కాళేశ్వరం ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్.. కొత్తగా ఒక్క ఎకరాకు నీరందలే

కాళేశ్వరం ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్.. కొత్తగా ఒక్క ఎకరాకు నీరందలే
  • ఎత్తి పోసిన నీళ్లన్నీ గోదావరి పాలు
  • మేడిగడ్డ బ్యారేజీ నుంచి కిందికి పోయింది వెయ్యి టీఎంసీలు
  • పైసా ఖర్చు లేని శ్రీరాంసాగర్​ నీళ్లపై చిన్నచూపు
  • ఎల్​ఎండీలోని నీళ్లన్నీ కాళేశ్వరం నీళ్లేనని కనికట్టు

హైదరాబాద్, వెలుగుగోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై వచ్చే నెలతో ఏడాది పూర్తవనుంది. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు.. తొలి ఏడాదిలో అనుకున్నంత నీటిని లిఫ్ట్ చేసిందా..? ఇంతకీ ఎంత ఆయకట్టుకు నీరందించింది..? అనేది ఆసక్తికరంగా మారింది. గోదావరి నదిపై కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది టార్గెట్. ఈ తొలి ఏడాది మోటార్లను ట్రయల్​ చేయటంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. పంప్​ హౌస్​​లను సక్సెస్​గా రన్​ చేసినా.. కొత్త ఆయకట్టుకు మాత్రం నీరందించడంలో ఫెయిలైంది.

ఎత్తిన నీళ్లన్నీ కిందికే

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసిన రెండు నెలల్లోనే అటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ఎగువన కడెం ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అప్పటివరకు ఎల్లంపల్లి,  సుందిళ్ల వరకు లిఫ్ట్ చేసిన నీళ్లన్నీ మళ్లీ గేట్లెత్తి గోదావరిలోకి వదిలేయాల్సి వచ్చింది. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ఎత్తేయటం తప్ప మరో గత్యంతరం లేకుండాపోయింది.

దీంతో జూన్‌‌, జులై నెలల్లో 40 రోజులకు పైగా శ్రమించి.. రూ. 50 కోట్ల కరెంటు వాడి.. ఎత్తిన నీళ్లన్నీ వదిలేయాల్సి వచ్చింది. దాదాపు 18 టీఎంసీల నీళ్లు తిరిగి గోదావరిలోకి పోయాయి. వీటితోపాటు ఈ ఏడాది పొడవునా మంచిగా కురిసిన వర్షాలతో వెయ్యి టీఎంసీల నీళ్లు మేడిగడ్డకు దిగువకు వదిలేయాల్సి వచ్చింది. దీంతో రివర్స్​ పంపింగ్​ ద్వారా ఎంత ఫలితం వచ్చింది? అదనంగా ఏం సమకూరింది? అనేది అంచనా వేయటం ఇరిగేషన్​ విభాగానికీ పరీక్షగా మారింది. ఈ ఏడాది అన్ని పంప్​ హౌస్ లను రన్​ చేయించి.. నీటిని మిడ్​ మానేరు వరకు లిఫ్ట్ చేయటాన్ని ఇరిగేషన్​ విభాగం తొలి ఏడాదిలో నమోదు చేసిన విజయంగా చెప్పుకుంటోంది.

నాలుగో వంతే లిఫ్టింగ్​

నిరుడు జూన్​21న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం నుంచి మొత్తం 225 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసి18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు సాగు నీరందిస్తామని సీఎం కేసీఆర్​ పలుమార్లు ప్రకటించారు. గత పదకొండు నెలల్లో  లిఫ్టింగ్‌‌ చేసిన నీళ్లను లెక్కగడితే అనుకున్న టార్గెట్​ రీచ్​ కాలేదని తేలిపోతోంది. ఇప్పటివరకు మేడిగడ్డ బ్యారేజీ నుంచి రివర్స్​ పంపింగ్​ ద్వారా 60 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు. అంటే తొలి ఏడాదిలో కేవలం 26 శాతం నీళ్లనే లిఫ్ట్ చేశారు. అన్నారం బ్యారేజీ నుంచి 56 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీ నుంచి 53 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌‌ చేసి ఎల్లంపల్లికి ఎత్తిపోశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్​ మానేర్​ రూట్​లో నందిమేడారం నుంచి 68 టీఎంసీలు, లక్ష్మీపూర్ పంపుహౌస్‌ నుంచి 66 టీఎంసీలు లిఫ్ట్​ చేశారు. ఈ భారీ మోటార్లన్నీ నడిపేందుకు కరెంటు బిల్లుల ఖర్చే వందల కోట్ల రూపాయలు దాటిపోయింది.

