కాళేశ్వరం లక్ష్యం సముద్రం పాలు

కాళేశ్వరం లక్ష్యం సముద్రం పాలు
  • తొిలి సీజన్ లో ప్రభుత్వం అంచనాలన్నీ తలకిందులు
  • అనుకున్నది 180 టీఎంసీలు.. లిఫ్ట్ చేసింది 18 టీఎంసీలు
  • 45 రోజులుగా మోటార్లు బంద్‌‌‌‌.. మేడిగడ్డ ఓపెన్​
  • వరద సమయంలో నీటిని లిఫ్ట్ చేయడంలో ఫెెయిల్
  • వెయ్యి టీఎంసీల గోదావరి వరద సముద్రానికే

వెలుగు నెట్ వర్క్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా 90 రోజులైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు, వరదల సీజన్​ చివరి దశకు చేరింది. మూడు నెలల్లో ఈ భారీ ప్రాజెక్టు ద్వారా అనుకున్న లక్ష్యం ఎంత మేరకు నెరవేరింది..? ఏటేటా సముద్రం పాలయ్యే వరద నీటిని ఎంత మటుకు నిల్వ చేయగలిగిందనేది  అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ ఏడాది జూన్​ 21 సీఎం కేసీఆర్​ మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించి, కన్నెపల్లి పంప్​ హౌజ్​ మోటార్లను ఆన్​ చేశారు.  అక్కణ్నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని లిఫ్ట్ చేసి..180 టీఎంసీలను లిఫ్ట్ చేయాలనేది ప్లాన్​. కానీ ప్రభుత్వం అనుకున్నంత నీటిని ఎత్తిపోయ లేకపోయింది. ఇప్పటి వరకు కేవలం 18 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసింది. ఈ సీజన్​లోనూ 1000 టీఎంసీలకు పైగా నీళ్లు మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు వెళ్లి సముద్రం పాలయ్యాయి.  ప్రాణహిత వరద పోటెత్తటంతో పాటు ఊహించని విధంగా మానేరు ప్రవహించటం, ఎగువన కడెం నుంచి వరద పెరగటంతో తొలి  సీజన్ దాదాపుగా ​ ఫెయిలైందని ఇంజనీర్లు అబిప్రాయపడుతున్నారు.

కానీ ఈ ఏడాది ట్రయల్ రన్​ మాత్రమే అని… వచ్చే ఏడాది కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ వరకు నీటిని తరలిస్తామని, 50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ తాజాగా ప్రకటించారు. తొలి సీజన్​లో మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్​ హౌస్‌‌​ నుంచి అన్నారం బ్యారేజీ, అక్కణ్నుంచి సుందిళ్ల.. మూడో దశలో ఎల్లంపల్లి రిజర్వాయర్​కు నీటిని లిఫ్ట్ చేసే మోటార్ల వెట్​ రన్​ సక్సెసయింది. కానీ గోదావరి వరద నీటిని వృథా చేయకుండా ఒడిసి పట్టలేకపోయింది. భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించింది. ప్రభుత్వమే మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్లు తెరిచి మరీ నీళ్లను దిగువకు పంపింస్తుంది. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే కెపాసిటీ ఉన్న మోటార్లు ఆఫ్​ చేయాల్సి వచ్చింది. ఎగువనుంచి వరద వస్తుందని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌ల వద్ద మోటార్లను అధికారులే బంద్‌‌‌‌‌‌‌‌ చేసి పెట్టారు. దీంతో కడెం నుంచి ఎల్లంపల్లి బ్యారేజీకి చేరిన నీటినే మిడ్​మానేరుకు లిఫ్ట్ చేసినట్లు చూపించారు.

రివర్స్​ పంపింగ్​.. గేట్లు ఓపెన్​

మూడు నెలల వ్యవధిలో  మేడిగడ్డ నుంచి 12 టీఎంసీలు, అన్నారం నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. ఎగువన మానేరు నుంచి వచ్చిన వరదతో.. అన్నారం వరకు ఎత్తిపోసిన నీటిని కూడా నిల్వ చేయలేకపోయారు. కడెం నుంచి వచ్చిన వరదతో  ఎల్లంపల్లి గేట్లు ఎత్తాల్సి రావటంతో ఇంజనీర్లు చేతులెత్తేశారు. సుందిళ్లకు దిగువన మానేరు కూడా పోటెత్తటంతో అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోసిన 12 టీఎంసీల నీటిని సైతం గేట్లు తెరిచి మరీ కిందికి పంపించారు.

