దేశవ్యాప్త సమ్మెకు సింగరేణిలో సమాయత్తం

దేశవ్యాప్త సమ్మెకు సింగరేణిలో సమాయత్తం

కోల్​బెల్ట్, వెలుగు: దేశవ్యాప్త సమ్మెకు సింగరేణిలోని మెజారిటీ కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. శుక్రవారం తలపెట్టిన సమ్మెను సక్సెస్​చేసేందుకు ఇప్పటికే సింగరేణిలోని 18 ఓసీపీలు, 24 బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేశాయి. కోలిండియా స్థాయిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ తదితర సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్​ మోర్చాలు, సింగరేణిలోని నాలుగు జాతీయ కార్మిక సంఘాలతోపాటు కొన్ని సింగరేణి కార్మిక సంఘాలు 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

 కార్మిక నాయకులు ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కోలిండియా వాటాలను అమ్మడం, 160 బొగ్గు గనులను క్యాపిటల్​మానిటైజేషన్ పేరు కింద అమ్మివేయడం, వేలం ద్వారా బొగ్గు బ్లాకుల కేటాయింపు, 44 కార్మిక చట్టాల మార్పు,  ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్​కు పదేండ్లుగా పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటితోపాటు సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించాలని, పర్మినెంట్, కాంట్రాక్ట్​ కార్మికుల సమస్యలు, డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని ప్రచారం చేశాయి. సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. 

సమ్మెతో 2.5 లక్షల టన్నులు నష్టం

దేశవ్యాప్త సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని, కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది.  ఒక్కరోజు సమ్మెతో 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని చెబుతోంది. కార్మికులు వేతనాలు నష్టపోతారని సూచిస్తోంది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఓపెన్​కాస్ట్​బొగ్గు గనులను పూర్తిస్థాయిలో నడిపించేందుకు ప్లానింగ్​చేసింది. దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలని, డ్యూటీకి హాజరుకావాలని కొన్ని కార్మిక సంఘాలను సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్​ విజ్ఞప్తి చేశారు. ఒక్కరోజు సమ్మెతో సంస్థ నష్టపోయే ఉత్పత్తి విలువ సుమారు రూ.85 కోట్లు ఉంటుందని, కార్మికులు దాదాపు రూ.18కోట్ల వేతనాలు కోల్పోతారని తెలిపారు.