమైనదని, అందుకు కట్టుబడి ఉండాల్సిందే అని ఒక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రత్యర్థి ఆటగాళ్లకు ఫ్లయింగ్- కిస్‌లు

 హర్షిత్ రాణా  వికెట్ తీసిన ఆనందంలో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు ఫ్లయింగ్-కిస్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌కు ఫ్లయింగ్-కిస్ పంపినందుకు రానాకు అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించారు. అయినప్పటికీ, అతనిలో మార్పు రాలేదు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గతాన్ని మరిచిపోయి మరోసారి ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్ చేసుకోబోయాడు. కానీ జరిమానా గుర్తొచ్చి వెంటనే సెలబ్రేషన్స్‌ ఆపేశాడు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. అతని సంజ్ఞలు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండటంతో బోర్డు పెద్దలు చర్యలు తీసుకున్నారు.