లింక్​ వన్​ సంపూర్ణం.. పారని కొత్త ఎకరం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ పనులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మొత్తం 7 లింక్‌‌లుగా పనులు చేపట్టారు. లింక్​ వన్​లో మేడిగడ్డ(లక్ష్మీ), అన్నారం(పార్వతి), సుందిళ్ల(సరస్వతి) బ్యారేజీలతోపాటు, మూడు పంప్‌‌హౌజ్‌లున్నాయి. లింక్‌‌  వన్  కింద 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలి. ఇదంతా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోనే ఉంటుంది. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పటికీ.. సైడ్​ కాల్వలు, కొత్త ఆయకట్టుకు నీరందించే ప్లానింగ్​ లేకపోవటంతో.. లింక్​ వన్​లో ఒక్క ఎకరం భూమికి కూడా కాళేశ్వరం నీళ్ల తడి అందలేదు.

ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి దాకా..!

తొలి ఏడాదిలో ఎస్సారెస్పీ స్టేజీ 2 లో నీరందించటంలో మాత్రమే కాళేశ్వరం సక్సెసయింది. ఎస్సారెస్పీ స్టేజీ 1​, స్టేజీ 2 ఆయకట్టు చివరి భూముల వరకు 50 టీఎంసీల కాళేశ్వరం నీళ్లను ఇచ్చినట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రధానంగా ఎల్​ఎండీకి దిగువన ఆరు నెలల పాటు కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేశారు. దీంతో స్టేజ్​ 2 టెయిలెండ్​ భూముల వరకు నీళ్లందాయి. గతంలో 30 వేల ఎకరాలకు మించి సాగు జరగని సూర్యాపేట జిల్లాలో కాల్వలు, చెరువుల కింద అదనంగా 1.50 లక్షల ఎకరాల సాగు జరిగింది. ఎస్సారెస్పీ స్టేజీ- వన్​ కింద 5 లక్షల ఎకరాలు,  స్టేజీ -2 కింద 2.50 లక్షల ఎకరాలు యాసంగిలో సాగులోకి వచ్చాయని వ్యవసాయ శాఖ లెక్కలు తీసింది. కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకున్నా కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 7.50 లక్షల ఎకరాల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టును స్టెబిలైజ్‌ అయిందని అధికారులు చెబుతున్నారు. లింక్‌ -4 లోని అనంతగిరి, రంగనాయకసాగర్‌ కింద 400లకు పైగా చెరువులు నింపారు. ఇవి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనివేనని ఇంజనీర్లు చెప్పారు. మిడ్​మానేరుకు ఎగువన  ఎస్సారెస్పీ వరద కాల్వకు అధికారులు 34 తూములు ఏర్పాటు చేశారు. దీంతో రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లో చెరువులు, కుంటల పరిధిలో నాలుగు వేల ఎకరాలకు సాగు నీరందింది.

ఎక్కడెన్ని నీళ్లివ్వాలి..!

మొత్తం 20  జిల్లాలు 31 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త, పాత ఆయకట్టు కలిపితే 37.08 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ఇందులో ఎస్సారెస్పీ స్టేజీ 1 కింద 9.68 లక్షల  ఎకరాలు, ఎస్సారెస్పీ 2 కింద 4.40 లక్షల ఎకరాలు, ఫ్లడ్‌‌ ఫ్లో కెనాల్‌ ‌కింద రెండు లక్షల ఎకరాలు, నిజాంసాగర్‌‌ ప్రాజెక్ట్‌ ‌కింద 2.34 లక్షల ఎకరాలు, సింగూర్‌ ‌ప్రాజెక్ట్‌‌ కింద 40 వేల ఎకరాల పాత ఆయకట్టుకు సాగు నీరందించాలనేది లక్ష్యం. కానీ..  లింక్‌‌  2 నుంచి 7 వరకు చేపట్టిన పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

శ్రీరాంసాగర్​ నీళ్లకు రాంరాం

కాళేశ్వరం నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఎస్సారెస్పీకి ప్రాణం పోస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సారెస్పీ నీళ్లను పట్టించుకోలేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గ్రావిటీపై వచ్చే ఈ నీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అదే టైమ్​లో భారీ ఖర్చుతో లిఫ్ట్ చేసే కాళేశ్వరం నీటితోనే ఎల్​ఎండీని నింపింది. ఈ ఏడాది ఎల్ఎండీ దిగువన ఇచ్చిన 50 టీఎంసీల నీళ్లన్నీ కాళేశ్వరం నుంచి ఇచ్చినవేనని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఈ ప్రచారం చేసుకునేందుకే.. ఎస్సారెస్పీకి వరద వచ్చినా ఆ నీటిని తీసుకోకుండా సైడ్​ట్రాక్​ చేసిందనే విమర్శలున్నాయి.

 

11లక్షల మంది మన రాష్ట్రం నుంచి వదిలి వెళ్లారు