మేడిగడ్డ 20 గేట్స్ ఓపెన్​

కన్నెపల్లి వద్ద జూన్‌‌‌‌‌‌‌‌ 21 నుంచి జులై 30 వరకు 6 మోటార్లతో   అన్నారం బ్యారేజీలోకి రివర్స్‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కెపాసిటి 16.17 టీఎంసీలు కాగా అధికారులు 9 టీఎంసీల లోపే నీటి నిల్వ ఉంచుతున్నారు. తర్వాత వచ్చిన వరదను గేట్లు తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నీటి నిల్వ 5.485 టీఎంసీలు,  1.68 లక్షల క్యుసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉంది. ఇరవై గేట్లను తెరిచి 1.60 లక్షల క్యుసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సుందిళ్ల అరగంటకే బంద్​

జులై నెలాఖరున సుందిళ్ల పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ నుంచి ఎల్లంపల్లి బ్యారేజీలోకి నీటిని రివర్స్‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్స్ చేశారు.  ఒక మోటార్‌‌‌‌‌‌‌‌ను అరగంట నడిపి బంద్‌‌‌‌‌‌‌‌ చేశారు. సుందిళ్ల కెపాసిటీ 8.89 టీఎంసీలు.

రూ.55 కోట్ల కరెంటు బిల్లులు

కాళేశ్వరం  లిఫ్టింగ్​  మోటార్లతో కరెంటు బిల్లుల మోత మాత్రం మోగింది. తొలి మూడు నెలల్లో రూ.55 కోట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లులు అయ్యాయి. కన్నెపల్లి వద్ద రూ.39.80 కోట్లు, అన్నారం రూ.11.80 కోట్లు, సుందిళ్ల రూ.3.46 కోట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లులు వచ్చాయి.

అన్నారం ఎత్తిందంతా కిందికే

జులైలో అన్నారం పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ నుంచి కూడా 4 మోటార్లతో సుందిళ్ల బ్యారేజీలోకి 5.98 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు. బ్యారేజీ కెపాసిటి 10.87 టీఎంసీలు. పది టీఎంసీల లోపే నిల్వ చేస్తున్నారు. వరద వస్తే గేట్లు తెరిచి నీటిని వదిలేస్తున్నారు. శుక్రవారం ఇక్కడ నీటి నిల్వ 9.47 టీఎంసీలు.

కడెం నీళ్లకు కాళేశ్వరం పేరు

తొలి సీజన్​లో కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీరు ఎల్లంపల్లికి చేరనేలేదు.  ఆదిలాబాద్​లోని కడెం నుంచి వచ్చిన నీటితో ఎల్లంపల్లి నిండి.. గేట్లు ఎత్తాల్సి వచ్చింది. కాళేశ్వరం స్టేజీ టూలో నిర్మించిన నందిమేడారం, లక్ష్మిపూర్ మోటార్లను సైతం ప్రభుత్వం విజయవంతంగా  రన్​ చేసింది. దీంతో ఆగస్టు నెలలో మిడ్​ మానేరకు 12.26 టీఎంసీలు, వరద కాల్వ ద్వారా రాంపూర్​, రాజేశ్వరపురం లిఫ్ట్లను ఆన్​ చేసి  ఎస్సారెస్పీకి రివర్స్​ పంపింగ్​ ద్వారా 0.815 టీఎంసీల నీటిని తరలించారు. ఈ నీరు ఇంకా వరద కాల్వలోనే నిలిచి ఉంది. ఎస్సారెస్పీ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేసే ప్రయత్నం ఇంకా నెరవేరలేదు.

ఎత్తిన నీళ్లన్నీ సముద్రం పాలు

గడిచిన నెలన్నర రోజుల్లో వెయ్యి టీఎంసీలకు పైగా నీళ్లు మేడిగడ్డ బ్యారేజీకి దిగువన కిందికి వెళ్లిపోయినట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ ఇంజినీర్లే చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జూలై నెల 30న 4.20 లక్షలు, 31న 2.75 లక్షలు, ఆగస్టు 1న  4 లక్షలు, 2న 4.60 లక్షలు, 3న 5.27 లక్షల క్యుసెక్కుల నీరు వృథాగా కిందికి వెళ్లిపోయింది. అన్నారం బ్యారేజీ వద్ద కూడా సుమారు 200 టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి వెళ్లిపోయాయి.