ఊరి చెరువుపై ఢిల్లీ పెత్తనం

ఊరి చెరువుపై ఢిల్లీ పెత్తనం
  • పాసైతే కేంద్రం పరిధిలోకి చెరువులు, కుంటలు
  • ఆలోగా రాష్ట్రాలు వాటర్‌‌ సెక్యూరిటీ చట్టాన్ని తేవాల్సిందే
  • లేదంటే కేంద్రం జాబితాలోకి నీటి వనరులు
  • త్వరలోనే పార్లమెంట్​కు రివర్‌‌ బేసిన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బిల్లు

మన ఊరి చెరువు మీద ఢిల్లీ పెత్తనం చేయనుందా? చెరువులు, కుంటలు సహా చిన్ననీటి వనరులు, నీటి యాజమాన్య బోర్డులన్నీ కేంద్రం అధీనంలోకే వెళ్తాయా? ఎన్డీఏ సర్కారు త్వరలో పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టనున్న ‘రివర్‌‌ బేసిన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌’ బిల్లు పాసైతే ఇవన్నీ నిజమవుతాయి. అలా జరగకూడదంటే మన రాష్ట్ర సర్కారు తక్షణమే మేల్కోవాల్సి ఉంది. నీటి వనరులను రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నందునే తామీ బిల్లు తెస్తున్నామని చెబుతున్న  కేంద్ర జలశక్తి శాఖ, ఆలోగానే అన్ని అసెంబ్లీలు నీటి భద్రత బిల్లును ఆమోదించాలని తేల్చిచెబుతోంది.

నీటి వనరులపై అధికారాల కోసమేనా?

నదుల పునరుజ్జీవం, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా ‘రివర్‌‌ బేసిన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌’  బిల్లు తీసుకురానున్నట్లు కేంద్రం చెబుతున్నా, మొత్తం నీటి వనరులపై అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఢిల్లీ సర్కారు ప్రయత్నిస్తోందని వాటర్‌‌ మ్యాన్‌‌ ఆఫ్‌‌ ఇండియాగా ఖ్యాతిగాంచిన రాజేంద్రసింగ్‌‌ హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాలు మేల్కోకుంటే జల వనరులతోపాటు నీటి యాజమాన్య బోర్డులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోతాయని చెప్తున్నారు. ఆహార భద్రత హక్కు, విద్యాహక్కులాగానే నీటి హక్కు దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, ఆర్టికల్‌‌ 21 దీనిని నిర్దేశించిందని పేర్కొంటున్నారు.

ఇలాంటి మోసపూరితమైన ఈ చట్టాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలనే నినాదంతో రాజేంద్రసింగ్‌‌ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖ మంత్రులు, ఇతర ప్రముఖులను కలుస్తున్నారు. కేంద్రం తీసుకురాబోతున్న కొత్త చట్టంపై వారికి అవగాహన కల్పించి ‘జల హక్కు’ బిల్లుకు శాసనసభల్లో ఆమోదముద్ర వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏమిటీ బిల్లు?

‘రివర్‌‌ బోర్డ్‌‌ యాక్ట్‌‌ -–1956’కు పలు సవరణలతో  కేంద్రప్రభుత్వం ‘రివర్‌‌ బేసిన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బిల్‌‌‌‌‌‌–- 2018’ను తీసుకురాబోతోంది.  ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌‌ బిల్లును సిద్ధం చేసింది. దేశంలోని 13 ప్రధాన నదుల అంతర్రాష్ట్ర జల వివాదాలను దీని పరిధిలో చేర్చారు. పెరిగిన జనాభా అవసరాల రీత్యా దేశీయ వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం, ఇతర అవసరాల కోసం జల వనరుల మేనేజ్‌‌మెంట్‌‌ను సవరించాల్సి ఉందని చెబుతున్నారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణా, పెన్నా జల వివాదాలను దీని పరిధిలో చేర్చారు. జల వివాదాల పరిష్కారానికి ఒకే ట్రిబ్యునల్‌‌ ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. గత బుధవారం జరిగిన కేబినెట్‌‌ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్‌‌ వర్షాకాల సమావేశాల్లోనే రివర్‌‌ బేసిన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బిల్లు ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ బిల్లుకు పార్లమెంట్‌‌ ఆమోదం తెలిపే లోగానే రాష్ట్ర అసెంబ్లీలు వాటర్‌‌ సెక్యూరిటీ బిల్లు పెట్టి ఆమోదం తెలిపితే, జలవనరులపై అధికారం రాష్ట్రం వద్దే ఉండిపోతుందని రాజేంద్రసింగ్‌‌ చెప్తున్నారు. తాను చేసిన ప్రయత్నాల వల్లే మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపిందని, మిగతా రాష్ట్రాలు కూడా అదే దారిలో చట్టాలు చేయాలని ఆయన కోరుతున్నారు.