బ్రహ్మపుత్ర మింగేస్తోంది..20 ఏళ్లలో మజూలీ దీవి కనుముగు

బ్రహ్మపుత్ర మింగేస్తోంది..20 ఏళ్లలో మజూలీ దీవి కనుముగు
  • లక్షా 70 వేల మంది బతుకులు గందరగోళం
  • 12 ఏళ్లలో పది వేల మంది వలస
  • హిమాలయ గ్లేసియర్లు కరగడమే కారణం

బ్రహ్మపుత్ర.. హిమాలయాల్లో పుట్టి ఎంతో మందికి బతుకుదెరువును చూపిస్తున్న జీవనది. కానీ, ఇప్పుడు కథ మారిపోయింది. బతుకు చూపించాల్సిన ఆ జీవనది చిన్నచిన్నగా భూమిని ఆక్రమించేస్తూ జనాల జీవితాలను మింగేస్తోంది. 2040 నాటికి ఒక దీవి మొత్తాన్నే తనలో కలిపేసుకునేందుకు శరవేగంగా పరుగులు పెడుతోంది. ఒక్క బ్రహ్మపుత్ర నదే కాదు. హిమాలయాల్లో పుట్టిన నదులు, సరస్సులన్నింటిదీ అదే దారి. 165 కోట్ల మంది బతుకులను ముంచేసేలా ఎప్పటికప్పుడు తమ పరిధిని పెంచేసుకుంటున్నాయి. దానికి కారణాలేంటని వెతుక్కుంటే చివరకు వేలు చూపించేది మనవైపే. గ్లేసియర్లు కరిగిపోవడం వల్ల నదులు, సరస్సుల పరిధి పెరుగుతోంది. దానికి కారణం టెంపరేచర్లు పెరగడం. మరి, ఆ టెంపరేచర్లు పెరగడానికి కారణం మనిషే. దాని వెనక మరెన్నో కారణాలూ ఉన్నాయి. కొందరు ఇంటర్నేషనల్​ సైంటిస్టుల పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

20 ఏళ్లలో మజూలి దీవి కనుమరుగు

మజూలి.. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలోని ఓ దీవి. 16వ శతాబ్దంలో అది 1250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. కానీ, ఇప్పుడు అది 515 చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది. 1890 నుంచి బ్రహ్మపుత్ర నది విశ్వరూపం చూపిస్తుండడంతో ఆ దీవి భవిష్యత్తే ప్రశ్నార్థకమైపోయింది. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్​ టెంపరేచర్లు పెరిగి హిమాలయాల్లోని గ్లేసియర్లు కరిగిపోతున్నాయని, దానికితోడు అకాల వరదలతో బ్రహ్మపుత్ర నది ఎప్పటికప్పుడు పెరిగిపోతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2040 నాటికి మజూలి దీవి మొత్తం నదిలో కలిసిపోతుందని చెబుతున్నారు. దాని వల్ల లక్షా 70 వేల మంది జీవితాలు అగమ్యగోచరంగా మారుతాయంటున్నారు. దాంతో పాటు పంటలపై పెను ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. నది పెరిగిపోవడం వల్ల భూమిలోని సారం మొత్తం పోతుందని చెబుతున్నారు. దీవిలో ఎక్కువగా మిషింగ్​ తెగకు చెందిన జనాలే ఉంటున్నారు. నది పెరిగిపోయి భూములను మింగేస్తుండడంతో గత 12 ఏళ్లలో 10 వేల మంది వలసెళ్లిపోయారు. ఇంకొందరు నది పెరుగుతున్న కొద్దీ ఎత్తు ప్రదేశాలకు మారిపోతున్నారు. కానీ, బ్రహ్మపుత్ర నది మాత్రం తగ్గట్లేదు. ‘‘2050 నాటికి మన దేశ జనాభా 160 కోట్లకు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది’’ అని వాటర్​ అండ్​ ల్యాండ్​ మేనేజ్​మెంట్​ ఇనిస్టిట్యూట్​ మాజీ ప్రొఫెసర్​ ప్రదీప్​ పురందరీ చెప్పారు.

