మోడీకి కేసీఆర్, జగన్ స్క్రిప్ట్: టీడీపీ నేత రావుల

మోడీకి కేసీఆర్, జగన్ స్క్రిప్ట్: టీడీపీ నేత రావుల

ఢిల్లీలో ఉన్న నేతలకు చివరి రోజులు దగ్గర పడ్డాయని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తామన్నారని, కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేశాక రివర్స్ అయ్యారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలని, బీజేపీ నాయకులే డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అమలు చేయాలని కోరితే నీతి అయోగ్ ను సాకుగా చూసించి, ఆ హామీని నీరుగార్చారని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ సహాయం చేయకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై ఎదురుతిరిగిన వారిపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సహా అన్ని హామీలను గాలికొదిలేశారని రావుల అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కిందన్నారు.

ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి

గుంటూరు వచ్చిన ప్రధానమంత్రి మోడీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారని రావుల అన్నారు. అక్కడ ప్రసంగించేందుకు ప్రధానికి స్క్రిప్ట్ జగన్, కేసీఆర్ రాసిచ్చినట్లు ఉందన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఆపేసినా ఇక్కడి నాయకులు పట్టించుకోకుండా అపహాస్యం చేస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు విమర్శించిన కవిత, ఇప్పుడు కలిసి భోజనాలు చేస్తున్నారని ఆరోపించారు.

నరేంద్రమోడీపై చంద్రబాబు వ్యక్తి గతంగా దాడి చేయట్లేదని, మోడీ విధానాలపైనే పోరాటం చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో ఉన్న నాయకులకు చివరి రోజులు దగ్గర పడ్డాయని, ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన హామీలపైన టీఆర్ఎస్ పోరాటం చేయలని డిమాండ్ చేశారు రావుల చంద్రశేఖర్ రెడ్డి.