బిడ్డ ట్రీట్మెంట్ కోసం  రక్తం అమ్ముకున్నడు

బిడ్డ ట్రీట్మెంట్ కోసం  రక్తం అమ్ముకున్నడు

భోపాల్ : మనకు అమ్మ జన్మనిస్తే నాన్న ఆలనా పాలనా చూస్తాడు. తన ఎదపై లాలిస్తూ సమస్యలు తెలియకుండా పెంచుతాడు. మనలోని లోపాలను సరిచేస్తూ గమ్యం వైపు నడిపిస్తాడు. మన ఆశలే ఆయువుగా.. గెలుపే లక్ష్యంగా బతుకుతాడు. తానే పరిస్థితిలో ఉన్నా మనకు మాత్రం నేనున్నాని ధైర్యం చెబుతూనే ఉంటాడు. మనకొచ్చే ప్రతి కష్టానికి అడ్డుగా నిలబడి కాపాడతాడు. ఒకవేళ అలా కాపాడలేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నాన్న వెనకాడడు. అది తండ్రి ప్రేమంటే.!!  అదిగో అలాంటిదే ఈ కథనం. కన్నకూతురు రోడ్డు ప్రమాదంలో మంచం పాలవ్వడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. అసలే ఆర్థిక ఇబ్బందులు.

ఎలా ఆమెను కాపాడుకోవాలో తెలియక తన రక్తాన్ని అమ్మి ట్రీట్మెంట్ చేయించాడు. కుటుంబాన్ని పోషించేందుకు కూడా తన రక్తాన్నే పెట్టుబడిగా మార్చాడు. అనాగ్యోంతో బలహీన పడిపోయాడు. సోంత వాళ్లను కాపాడుకోలేకపోతున్నాననే నిస్సహాయతతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌‌లోని సాత్నాలో ఉన్న ట్రాన్స్‌‌పోర్ట్ నగర్‌‌కు చెందిన ప్రమోద్ గుప్తా దంపతులకు అనుష్క(21), ఉదయ్‌‌ (18), రైనా(12) సంతానం. అనుష్క బాగా చదివేది. బోర్డ్ ఎగ్జామ్స్‌‌లో టాపర్ గా నిలిచి సన్మానాలు కూడా పొందింది. ఆమెకు 5 ఏండ్ల కిందట యాక్సిడెంట్ కావడంతో నడుముకు బలమైన దెబ్బతగిలింది. దాంతో  అనుష్క నడవలేని స్థితిలో మంచాన పడింది.

బిడ్డకు వచ్చిన కష్టాన్ని చూసి తండ్రి ప్రమోద్ గుప్తా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. వెంటనే  తన ఇంటిని, దుకాణాన్ని అమ్మేసి, లక్షల్లో అప్పులు చేసి అనుష్కకు ట్రీట్మెంట్ చేయించాడు. అయినా ఆమెకు నయం కాలేదు. సాయం చేయాలని ప్రభుత్వ ఆఫీసర్లను, బంధువులను కోరాడు. ఎవ్వరూ స్పందించలేదు. ఆర్థికంగా దిగజారిపోవడంతో కుటుంబానికి పూట గడవడమే కష్టంగా మారింది. దాంతో ప్రమోద్ తన రక్తాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో గ్యాస్ సిలిండర్, ఇతర వస్తువులు తెచ్చేవాడు.

అనుష్క మెడిసిన్స్, ట్రీట్మెంట్ కోసం కూడా అలా అనేక సార్లు రక్తాన్ని అమ్ముకున్నాడు.  కుటుంబ రోజువారీ అవసరాలను కూడా తీర్చలేకపోయాడు. ఈ నిస్సహాయ స్థితిని భరించలేకపోయాడు.  కుటుంబానికి తాను కూడా భారం కాకూడదని నిర్ణయించుకుని మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రమోద్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాత్నాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.