పాకిస్థాన్​ ఊరు మునిగిపోతోంది

బ్రహ్మపుత్ర విషయాన్ని కాసేపు పక్కనపెడితే, పాకిస్థాన్​లోని ఓ ఊరికి హిమాలయాలతో పెను ముప్పు పొంచి ఉంది. హిందూకుష్​ పర్వత శ్రేణుల్లోని గ్లేసియర్లు కరుగుతుండడంతో అక్కడ పుట్టిన నదులు, సరస్సుల్లో నీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. కారాకోరం పర్వతశ్రేణుల్లో ఉన్న హసనాబాద్​ను షిస్పర్​ గ్లేసియర్​ కమ్మేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. రోజూ నాలుగు మీటర్ల చొప్పున ఆ గ్లేసియర్​ ముందుకు దూసుకొచ్చేస్తోంది. మామూలుగా గ్లేసియర్లు కిందకు దూసుకొచ్చే రేటుతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా ఐస్​, మంచు ముక్కలు వస్తున్నాయి. దీని వల్ల ఆ గ్లేసియర్​లోని సరస్సుల్లో నీటి మట్టాలు పెరిగి వరదలు ముంచెత్తుతున్నాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ వేగంతో షిస్పర్​ గ్లేసియర్​ జనావాసాల్లోకి దూసుకొచ్చేస్తోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2100 నాటికి భూమికి ‘మూడో ధ్రువం’గా పిలిచే హిందూకుష్​ పర్వత శ్రేణుల్లోని మూడో వంతు గ్లేసియర్లు కనుమరుగయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 2025 నాటికి పాకిస్థాన్​లో నీటి కొరత ముప్పు ఉందంటున్నారు. యూఎన్​డీపీ అంచనాల ప్రకారం హిందూకుష్​ పర్వత శ్రేణుల్లో 3 వేల గ్లేసియర్​ సరస్సులున్నాయి. వాటిలో 33 సరస్సులతో పెనుముప్పు పొంచి ఉంది.

అభివృద్ధి చాటున విధ్వంసం

డ్రాగన్​ కంట్రీ చైనా అభివృద్ధి చాటున కోట్లాది జనాల భవిష్యత్​ను గందరగోళంలో పడేస్తోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. థాయ్​లాండ్​, లావోస్​, కంబోడియా, వియత్నాం వంటి దేశాలు సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​కు ప్రణాళికలు రూపొందించుకోలేకపోతున్నాయని అంటున్నారు. ‘షేర్డ్​ రివర్​, షేర్డ్​ ఫ్యూచర్​’ పేరిట వివిధ దేశాలతో నదీ జలాల వినియోగంపై చైనా ఒప్పందం చేసుకున్నా, కరెంట్​ తయారీ కోసం డ్యాములను కట్టడం, వరదలు పోటెత్తి ఒకేసారి కిందకు రావడం వల్ల కొన్ని నదులపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. ఇప్పటికే మెకాంగ్​ నదిపై ఆ ప్రభావం కనిపిస్తోందని అంటున్నారు. చేపలు బాగా తగ్గిపోయాయనిచెబుతున్నారు. ఇటు నదిలో బతికే డాల్ఫిన్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని అంటున్నారు. డెవలప్​మెంట్​ పేరుతో యాంగ్జీ నదిని కాలుష్య కాసారంగా చైనా మార్చేసిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని వల్ల 40 కోట్ల మందికి తాగునీటి సమస్యలు ఏర్పడే ముప్పు పొంచి ఉందంటున్నారు. చైనాలోని 250 గ్రామాలు కేన్సర్​ కోరల్లో చిక్కుకున్నాయని, అందులో ఎక్కువ ఊళ్లు యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.